సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. లాక్‌డౌన్‌తో అనేక చిన్నాపెద్దా పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు మూతపడడం, సిబ్బంది సంఖ్యకు గణనీయంగా కోత పెట్టడంతో లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. దీని ప్రభావం విద్యారంగంపైనా పడింది. కోవిడ్ దెబ్బకు చిన్నపాటి స్కూళ్లు తట్టుకోలేక, టీచర్లకు జీతాలు చెల్లించలేక మూతపడ్డాయి. దశలవారీ అన్‌లాక్‌లో భాగంగా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నా.. పాఠశాలలకు పిల్లల రాక, కొత్తగా చేరికలు బాగా తగ్గిపోయాయి. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల ఫీజులు కట్టే పరిస్థితి లేకపోడంతో పిల్లలు చదువు మానుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. కరోనాకు ముందు కార్పొరేట్ స్కూళ్లలో పిల్లల్ని చదివించిన అనేక కుటుంబాలు.. ఆ తర్వాత ఆర్థికంగా చితికిపోవడంతో వారు కూడా సర్కారు స్కూళ్ల వైపే దృష్టి సారిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
అసర్ నివేదికలో ఆసక్తికర అంశాలు
కరోనా పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి ‘అసర్’ సంస్థ విడుదల చేసిన యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ఏఎస్‌ఈఆర్ (అసర్)– 2020 నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వివిధ వయో గ్రూపుల పిల్లల చేరికలపై వేర్వేరు ప్రమాణాలతో ‘అసర్’ అధ్యయనం చేసింది. ఆయా గ్రూపుల పిల్లల చేరికలు ఎలా ఉన్నాయో అందులో వివరించింది.
– 2018, 2020 సంవత్సరాల్లో చేరికలను పరిశీలిస్తే కోవిడ్ ప్రభావం కారణంగా పిల్లల విద్యాభ్యాసం ఎంత అస్తవ్యస్తంగా మారిందో తెలుస్తుంది. ఆయా తరగతుల్లో పిల్లల చేరికల శాతంలో భారీగా తగ్గుదల ఉంది.
– ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో పాఠశాల విద్యలో పిల్లల చేరికలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది.
– పిల్లల చేరికలు ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధికంగా ఉండగా, ప్రైవేటు పాఠశాలల్లో తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల చేరిక ఎక్కువగా కనిపిస్తోంది.
– 2018తో పోల్చుకుంటే సెకండరీ స్కూళ్లకు సంబంధించి 15–16 ఏళ్ల మధ్య పిల్లల కన్నా ప్రాథమిక, మా«ధ్యమిక పాఠశాలల్లో డ్రాపవుట్ల (మధ్యలో చదువు మానేసినవారు) సంఖ్యలో ఎక్కువ పెరుగుదల కనిపిస్తోంది.
ఏపీ సర్కారు స్కూళ్లు సూపర్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల నేపథ్యంలో గత ఏడాదినుంచే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరుగుతూ వస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి వంటి పథకాలు తల్లిదండ్రులను విశేషంగా ఆకర్షిస్తూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చేస్తున్నాయి. నాడు–నేడు పథకంతో సర్కారీ స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి. రూ.10 వేల కోట్లతో రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రైవేటు స్కూళ్లకు దీటుగా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలివిడతలో 15 వేల స్కూళ్లలో రూ.3,600 కోట్లతో చేపట్టిన పనులు పూర్తికావస్తున్నాయి. ఇక జగనన్న విద్యాకానుక కింద రూ.650 కోట్లతో ఒక్కో విద్యార్థికి మూడు జతల దుస్తులు, బ్యాగు, బెల్టు, షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, కరోనా నేపథ్యంలో 3 మాస్కులు అందిస్తున్నారు. జగనన్న గోరుముద్ద కింద విద్యార్థులకు పాఠశాలల్లో రుచికరమైన, పౌష్ఠిక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. వీటన్నిటి ఫలితంగా గత ఏడాదిలో 2.50 లక్షల మంది ప్రైవేటు పాఠశాలలను వదిలిపెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే 2,09,575 మంది ప్రైవేటు నుంచి వచ్చి ప్రభుత్వ స్కూళ్లలో చేరారు.
అందరికీ అండగా సర్కారు బడి
Published Tue, Dec 8 2020 3:48 AM | Last Updated on Tue, Dec 8 2020 3:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment