సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరు మొదలయింది. ప్రజాప్రతినిధుల సహకారంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. స్టీల్ ప్లాంట్ బి సి గేట్ వద్ద సోమవారం ఉదయం నిర్వహించిన నిరసన సభకు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు పలువురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఇందులో అన్ని పార్టీల అనుబంధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించిన వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను అదే ఉద్యమస్ఫూర్తితో కాపాడుకుంటామని కార్మిక నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా వైజాగ్ స్టీల్‌ప్లాంట్ లాభాల్లో ఉందని, విస్తరణ కారణంగా రుణాలు తీసుకోవడం జరిగిందని నాయకులు పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్లాంట్‌ను తీసుకోవాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో రాష్ట్రంలోని బీజేపీ నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్షత చూపిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖను స్ఫూర్తిగా తీసుకొని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి పర్యాటక శాఖ మంత్రితో పాటు పలువురు ఎమ్మెల్యేలు తమ మద్దతు తెలిపారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, రైతు ఉద్యమానికి మించిన ఉద్యమం కొనసాగిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు.
(చదవండి: ‘అలా చేస్తే పతనం తప్పదు’)
(చదవండి: మోగని ‘గంట’: ఉత్తుత్తి లేఖతో హడావుడి..)
Comments
Please login to add a commentAdd a comment