పుత్తూరు తైలం పేరిట బురిడీ
● రూ.లక్షలు ముంచిన ఘనుడు! ● కొన్నాళ్లుగా పలమనేరులో కార్యాలయం మూత ● అడ్రస్‌లేని నిర్వాహకుడు ● లబోదిబోమంటున్న బాధితులు
పలమనేరు: పుత్తూరు తైలం పేరిట ప్రాంఛైజీలు పేరిట ఓ వ్యక్తి రూ.లక్షల్లో వసూలు చేసి, జనాన్ని బురిడీ కొట్టించిన సంఘటన పలమనేరులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బాధితుల కథనం మేరకు... రవికుమార్ రాజు అనే వ్యక్తి తాను పుత్తూరు తైలం ప్రొడెక్ట్ ఎండీనని ఉమ్మడి ఏపీలో ప్రచారం చేసి, పలువురికి ప్రాంఛైజీలు ఇస్తామంటూ నమ్మబలికాడు. ఒక్కో జిల్లాలో ఏజెన్సీ కోసం రూ.2 లక్షలు డిపాజిట్‌గా చెల్లించాలని, అమ్మిన బాటిళ్లపై రూ.10 వరకు కమీషన్ ఉంటుందని తెలిపాడు. దీంతో అతని మాటలు నమ్మి తెలంగాణకు చెందిన ఆనంద్, విజయవాడకు చెందిన వేణువర్థన్‌రెడ్డి రూ.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వీరికి కొన్ని నెలలపాటు తైలం పంపి, వారికి కమీషన్లు సక్రమంగా చెల్లించి, ఆపై సరుకు ఇవ్వకుండా పోయాడు. దీంతో వారు రవికుమార్ రాజుకు ఫోన్ చేసినా అది స్విచ్‌ఆఫ్ అని వచ్చింది. దీంతో బాధితులు ఇటీవల పట్టణంలోని రాధా బంగ్లాలోని పుత్తూరు తైలం కార్యాలయాన్ని గమనించగా దానికి కొన్ని నెలల నుంచి తాళం వేసి ఉందని తెలుసుకున్నారు. చేసేది లేక వారు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి రవికుమార్‌రాజు భార్య సునీతను అడగ్గా తనకు సంబంధం లేదని చెప్పినట్టు బాధితులు తెలిపారు. తమలాంటి వారు ఉమ్మడి ఏపీలో చాలామంది ఉన్నారని, మొత్తం రూ.కోట్లలో మోసం జరిగిందని ఆరోపించారు. పలమనేరులో భారీ భవంతి, ఇంటి సైట్లు కొని ఇప్పుడు కనిపించకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు ఇక్కడి పుత్తూరు తైలం కార్యాలయంలో పనిచేసిన పట్టణానికి చెందిన సిబ్బందికి సైతం వేతనాలివ్వలేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment