అంతరిస్తున్న 'కొండచిలువలు' | Endangered pythons | Sakshi
Sakshi News home page

అంతరిస్తున్న 'కొండచిలువలు'

Published Sun, Jan 10 2021 5:31 AM | Last Updated on Sun, Jan 10 2021 5:31 AM

Endangered pythons - Sakshi

కైకలూరు: సరీసృపాలలో అరుదైన కొండచిలువల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. విషపూరిత సర్పాలు కానప్పటికీ మానవుల చేతుల్లో హతమవుతున్నాయి. ప్రకృతి సౌందర్యానికి నెలవైన కొల్లేరులో ఎక్కువగా ఉన్న కొండచిలువలు విషపూరితం కాకపోయినా.. కనిపిస్తే అంతమవుతున్నాయి. కొల్లేరులో పక్షులతోపాటు వివిధ జాతుల సరీసృపాలు జీవిస్తున్నాయి. వీటిలో ఇండియన్‌ రాక్‌ పైథాన్‌ ఒకటి. ఈ కొండచిలువ కొల్లేరు ప్రాంత ప్రజల చేతుల్లో ఎక్కువగా దాడికి గురవుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ఉప్పుటేరు పరీహవాక ప్రాంత పరిధిలో వీటి సంచారం ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల కృష్ణాజిల్లా కలిదిండి మండలం కొండంగి, మట్టగుంట, పడమటిపాలెం, కైకలూరు మండలం ఆటపాక, ముదినేపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి మృత్యువాతపడ్డాయి. కొద్ది ఘటనలలో మాత్రమే అటవీశాఖ అధికారులు వీటిని రక్షిస్తున్నారు.  

చిత్తడి నేలలు అనుకూలం 
కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తొమ్మిది మండలాల పరిధిలో 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. రెండు జిల్లాల్లో 2.25 లక్షల ఎకరాల్లో ఆక్వా చెరువులు సాగవుతున్నాయి. ఇక్కడి చిత్తడి నేలలు కొండచిలువలకు అనుకూల ఆవాసాలుగా మారాయి. చేపలు, రొయ్యల చెరువుల సమీపంలో ఉంటున్న ఇవి చెరువులపై కోళ్లు, పక్షులు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటున్నాయి. నీటిలో వేగంగా ప్రయాణించగలిగిన కొండచిలువలు ఆహార అన్వేషణలో భాగంగా బయటకు వచ్చి ప్రజల చేతిలో మృత్యువాతపడుతున్నాయి.   

అరుదైన జాతి 
ఇండియన్‌ రాక్‌ పైథాన్‌ శాస్త్రీయ నామం పైథాన్‌ మోలురూస్‌. ఇది 9.8 అడుగుల పొడవు పెరుగుతుంది. బరువు 25 కిలోల వరకు ఉంటుంది. ముదురు గోధుమ రంగుపై నల్లటి డైమండ్‌ మచ్చలు ఉంటాయి. విషపూరితమైనవి కావు. క్షీరదాలు, పక్షులు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటాయి. పూర్తిగా ఆహారం తీసుకున్నాక వారం పాటు ఏమీ తినకుండా ఉండగలవు. చిత్తడి నేలలు, గడ్డిభూములు, ఎర్రనేలలు, మడ ఆడవుల్లో ఉంటాయి. ఇవి వంద గుడ్ల వరకు పొదుగుతాయి. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్‌ దేశాల్లో వీటి సంతతి ఉంది. ఇండియన్‌ రాక్‌ పైథాన్‌ను.. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎస్‌) హానికలిగే జాతుల జాబితా (రెడ్‌ లిస్ట్‌)లో చేర్చింది.  

అరుదైన కొండచిలువ 
ఇండియన్‌ రాక్‌ పైథాన్‌ విషసర్పం కాదు. ప్రజలు వీటిని చూడగానే దాడి చేస్తున్నారు. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐయూసీఎస్‌ ఈ జాతి ప్రమాదకర  స్థితిలో ఉందని రెడ్‌ లిస్టులో పేర్కొంది. ఆటపాక గ్రామంలో గాయపడిన 11 అడుగుల కొండచిలువకు శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడాను. ఇవి తారసపడితే అటవీ అధికారులకు తెలియజేయండి.   
– డాక్టరు సూరపనేని ప్రతాప్, వెటర్నరీ అసిస్టెంటు సర్జన్, అమరావతి 

చంపితే మూడేళ్ల శిక్ష 
కొండచిలువలు కనిపిస్తే చంపవద్దు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి. అటవీశాఖ చట్ట ప్రకారం ఈ జాతిని షెడ్యూల్‌–1లో చేర్చారు. దీన్ని చంపితే మూడేళ్ల శిక్ష పడుతుంది. వీటికి హానిచేయకుండా అప్పగిస్తే అటవీప్రాంతాల్లో వదిలిపెడతాం.  
– జి.జయప్రకాష్, ఫారెస్టు డిప్యూటీ రేంజ్‌ ఆఫీసరు, కైకలూరు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement