వైజాగ్‌లో లండన్‌ ఐ! | Establishment of London Eye style megawheel in Vizag | Sakshi
Sakshi News home page

వైజాగ్‌లో లండన్‌ ఐ!

Published Mon, Dec 6 2021 2:36 AM | Last Updated on Mon, Dec 6 2021 8:44 AM

Establishment of London Eye style megawheel in Vizag - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒకవైపు సముద్ర అలల తాకిడి... మరోవైపు కొండగాలి పలకరింపులు.. రెండింటి మధ్య విశాఖ అందాలను 360 డిగ్రీల కోణంలో 125 మీటర్ల ఎత్తు నుంచి చూస్తూ రాత్రి డిన్నర్‌ చేస్తే ఎలా ఉంటుంది. ఆహా ఊహ అద్భుతంగా ఉంది కదూ.. ఇప్పుడు ఆ ఊహ కాస్తా నిజం కానుంది. విశాఖపట్నంలో ‘లండన్‌ ఐ’ తరహాలో 125 మీటర్ల ఎత్తు ఉన్న మెగా వీల్‌ను  బీచ్‌ రోడ్డులో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక  సిద్ధం చేస్తోంది. పర్యాటకశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. మొత్తం 15 ఎకరాల్లో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ మెగావీల్‌ ప్రపంచ మెగావీల్‌ టాప్‌–10లో ఒకటిగా నిలిచిపోనుంది. 

లండన్‌ ఐ తరహాలో.. 
లండన్‌ ఐ.. మిలీనియం వీల్‌.. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం. థేమ్స్‌ నది ఒడ్డున ఏకంగా 130 మీటర్ల ఎత్తులోనున్న జెయింట్‌ వీల్‌ నుంచి లండన్‌ నగరాన్ని చూసే వీలుంది. ఇప్పుడు అదే తరహాలో సముద్రం ఒడ్డున వైజాగ్‌ అందాలను ఒకేసారి వీక్షించేందుకు అనుగుణంగా మెగావీల్‌ను నిర్మించనున్నారు. అంతేకాదు రాత్రి సమయంలో అటు సముద్రం.. ఇటు నగర అందాలను వీక్షిస్తూ 125 మీటర్ల ఎత్తులో భోజనం కూడా చేసే ఏర్పాట్లు చేయాలని పర్యాటకశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ మెగావీల్‌ నిర్మాణానికి అవసరమైన 15 ఎకరాల భూమిని అధికారులు పరిశీలిస్తున్నారు. బీచ్‌ రోడ్డులో 4 ప్రదేశాలను పర్యాటకశాఖ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది.

అంతిమంగా భీమిలికి వెళుతున్న బీచ్‌రోడ్డుకు ఇటువైపుగా  రూ. 250 కోట్ల మేర వ్యయంతో ఈ మెగావీల్‌ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఇందులో 44 కేబిన్లు ఉంటాయి. ఒక్కో కేబిన్‌లో 10 మంది చొప్పున ఒకేసారి 440 మంది ప్రయాణించే వీలుంటుంది. 15 ఎకరాల్లో ఈ మెగావీల్‌తో పాటు షాపింగ్‌ కాంప్లెక్స్, పార్కింగ్, ఇతర రిక్రియేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం గ్లాసుతో నిర్మించనున్న కేబిన్ల ద్వారా చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసే వీలు కలగనుంది. అంతేకాకుండా 125 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత కేబిన్‌ ఫ్లోరింగ్‌ కూడా గ్లాసుతో నిర్మించనుండడంతో కిందకు కూడా చూసే వీలుంటుంది. 

► కేబిన్‌లో పూర్తిస్థాయి ఏసీ సదుపాయం. వైఫై, ఆడియో, వీడియో సదుపాయంతో పాటు పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ సిస్టమ్‌ ఏర్పాటు.
► ఆటోమేటిక్‌ ఫొటోగ్రఫీ సదుపాయం.
► తుపాన్లతోపాటు 8.3 భూకంప తీవ్రతస్థాయిని తట్టుకునేలా వీల్‌ నిర్మాణం.
► అత్యధిక ఉష్ణోగ్రతలనూ తట్టుకుంటుంది.
► వీల్‌ మొత్తం ఒకసారి రొటేషన్‌ అయ్యేందుకు 20 నిమిషాల సమయం పడుతుంది. అంటే గంటకు 1,320 మంది పర్యాటకులు ప్రయాణించేందుకు వీలు.

పర్యాటక అభివృద్ధికి అన్ని చర్యలు
విశాఖ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అటు బీచ్‌ల అభివృద్ధితో పాటు పలు హోటల్స్, రిసార్టుల నిర్మాణం జరుగుతోంది. మెగా వీల్‌ నిర్మాణంతో విశాఖ పర్యాటకంగా మరింత పరుగులు పెట్టనుంది. పలు ప్రైవేటు సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.      
– ముత్తంశెట్టి శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రి

4 ప్రాంతాలను పరిశీలిస్తున్నాం..
విశాఖపట్నానికి ఈ మెగావీల్‌ తలమానికం కానుంది. ఈ మెగావీల్‌ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం అవసరం. ఇందుకోసం నాలుగు ప్రాంతాలను పరిశీలిస్తున్నాం. నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.
– ప్రసాద్‌ రెడ్డి, ఏపీటీడీసీ చైర్మన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement