'మూగ సేవ..' ముక్తి తోవ! | Elephants At TTD Srivari Brahmotsavalu Andhra Pradesh | Sakshi
Sakshi News home page

'మూగ సేవ..' ముక్తి తోవ!

Published Mon, Sep 19 2022 6:00 AM | Last Updated on Mon, Sep 19 2022 7:39 AM

Elephants At TTD Srivari Brahmotsavalu Andhra Pradesh - Sakshi

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల సంబరంలో గజరాజులు, అశ్వాలు, వృషభాలది కీలకపాత్ర. స్వామివారి వాహనసేవల్లో తొలి అడుగు వీటివే. ఇవే భక్తులకు ముందుగా కనువిందు చేస్తాయి. సర్వాంగసుందరంగా అలంకరించిన ఈ జంతువులు ఠీవిగా ముందుకు కదులుతూ స్వామివారు వస్తున్నారన్న సంకేతాన్నిస్తాయి. బ్రహ్మోత్సవాలకు అట్టహాసం తీసుకువస్తున్న ఘనత వీటికే దక్కుతుంది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ శాలలో వీటి ఆలనా పాలనాను టీటీడీ చూస్తోంది. 

లక్ష్మీ నుంచి శ్రీనిధి వరకు  
గజం ఐశ్వర్యానికి చిహ్నం. శ్రీమహావిష్ణువు దేవేరి అయిన శ్రీ లక్ష్మీదేవి ఇష్టవాహనం కూడా ఏనుగే. శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీ వేంకట్వేరుని వైభవాన్ని సిరిసంపదలకు సూచికలైన ఏనుగులు ఇతర జంతువులైన అశ్వాలు, వృషభాలతో కలిసి మరింత ఇనుమడింపజేస్తున్నాయి. ప్రస్తుతమున్న ఏనుగుల్లో 14 ఏళ్ల శ్రీనిధి అన్నిటికంటే చిన్నది. 45 ఏళ్ల లక్ష్మి అన్నిటికంటే పెద్దది.

ఏనుగుల సంరక్షణ చూస్తోన్న ఎస్వీ గో సంరక్షణశాల సంచాలకులు డాక్టర్‌ హరనాథరెడ్డి మాట్లాడుతూ..హార్మోన్లు విడుదల సమయంలో మగ ఏనుగులను అదుపు చేయడం కష్టతరమని, ఈ కారణంగా వాటిని ఉంచడం లేదని చెప్పారు. ఉన్న ఏనుగులకు ప్రతీ రోజు ఆలయాల ఉత్సవ సేవల్లో, గోశాలలో నడక ద్వారా వ్యాయామం, శరీర మర్దన చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అరగంటకు ఓసారి ఏనుగులకు ఆహారం అందిస్తున్నట్లు వెల్లడించారు.

మాడవీధుల్లో వాహనసేవల సమయంలో శక్తివంతమైన విద్యుత్‌ దీపాల వెలుగులు, కళాకారుల వాయిద్యాల శబ్దం నుంచి ఏనుగులకు ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల ముందు నుంచి పలు రకాలుగా మచ్చిక చేసుకుని వీటిని బ్రహ్మోత్సవాలకు సమాయత్తం చేస్తామని వివరించారు. ప్రతి 20 నిమిషాలకోసారి చెరుకు గడలు, నేపియర్‌ గ్రాసం అందిస్తామని చెప్పారు. 

తిరుమలలో గోశాల మరింత అభివృద్ధి 
తిరుమలలోని ఎస్వీ గోశాలలో పాడి ఆవులు, లేగ దూడలు, మేలురకం ఎద్దులతో కలిపి మొత్తం 45 గోవులున్నాయి. గోశాలకు ఆనుకుని ఉన్న  8 ఎకరాల స్థలాన్ని చదును చేసి గోవులు తిరిగేందుకు అనువుగా మారుస్తున్నారు. 100 గోవులు ఉంచేందుకు వీలుగా షెడ్డు నిర్మించనున్నారు. శ్రీవారి తోమాల సేవ, అభిõÙకం, ఏకాంత సేవ, నవనీత సేవ కోసం పాలు, పెరుగు, వెన్న తదితర పదార్థాలను ఇక్కడి నుంచే తీసుకు వెళతారు. మజ్జిగను అన్నదానం కాంప్లెక్స్‌కు సరఫరా చేస్తారు.

అద్భుత అలంకరణ.. ప్రత్యేక శిక్షణ  
వాహన సేవల్లో పాల్గొనే జంతువులను అద్భుతంగా అలంకరిస్తారు. గజరాజులను ముఖపట్టాతోపాటు రంగురంగుల బొంతలతో అలంకరిస్తారు. మరోపక్క మావటిలు గొడుగులు, విసన కర్రలతో స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు. ఏనుగులను గరుడ సేవ నాడు ప్రత్యేకంగా అలంకరిస్తారు. రాజసానికి చిహా్నలైన అశ్వాలను ముఖపట్టా, తలపై కుచ్చు, బొంతలు, మెడగజ్జెలు, కాళ్లపట్టీలతో అలంకరిస్తారు.

రైతన్నలకు నేస్తాలైన ధర్మానికి ప్రతీకగా నిలిచే వృషభాలను మెడలో నల్లతాడు, పూలహారాలు, గజ్జెలు, బొంతలతో అలంకరిస్తారు. వాహన సేవల్లో ఈ జంతువులకు ఇష్టమైన రావి, మర్రి ఆకులు, రాగి సంగటి, చెరకు గడలను ఆహారంగా ఇస్తారు. మాడ వీధుల్లో తిరిగే సమయంలో క్రమం తప్పకుండా ఆహారాన్ని, నీటిని అందిస్తూ ఉంటారు. వాహన సేవల్లో వినియోగించే జంతువులకు తగిన శిక్షణ కూడా ఇస్తారు.

మావటిలు తాళ్లు, అంకుశం (ముల్లు కట్టె), గొలుసులతో నిరంతరం అప్రమత్తంగా ఉండి గజరాజులను నియంత్రిస్తారు. వాటికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఊరేగింపులకు వినియోగిస్తారు. వాటి వెంట జంతుశాస్త్ర నిపుణులు కూడా ఉంటారు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు జంతువులను నియంత్రించేందుకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. మాడవీధుల్లో గజరాజులు తిరిగేందుకు ప్రత్యేక మార్గాన్ని కూడా రూపొందిస్తారు. ఏనుగులను అదుపు చేసేందుకు కేరళ నుంచి నిపుణులైన పశువైద్యులను రప్పిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement