
ధర లేక పంటను దున్నేస్తున్న రైతులు
ఎంతో కష్టపడి పండించిన క్యాబేజీకి ధర పడిపోవడంతో రైతులు పంటను దున్నేస్తున్నారు. క్యాబేజీ పంటను కొనేందుకు వ్యాపారులు రాకపోవడం... వ్యయప్రయాసలను ఎదుర్కొని మార్కెట్‌కు తీసుకువెళితే బస్తా రూ.50కి అడుగుతుండటంతో కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావని రొటోవేటర్‌తో పంటను తొక్కించేస్తున్నారు. ఎకరాకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు నష్టపోతున్నారు.
కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని పలు గ్రామాల్లో 80 ఎకరాల్లో క్యాబేజీ పంటను సాగుచేశారు. వీరిలో ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేలు ఇచ్చి కౌలుకు సాగుచేస్తున్న వారు కూడా ఉన్నారు. ఎకరా క్యాబేజీ సాగుకు రూ.80వేల వరకు ఖర్చులయ్యాయి.
ప్రతి సంవత్సరం క్యాబేజీ తోటలను సాగుచేసిన తర్వాత పంట చేతికొచ్చేముందు ఇతర ప్రాంతాల వ్యాపారులు వచ్చి ఎకరాల లెక్కన కొనుగోలు చేస్తుంటారు. వీరు క్యాబేజీ కోత సమయంలో డబ్బులు ఇస్తుంటారు. గత ఏడాది ఎకరా క్యాబేజీ పంటను రూ.2 లక్షల వరకూ కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఎకరా పంట రూ.80వేలకు పడిపోయింది. కొంతమంది రైతులు ఆ ధరకే అమ్ముకున్నారు. –మోపిదేవివార్పు(మోపిదేవి)
బస్తా రూ.50 మాత్రమే...
ధర పెరుగుతుందని కొందరు రైతులు క్యాబేజీ పంటను అమ్మకుండా ఎదురు చూశారు. వ్యాపారులు రాకపోవడంతో సొంతంగా మార్కెట్‌కు తరలిస్తే బస్తా రూ.50లకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కోత, రవాణా కూలీ ఖర్చులు దండగని రైతులు పంటను దున్నించేస్తున్నారు.
తోటలను కొనుగోలు చేసిన వ్యాపారులు కూడా క్యాబేజీ కోసుకునేందుకు రావడం లేదు. దీంతో మోపిదేవి వార్పు, బండికోళ్ల లంక, బొబ్బర్లంక ప్రాంతాల్లో రైతులు రొటోవేటర్‌తో క్యాబేజీ పంటను తొక్కించేస్తున్నారు. ప్రస్తుతం పది ఎకరాలకు పైగా పంటను తొక్కించేశారు. మిగిలిన రైతులు కూడా ఇదే బాట పడుతున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
జగన్ హయాంలో వెన్నుదన్నుగా...
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచి ఆదుకున్నారు. మార్కెట్‌లో ధర తగ్గిపోయిన ప్రతిసారి మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీం కింద మార్కెట్‌లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీ పడి రైతుల దగ్గర నుంచి కనీస మద్దతు ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు. ఇందుకోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 మధ్య 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల వివిధ రకాల పంట ఉత్పత్తులను సేకరించింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2019 – 24 మధ్య 6.17 లక్షల మంది రైతుల నుంచి రూ.7,745 కోట్ల విలువైన 21.59 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. నాడు ధర లేని సమయంలో టమోటాలు, ఉల్లిపాయలు లాంటి కూరగాయలు కూడా సేకరించి రైతులకు అండగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment