సాక్షి, అమరావతి: ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్, ఆంక్షలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు కొనసాగాయి. లాక్‌డౌన్ ఎత్తివేయగానే మరింత జోరందుకుని, ఎగుమతులు కొత్త పుంతలు తొక్కాయి. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే వ్యవసాయ రంగంపై దృష్టి సారించారు.
వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రైతులను నాణ్యమైన ఉత్పత్తుల దిశగా ప్రోత్సహించారు. గ్రామాల్లో మౌలిక వసుతల కల్పన చేపట్టారు. కేంద్రం ప్రకటించని పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇవ్వడం, మార్కెటింగ్ సౌకర్యాలు క ల్పించడంతో రైతులు ఉత్సాహంగా పంటలు వేశారు. పురుగు మందుల అవశేషాలు తగ్గి నాణ్యమైన ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చాయి. దీంతో వ్యాపారులతో పాటు ఎగుమతిదారులూ పోటీ పడి ఉత్పత్తులు కొనుగోలు చేశారు.
దీనివల్ల రైతులకు మంచి ధర వచ్చింది. ఎగుమతులూ భారీగా పెరిగాయి. టీడీపీ హయాంలో ఒక ఏడాదిలో జరిగిన ఎగుమతుల కంటే గత ఆర్థిక సంవత్సరం (2020–21)లో 21 లక్షల టన్నులకు పైగా ఎక్కువగా ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. రాష్ట్రం నుంచి ఆక్వా ఉత్పత్తులు, బియ్యం, మొక్కజొన్న, అపరాలు, శుద్ధి చేసిన పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలు, బెల్లం ఉత్పత్తులు భారీగా ఎగుమతవుతున్నాయి. ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్, అరబ్ దేశాలకు ఎగుమతవుతున్నాయి.
గత ఆర్థిక సంవత్సరం 2020–21లో రికార్డు స్థాయిలో రూ.29 వేల కోట్ల విలువైన 55.68 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార, ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి కాగా, ఈ ఏడాది (2021–22) తొలి ఆరు నెలల్లోనే (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు) రూ.19 వేల కోట్ల విలువైన 38.86 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి అయ్యాయి. ఇది అరుదైన రికార్డు అని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) చెబుతోంది. చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున ఎగుమతులు జరగలేదని ఎగుమతిదారులూ చెబుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే ఈ ఏడాది 60 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో గరిష్టంగా 2018–19లో రూ.22.78 వేల కోట్ల విలువైన 34.09 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు మాత్రమే జరిగాయి.
రైతుకు మేలు
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రోత్సాహం, గ్రామ స్థాయిలో కల్పించిన సౌకర్యాల వల్ల గత మూడు సీజన్లలో వ్యవసాయ విస్తీర్ణంతో పాటు నాణ్యమైన దిగుబడులు పెరిగాయి. కేంద్రం మద్దతు ధర ప్రకటించని ఆహార ఉత్పత్తులకు సైతం రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించింది. ప్రభుత్వ చర్యలతో నాణ్యమైన ఉత్పత్తులు వస్తుండటంతో మార్కెట్‌లో వ్యాపారులతో పాటు ఎగుమతిదారులు కూడా రైతుల నుంచి మంచి ధరకు ఉత్పత్తులను కొంటున్నారు.
మూడేళ్ల క్రితం క్వింటాల్ రూ.4,500 కూడా పలకని పసుపు ఈ ఏడాది ఏకంగా రూ.10వేల వరకు వచ్చింది. రెండేళ్ల క్రితం రూ.4,800 ఉన్న పత్తి నేడు రూ.9,500 పలికింది. అలాగే రూ.5 వేలు పలకని మినుములు రూ.7 వేల మార్క్‌ను అందుకుంది. కందులు, పెసలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు కూడా కనీస మద్దతు ధరకంటే రైతులకు మంచి ధర లభిస్తున్నాయి. అరటి, బత్తాయి, మామిడి వంటి ఉద్యాన ఉత్పత్తులకు కూడా మంచి ధర లభిస్తోంది.
ఈ ఏడాది కూరగాయలతో పాటు కరివేపాకు సైతం విదేశాలకు ఎగుమతవుతోంది. ఇక కరోనా వేళల్లో కూడా రొయ్యలు, చేపలకు మంచి ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశం నుంచి ఎగుమతి అయ్యే సముద్ర ఉత్పత్తుల్లో 36 శాతం, రొయ్యల్లో 67 శాతం మన రాష్ట్రం నుంచే విదేశాలకు వెళ్తున్నాయి. నాణ్యమైన ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వ ప్రత్యేక చర్యల కారణంగా నాలుగేళ్ల క్రితం 86 శాతం ఉన్న యాంటీబయోటిక్స్ రెసిడ్యూల్స్ ఇప్పుడు 26 శాతానికి తగ్గాయి. దీంతో ఆక్వా ఉత్పత్తుల్లో నాణ్యత పెరిగి, ఎగుమతులు పెరిగాయని అధికారులు చెబుతున్నారు.
రైతుకు అదనపు ప్రయోజనం కల్పించడమే లక్ష్యం
రైతులకు అదనపు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత రెండేళ్లుగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. గ్రామ స్థాయిలో కల్పించిన మౌలిక సదుపాయాల ఫలితంగా సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో రికార్డు స్థాయిలో ఎగుమతులు కూడా నమోదవుతుండడం సంతోషదాయకం. ఆహార, ఆక్వా ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేందుకు పెద్ద ఎత్తున ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమలు పెడుతున్నాం. రైతులకు లబ్ధి చేకూర్చేలా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. – కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment