సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పాస్‌పోర్టు సేవలు మెరుగయ్యాయి. గతంలో మాదిరిగా నెలల తరబడి నిరీక్షణకు చెక్ చెబుతూ ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాలు (ఆర్‌పీవోలు) ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాయి. దరఖాస్తుల క్లియరెన్స్‌పై దృష్టిసారించాయి. కరోనా అనంతరం పరిస్థితులు మెరుగుపడుతుండటంతో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజురోజుకు దరఖాస్తులు పెరుగుతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి.
ఉపాధి, ఉన్నతవిద్య, ఇతర అవసరాల కోసం విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. రోజులు, నెలల తరబడి కాళ్లరిగేలా తిరిగినా స్లాట్ దొరికే పరిస్థితి ఉండేది కాదు. కానీ విదేశీ వ్యవహారాలశాఖ తీసుకున్న కీలక నిర్ణయాలతో పాస్‌పోర్టు సేవలు సులువయ్యాయి. దళారుల ప్రమేయం లేకుండానే దరఖాస్తుదారుల చేతికి పాస్‌పోర్టు లభిస్తోంది.
రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నంలో ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాలున్నాయి. తత్కాల్, సాధారణ అపాయింట్‌మెంట్లను పెంచి, కాలపరిమితిని తగ్గించడంతోపాటు శనివారం కూడా సేవలు అందిస్తుండటంతో పాస్‌పోర్టుల జారీప్రక్రియ కూడా వేగవంతం అయింది. మరోవైపు పోలీసులు వెరిఫికేషన్ ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తిచేస్తూ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) ఇస్తున్నారు. ఈ సంస్కరణల కారణంగా పాస్‌పోర్టు కేంద్రాల్లో పనితీరు జోరందుకుంది.
వారం రోజుల్లో చేతికి..
కరోనా తర్వాత భారత్‌లో విదేశీ ప్రయాణాలు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పాస్‌పోర్టు దరఖాస్తుల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతోంది. పాత నిబంధనల ప్రకారం పాస్‌పోర్టు కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. అన్నిరకాల పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. అవన్నీ ఒకేవిధంగా ఉండాలి. వాటిలో ఒక్క చిన్నతప్పు దొర్లినా.. కథ మళ్లీ మొదటికి వచ్చేది. ఒకవేళ అన్నీ ఉన్నా ఇచ్చిన సమాచారాన్ని నిజనిర్ధారణ చేసుకునేందుకు పోలీస్ విచారణ కోసం నెలల సమయం పట్టేది.
ప్రజల సౌలభ్యం కోసం విదేశీ వ్యవహారాలశాఖ జారీచేసిన ఆదేశాల మేరకు దరఖాస్తుతోపాటు నాలుగు పత్రాలుంటే చాలు వారం రోజుల్లో పాస్‌పోర్ట్ చేతిలో ఉంటుంది. ఆధార్‌కార్డు (ఇందులో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి), ఎలక్ట్రానిక్ ఫొటో ఐడెంటిటీకార్డు, పాన్‌కార్డు ఉండాలి. వీటితోపాటు స్థానికత, క్రిమినల్ రికార్డు, ఇంటి చిరునామా వివరాలున్న లాయర్ అఫిడవిట్ ఉంటే చాలు. వీటిలో ఉన్న సమాచారం నిజమని నిర్ధారించుకున్న వెంటనే పాస్‌పోర్టు జారీచేసేస్తున్నారు.
పోస్టాఫీసుల్లో సేవలు
తపాలా కార్యాలయాల్లోను పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చాయి. విజయవాడ ఆర్‌పీవో పరిధిలో రెండు పాస్‌పోర్టు సేవాకేంద్రాలతో పాటు 13 పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవాకేంద్రాలను (పీవోపీఎస్‌కేలను) అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖపట్నం ఆర్‌పీవో పరిధిలో రెండు పాస్‌పోర్టు సేవాకేంద్రాలతో పాటు ఏడు పీవోపీఎస్‌కేలున్నాయి. వీటన్నింటి ద్వారా రోజూ 3,020 మంది దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు. ఈ పీవోపీఎస్‌కేల ద్వారానే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) స్లాట్లు కూడా జారీ చేస్తుండటంతో పరిశీలన ప్రక్రియ మరింత సులభతరంగా మారింది.
పెరుగుతున్న దరఖాస్తులు
కోవిడ్ తర్వాత సేవలు మొదలైనప్పుడు ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాలకు రోజుకు సగటున 250 మంది మాత్రమే దరఖాస్తు దారులు వచ్చేవారు. కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడం, పరిస్థితులు చక్కబడిన తర్వాత స్లాట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. విజయవాడ కార్యాలయంలో రోజుకు 1,860 వరకు అపాయింట్‌మెంట్స్ ఉండగా, విశాఖ కార్యాలయంలో 1,160 దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నారు. శనివారం కూడా పాస్‌పోర్టు సేవలందిస్తుండటంతో తత్కాల్, సాధారణ పాస్‌పోర్టుల కోసం దరఖాస్తులు గణనీయంగా పెరుగుతున్నాయి.
పారదర్శకంగా పాస్‌పోర్టు సేవలు
ఏపీలో రెండు ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాల్లో సేవలు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. కోవిడ్ తర్వాత దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వీలైనంత త్వరగా వాటిని క్లియర్ చేస్తున్నాం. పాస్‌పోర్టు కోసం దళారుల్ని ఆశ్రయించవద్దని సూచిస్తున్నాం. పాస్‌పోర్టు సేవల పనిదినాలు కూడా తగ్గాయి. సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తులకు 15, సాధారణ తత్కాల్ దరఖాస్తులకు ఎనిమిది రోజులకు పనిదినాలు కుదించాం.
దరఖాస్తుదారులకు సమీప తేదీల్లో అపాయింట్‌మెంట్ ఉండేలా చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రెన్యువల్ కోసం చివరి తేదీ వరకు ఆలస్యం చేయటం సరికాదు. ఆరునెలల ముందుగానే దరఖాస్తు చేసుకుంటే.. పాత పాస్‌పోర్టు గడువు ముగిసేలోగా కొత్త పాస్‌పోర్టు మంజూరవుతుంది.
– విశ్వంజలి గైక్వాడ్, విశాఖ ఆర్‌పీవో
Comments
Please login to add a commentAdd a comment