సాక్షి, అమరావతి: పవిత్ర హజ్ యాత్రకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రానికి చెందిన వారు ఈ నెల 14 నుంచి పవిత్ర యాత్రను ప్రారంభించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ యాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ ఏడాది రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు 1,161 మంది వెళ్తున్నారు. పాత జిల్లాల వారీగా యాత్రికుల గుర్తింపు, మంజూరు ఏర్పాట్లు పర్యవేక్షించారు. దీని ప్రకారం అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన యాత్రికులు ఈ నెల 14న బెంగళూరు నుంచి రెండు విమానాల్లో మదీనాకు వెళ్తారు.
హజ్ యాత్ర అనంతరం వారు జూలై 22న రాష్ట్రానికి తిరిగి వస్తారు. మిగిలిన 11 జిల్లాలకు చెందిన యాత్రికులు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. వీరంతా ఈ నెల 27, 28, 30 తేదీల్లో బయల్దేరి జిద్దా విమానాశ్రయానికి చేరుకుంటారు.
హజ్ యాత్రకు వెళ్లేవారు నిర్దేశించిన తేదీలకు 72 గంటల ముందు కేటాయించిన విమానాశ్రయాల పరిధిలోని హజ్ హౌస్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. గతంలో 48 గంటల ముందుగా రిపోర్టు చేస్తే సరిపోయేది. ఈసారి కోవిడ్ కారణంగా కోవిడ్ పరీక్ష (పీసీఆర్ టెస్ట్) కోసం ముందుగా చేరుకోవాలనే నిబంధన పెట్టారు. కోవిడ్ నేపథ్యంలో ఈసారి 65 ఏళ్ల లోపు వారిని మాత్రమే హజ్ యాత్రకు అనుమతించారు.
ప్రభుత్వం సాయం చేస్తోంది
ఈ ఏడాది హజ్ యాత్ర కోసం మొత్తం 1,403 దరఖాస్తులు వచ్చాయి. మన రాష్ట్రానికి కోటా 1,201 మందిని ఎంపిక చేశారు. కొందరు విరమించుకోగా 1,161 మంది హజ్ యాత్రకు వెళ్తున్నారు. హజ్ యాత్రికులకు ఏడాదికి రూ.3 లక్షలలోపు ఆదాయం ఉంటే రూ.60 వేలు, రూ.3 లక్షలకు మించి ఆదాయం ఉంటే రూ.30 వేలు చొప్పున ప్రభుత్వం సాయమందిస్తోంది.
– అబ్డుల్ ఖాదర్, హజ్ కమిటీ కార్యనిర్వహణ అధికారి
Comments
Please login to add a commentAdd a comment