తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా
సాక్షి, అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపై కఠిన చర్యలొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ నేత దేవినేని అవినాష్ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ కృపాసాగర్ గత వారం విచారణ జరిపారు.
పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. పోలీసుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల విచారణను గురువారం చేపట్టాలని కోరారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో పిటిషనర్ల పాత్రపై ఆధారాలను కోర్టు ముందుంచుతామన్నారు. పిటిషనర్లపై కఠిన చర్యలొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు.
ఇతర నిందితులకు మధ్యంతర ఉత్తర్వులను వర్తింప చేయవద్దని వారు కోర్టును కోరారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి స్పందిస్తూ.. గురువారం ఇతర కేసులున్నాయని, ఆ రోజు వాదనలకు వీలుపడదని తెలిపారు. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు.
జోగి రమేష్ వ్యాజ్యంపై విచారణ 23కు వాయిదా
ఇదిలా ఉంటే, చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన గొడవపై నమోదైన కేసులో ముందుస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన వ్యాజ్యంలో తదుపరి విచారణ కూడా ఈ నెల 23కి వాయిదా పడింది. జోగి రమేష్‌పై కఠిన చర్యలొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్ కృపాసాగర్ 23 వరకు పొడిగించారు.
Comments
Please login to add a commentAdd a comment