సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో బుధవారం పోలింగ్ నిర్వహించేందుకు పురపాలక శాఖ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేశాయి. అయితే, ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేయడంతో అక్కడ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అయితే, కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని, బుధవారం ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరుతూ పురపాలక శాఖ మంగళవారం హైకోర్టును ఆశ్రయించనుంది. తదుపరి ఉత్తర్వులను అనుసరించి అక్కడ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారు. ఇదిలావుండగా.. మునిసిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తారు.
భారీగా ఏకగ్రీవాలు..
ఏలూరు సహా 12 నగరపాలక సంస్థల్లో 671 డివిజన్లు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 2,123 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నామినేషన్లు స్వీకరించింది. కాగా, ఈ సారి గణనీయంగా వార్డులు ఏకగ్రీవమయ్యాయి. నగరపాలక సంస్థల్లో 89 డివిజన్లు, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 490 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులూ ఏకగ్రీవం కావడం విశేషం. నగర పాలక సంస్థల పరిధిలో 582 డివిజన్లు, పురపాలక సంఘాల పరిధిలో 1,633 వార్డులకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
అదృష్టం పరీక్షించుకోనున్న 7,552 మంది అభ్యర్థులు
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మునిసిపల్ ఎన్నికల్లో మొత్తం 7,552 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో నగరపాలక సంస్థల పరిధిలో 2,571 మంది, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల పరిధిలో 4,981 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 78,71,272 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. వారిలో పురుషులు 38,72,264 మంది కాగా.. మహిళలు 39,97,840 మంది, ఇతరులు 1,168 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో నగరపాలక సంస్థల పరిధిలో 48,31,133 మంది ఉండగా, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల పరిధిలో 30,40,139 మంది ఉన్నారు.
7,915 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
రాష్ట్రవ్యాప్తంగా 7,915 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వాటిలో నగరపాలక సంస్థల పరిధిలో 4,626 ఉండగా పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 3,289 ఉన్నాయి. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 4,788 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 2,468 కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించగా.. 2,320 పోలింగ్ కేంద్రాలు అతి సున్నితమైనవిగా గుర్తించారు.
48,723 మంది పోలింగ్ సిబ్బంది
ఒక్కో పోలింగ్ కేంద్రానికి 1+4 చొప్పున పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. వారిలో ఒక ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారితోపాటు ఇతర పోలింగ్ సిబ్బంది ముగ్గురు ఉన్నారు. వారితోపాటు రూట్ అధికారులు, జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మొత్తం మీద 48,723 మంది ఉద్యోగులను పోలింగ్ నిర్వహణ కోసం కేటాయించారు. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలట్ పత్రాలు, ఇతర మెటీరియల్‌ను ఆయా పట్టణాల్లోని పంపిణీ కేంద్రాలకు తరలించారు. అక్కడి నుంచి మంగళవారం ఉదయం నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బందికి వాటిని అందజేస్తారు. పోలింగ్ అధికారులు, సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు బస్సులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేశారు.
‘ఏలూరు’ ఎన్నికపై నేడు స్పష్టత
ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉండగా.. మూడు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 47 వార్డులకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా, ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఎన్నికలను నిలుపుదల చేస్తూ తీర్పు వెలువరించింది. కాగా, కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని, బుధవారం పోలింగ్‌ను యథాతథంగా నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ పురపాలక శాఖ మంగళవారం హైకోర్టును ఆశ్రయించనుంది. కోర్టు అనుమతిస్తే ముందుగా నిర్ణయించిన ప్రకారం ఏలూరు సహా 12 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
'పుర పోరు'కు సర్వం సిద్ధం
Published Tue, Mar 9 2021 2:24 AM | Last Updated on Tue, Mar 9 2021 10:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment