
సాక్షి, శ్రీకాకుళం : రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని ఉపమఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఏడాది పాలనలో అనేక చట్టాలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే అని కొనియాడారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, తనకు ఓటు వేయకపోయినా ప్రభుత్వ పథకాలు అందించండి అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, బాబు హయాంలో గత ఐదేళ్లలో రాష్ర్టంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.
రాష్ర్టవ్యాప్తంగా కరోనాపై విస్తృత అవగాహన కల్పిస్తూ అలుపెరగని పోరాటం చేస్తున్నామని, కరోనా కష్టకాలంలోనూ ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీదేనని అన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనాపై ఈనెల 17 నుంచి మూడు రోజుల పాటు సమీక్షా సమావేశం ఉంటుందని ధర్మాన వెల్లడించారు. జిల్లా వెనకబాటు తనంపై జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపారని, మనందరం కలిసి సమిష్టిగా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.