సాక్షి, అమరావతి: విద్యా రంగం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడి అని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు విజయవాడలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్–2022ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కోరారు.
చదువు మాత్రమే కాకుండా కళలు, క్రీడలవైపు కూడా తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. విద్యా రంగంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాల విజయవంతానికి ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలన్నారు. అనంతరం పలు కళారూపాలను ప్రదర్శించిన చిన్నారులను మంత్రి బొత్స సత్యనారాయణ అభినందించారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్‌కుమార్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి డైరెక్టర్ బి.ప్రతాపరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కాగా, మొత్తం 10 అంశాలలో 260 మంది విద్యార్థులు తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించారు. ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment