కౌండిన్య ఎలిఫెంట్ శాంచురీని నుంచి మేతకోసం అడవిని దాటి పంట పొలాల్లోకి వచ్చే ఏనుగులకు కరెంట్ పెద్ద శత్రువులా మారింది. ఇప్పటి వరకు కరెంట్ షాక్‌లతో 14 ఏనుగులు మృతిచెందగా.. తాజాగా బైరెడ్డిపల్లె మండలం నల్లగుట్లపల్లె వద్ద మరో ఆడ ఏనుగు కరెంటుకు బలైంది. వంటిపై దురద తీర్చుకోవడానికి కరెంటు స్థంభాలను రుద్దడం, తొండంతో విరగ్గొడుతుండడంతో తీగలు పైన పడుతున్నాయి. మరికొన్ని చోట్ల రైతుల పొలాల వద్ద తక్కువ ఎత్తులోని 12కేవీ కరెంటు వైర్లు తగిలి మృతిచెందుతున్నాయి.
చిత్తూరు: కౌండిన్య అభయారణ్యంలో కరెంటుకు ఏనుగులు బలి అవుతున్నాయి. ఇప్పటి పలు ఘటనల్లో 20 ఏనుగులు మృతిచెందగా, ఇందులో 15 ఏనుగులు కరెంట్ తీగలు తగిలి చనిపోవడం బాధాకరం. అభయారణ్యంలో మొత్తం వందకుపైగా ఏనుగులున్నాయి. ఇవి గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ముసలిమొడుగు, జగమర్ల, మొగిలిఘాట్, నెల్లిపట్ల, వెంగంవారిపల్లి, తోటకనుమ ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతున్నాయి.
మదపుటేనుగులు ఒంటరిగానే సంచరిస్తున్నాయి. కౌండిన్య అభయారణ్యం నుంచి ఏనుగులు బయటికి రాకుండా అటవీశాఖ నిర్మించిన ఎలిఫెంట్ ట్రెంచీలు, సోలార్‌ఫెన్సింగ్ పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు. తెలివైన జంతువుగా పేరున్న గజరాజులు ట్రెంచీలను పూడ్చి, బండలను వాటిల్లోకి దొర్లించి, సోలార్ ఫెన్సింగ్‌ను విరగ్గొట్టి అడవి నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఏనుగుల సమస్యకు శాశ్వతచర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో కౌండిన్యాలో ఏనుగుల జాడ కనుమరుగైయ్యే అకాకాశం ఉంది.
బలమైన ఫెన్సింగ్ నిర్మాణంతోనే కట్టడి
కౌండిన్యా అడవిలో 66 కిలోమీటర్ల మేర సోలార్ ఫెన్సింగ్‌ను గతంలో నిర్మించారు. ఇందులో కొన్ని చోట్ల సోలార్ ఫెన్సింగ్‌కు అమర్చిన డీసీ బ్యాటరీలు పనిచేయక విద్యుత్ ప్రసరించడం లేదు. కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్‌లో మరీ తేలిగ్గా ఉన్న పైపులున్నచోట వీటిని ఏనుగులు తొక్కి నాశనం చేస్తున్నాయి. సోలార్ ఫెన్సింగ్‌తోబాటు కౌండిన్య అటవీప్రాంతంలో 12 చోట్ల 74 కిలోమీటర్లమేర ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచెస్ పనులను గతంలో చేపట్టారు. అయితే ట్రెంచికి మధ్యలో రాతి బండల కారణంగా అక్కడక్కడ గ్యాప్‌లున్నాయి.
ట్రెంచి వెడల్పు మూడు మీటర్లుగానే ఉంది. ఏనుగులు కొన్ని చోట్ల గుంతలు ఉన్న గుట్టల గుండా, లేదా గుంతల్లోకి మట్టిని నింపి వెలుపలికి వస్తున్నాయి. కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఏనుగులు అడవిలోంచి బయటకు రాకుండా పాత రైలు పట్టాలకు ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసినట్టు ఇక్కడా చేపట్టాలి. స్థానిక అడవిలో కొంతమేర ఇప్పటికే నిర్మించిన కర్ణాటక టైప్ వేలాడే ఫెన్సింగ్‌నైనా పూర్తిస్థాయిలో చేపట్టాలి. అడవికి ఆనుకుని ఉన్న బఫర్‌జోన్‌లో ముళ్లుకలిగిన కలిమిచెట్లు, గారచెట్లు, నిమ్మచెట్టు లాంటివి పెంచితే ముళ్లకు బయపడి ఏనుగులు రాకుండా ఉంటాయని రైతులు సూచిస్తున్నారు. అయితే కౌండిన్య అభయారణ్యం మూడు రాష్ట్రాల పరిధిల్లో ఉండడంతో మూడు రాష్ట్రాలు కలసి ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటు చేస్తేనే సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది.
సీఎం దృష్టికి తీసుకెళ్లా..
ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఏనుగుల సమస్య ఉంది. గతంలో నిర్మించిన సోలార్ ఫెన్సింగ్ నాఽశిరకంగా ఉండడంతోనే ఏనుగులు సులభంగా అడవిలోంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఇందుకోసం పటిష్టమైన సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. సీఎం ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
– వెంకటేగౌడ, ఎమ్మెల్యే, పలమనేరు
కొత్త ఫెన్సింగ్‌కు ప్రతిపాదనలు పంపాం
పాత, కొత్త సోలార్ ఫెన్సింగ్‌ల మధ్య నున్న గ్యాప్‌లతో పాటు పాత సోలార్ దెబ్బతిన్న చోట్ల మరమత్తులకు ఇప్పటికే రూ.28 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి నిధులందితే ఫెన్సింగ్ పనులు ప్రారంభిస్తాం. అడవిలోంచి బయటకొచ్చిన ఏనుగులు ఇలా కరెంట్‌షాక్‌లకు గురై మృతి చెందుతుండడం మా శాఖకు చాలా బాధగా ఉంది.
– శివన్న, ఎఫ్‌ఆర్వో, పలమనేరు
Comments
Please login to add a commentAdd a comment