సిబ్బంది కొరతతోనే నియంత్రించలేకున్నాం!
● ఒంటరి ఏనుగు అత్యంత ప్రమాదకరం ● ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ● అటవీశాఖ అధికారుల సూచన
యాదమరి: తగిన సిబ్బంది లేకపోవడంతోనే ఏనుగులను నియంత్రించలేకపోతున్నామని, ప్రజలు అర్థం చేసుకోవాలని చిత్తూరు పశ్చిమ విభాగ అటవీ శాఖాధికారి డీఎఫ్‌ఓ సాకేత్ గరుడ పేర్కొన్నారు. యాదమరి మండలంలోని జోడిచింతల అటవీ శాఖ తనిఖీ కేంద్రం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదమరి, బంగారుపాళెం మండలంలోని పలు ప్రాంతాలపై ఏనుగుల సంచారం ఉందన్నారు. ఈ క్రమంలో పంటలు దెబ్బతింటున్నాయన్నారు. అలాగే ప్రజలపై కూడా దాడి చేస్తున్నాయన్నారు. ఈ రెండు మండలాల్లో అటవీ పరిధి దాదాపుగా 50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందన్నారు. ఇందుకు తగిన సిబ్బంది లేకపోవడంతో కేవలం ఏడుగురు సిబ్బందితో ఏనుగును నియంత్రించలేకపోతున్నామన్నారు. తద్వారా జరగాల్సిన నష్టం జరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వెలుతురు చెరువు, తాళ్లమడుగు, భూమిరెడ్డిపల్లి నుంజర్ల ప్రాజెక్టు సమీపంలో దాదాపు 25 ఏనుగులు వరకు సంచరిస్తున్నాయని తెలిపారు. ఈ పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం 5 గంటల లోపు తమ కార్యకలాపాలను ముగించుకుని, ఇళ్లకు చేరాలని విజ్ఞప్తి చేశారు. అనివార్య పరిస్థితుల్లో గజదాడుల్లో నష్టపోయిన, ప్రాణనష్టం జరిగినా ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తుందని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. తాజాగా ఏనుగుల దాడిలో గాయపడిన దళవాయిపల్లి యువకుని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో మోహన మురళీ, డీఆర్వో ఆనందరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment