కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఓ చిన్నారి ఆడుకుంటూ తల్లి స్నానానికి వెళ్లిన రూమ్‌కు బయట గడియ పెట్టేశాడు. ఆ తర్వాత ఆడుకుంటూ బాల్కనీలోని గ్రిల్స్‌లో కాలు పెట్టగా అది ఇరుక్కుపోయి గుక్కపట్టి ఏడ్వడం మొదలు పెట్టాడు. బాత్‌రూమ్‌లో ఉన్న తల్లికి బయట ఏం జరిగిందో తెలియక గుండె ఆగినంత పని అయ్యింది. రెండు మూడు గంటల ఉత్కంఠకు ఫైర్ సిబ్బంది రాకతో తెరపడింది. వివరాల్లోకి వెళితే... రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్‌లోని సాయిరాఘవ టవర్స్ మూడో అంతస్తులో ఎం.సంతోషలక్ష్మి కుటుంబ సభ్యులు ఉంటున్నారు.
ఆమెకు ఏడాదిన్నర బాబు (సాయిరామ్) ఉన్నాడు. మంగళవారం ఉదయం సాయిరామ్‌ను తీసుకుని తల్లి బాత్‌రూమ్‌కు వెళ్లింది. ఎప్పటిలా స్నానం చేయించి రూమ్ బయటకు వదిలింది. తర్వాత తానూ స్నానానికి ఉపక్రమించింది. ఇంతలో ఆ బాలుడు బాత్‌రూమ్ డోర్ వద్ద ఆడుకుంటూ గడియ పెట్టేశాడు. అక్కడి నుంచి నెమ్మదిగా బాల్కనీలోకి వచ్చాడు. బాల్కనీలోని గ్రిల్‌లో కాలు పెట్టగా ఇరుక్కుపోయింది. కాలు బయటకు రాకపోయేసరికి గుక్కపట్టి ఏడ్వడం మొదలు పెట్టాడు. బాబు ఏడుపు బాత్‌రూమ్ నుంచి విన్న తల్లి బయటకు రాలేక, బాబుకు ఏం జరిగిందో తెలియక తీవ్ర ఆందోళన చెందింది. ఏం చేయాలో తెలియక గట్టిగా కేకలు వేసింది. కింది భాగంలో నివాసం ఉంటున్న వారు విని పైకి వచ్చారు.
లోపలికి వెళ్దామంటే మెయిన్ డోర్ వేసి ఉంది. లోపల ఏం జరుగుతుందో అర్థంకాని అయోమయ పరిస్థితి. దీంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అపార్టుమెంటుకు చేరుకుని నిచ్చెన ద్వారా పైకి ఎక్కి బాల్కనీలోని గ్రిల్స్‌లో ఇరుక్కున్న బాలుడి కాలు బయటకు తీశారు. తర్వాత లోనికి వెళ్లి బాత్‌రూమ్ గడియ తీయడంతో తల్లి సంతోషలక్ష్మి బయటకు వచ్చింది. ఇద్దరూ క్షేమంగానే ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ సిబ్బందిని స్థానికులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment