
సాక్షి, అమరావతి: ప్రజలు తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అత్యవసరమయ్యే క్లిష్టమైన సంరక్షణ(క్రిటికల్ కేర్)ను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గుండెపోటు, కార్డియో వాస్కులర్ స్ట్రోక్స్, శ్వాసకోశ రుగ్మతలు, పాయిజన్, సెప్టిక్ షాక్, ఇతర సందర్భాల్లో బాధితులకు నాణ్యమైన వైద్య సేవల కోసం నెల్లూరు జీజీహెచ్, కడప, శ్రీకాకుళం రిమ్స్‌లలో క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ)లు ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందించింది. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి దేశవ్యాప్తంగా లక్షల మంది మృత్యువాత పడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న అనంతరం పలు రకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను కరోనా వైరస్ తెలియజేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీసీబీల ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రూ.71.25 కోట్లతో..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నెల్లూరు, కడప, శ్రీకాకుళంలో ఒక్కోచోట రూ.23.75కోట్ల ఖర్చుతో రూ.71.25 కోట్లతో 50 పడకల సామర్థ్యంతో సీసీబీలను ఏర్పాటుచేస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు జీజీహెచ్, కడప రిమ్స్‌లో సీసీబీల ఏర్పాటుకు డీపీఆర్‌లు రూపొందించగా, వాటికి ఆమోదం లభించింది. సీసీబీల ఏర్పాటుకు టెండర్లను పిలవాలని ఎన్‌హెచ్‌ఎం నుంచి ఏపీఎంఎస్‌ఐడీసీకి ప్రతిపాదనలను పంపారు. శ్రీకాకుళం రిమ్స్‌లో సీసీబీ ఏర్పాటుకు డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. త్వరగా టెండర్లు పూర్తి చేసి, శరవేగంగా సీసీబీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్ ‘సాక్షి’తో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment