సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. నిరసన తెలిపితే చేతులకు బేడీలు.. హక్కుల సాధనకు ఉద్యమిస్తే కటకటాల పాలు.. చంద్రబాబు అధికారంలో ఉండగా అదుపు లేకుండా సాగిన నిర్బంధ కాండ ఇదీ. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేసే హక్కులను గత సర్కారు కాలరాసింది. ఇష్టారాజ్యంగా 144, 151, 30 తదితర సెక్షన్లను ప్రయోగించి ఐదేళ్ల పాటు అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేసింది. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అడుగడుగునా ఇబ్బందులకు గురి చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం 2017 జనవరి 26న విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతున్న వైఎస్ జగన్‌ను విమానాశ్రయం రన్‌వేపైనే అడ్డుకుంది. 2017 ఫిబ్రవరిలో అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్‌కు హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను గన్నవరం విమానాశ్రయంలో దౌర్జన్యంగా అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించి దమన కాండను ప్రదర్శించింది.
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించిన తీరుపై ఇప్పటికీ ఆ సామాజికవర్గంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముద్రగడ కుమారుడిపై దౌర్జన్యం, మహిళలను దుర్భాషలాడటం లాంటి ఘటనలు ప్రజల మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ శ్రేణులను, నాటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, రామకృష్ణలను పలుమార్లు గృహ నిర్బంధాలు, అరెస్టులు చేసిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
ముస్లిం యువతపై రాజద్రోహం కేసులు..
ముస్లిం యువతపై ఏకంగా రాజద్రోహం, దేశద్రోహం కేసులు నమోదు చేయించిన ఘనత చంద్రబాబు సర్కారుకే దక్కింది. గుంటూరు, నంద్యాలలో చంద్రబాబు నిర్వహించిన సభల్లో న్యాయం కోసం ప్రశ్నించిన మైనార్టీ యువకులపై అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా హింసించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ఈ అక్రమ కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
‘హోదా’ గళాలపై ఉక్కుపాదం..; ప్రత్యేక హోదా కోసం నినదించిన వారిపై చంద్రబాబు ఉక్కుపాదం మోపారు. వైఎస్సార్ సీపీతో పాటు ప్రతిపక్షాలపై మూడున్నరేళ్లకుపైగా టీడీపీ సర్కారు నిర్బంధకాండ సాగించింది. పోలీస్ యాక్ట్ 30, ప్రివెంటివ్ సెక్షన్ 151, ఐపీసీ సెక్షన్ 144, 147, 149, 153, 154, 188, 341, 353లతో కేసులు మోపింది. ఒక్కో జిల్లాలో ఒక్కో రీతిలో రెండు, మూడు సెక్షన్లను ప్రయోగించడం గమనార్హం. రాష్ట్రంలో 1,065 మందికి పైగా వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు నమోదు చేయగా పలు జిల్లాల్లో వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు, బైండోవర్ చేయడం లాంటి చర్యలతో అణచివేతకు పాల్పడింది.
రాజధాని రైతులపై తీవ్ర వేధింపులు..
రాజధాని అమరావతికి భూములివ్వలేమన్నందుకు పేద రైతులకు బెదిరింపులు, అక్రమ కేసులు తప్పలేదు. టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తని వారిపై భౌతిక దాడులకు కూడా వెనుకాడలేదు. తమ మాట వినని రైతులకు చెందిన అరటి తోటలు, తాటాకు పాకలు తగలబెట్టిన కొందరు సంఘ విద్రోహశక్తులు అరాచకం సృష్టించారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మేధాపాట్కర్ లాంటి సామాజిక ఉద్యమకారులు గత సర్కారు దమనకాండను తీవ్రంగా తప్పుబట్టారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ లాంటి వారిని అక్రమ కేసులు, గృహ నిర్బంధాలతో అణచివేసేందుకు టీడీపీ సర్కారు చేయని ప్రయత్నం లేదు.
Comments
Please login to add a commentAdd a comment