సాక్షి, చిత్తూరు : వరద నీటిలో తండ్రీకూతుళ్లు గల్లంతు అయిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పెనుమురులో వరద నీటిలో గల్లంతు అయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కొండయ్య వాగులో గల్లంతు అయిన ప్రతాప్ అతని కుమార్తె సాయి వీణ ఆచూకీ 11 గంటలు గడుస్తున్నా లభించక పోవడంతో బంధువులు కుటుంబీకుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నిన్న పెనుమురు మండలం వడ్డేర్ల పల్లి కి చెందిన ప్రతాప్ తన భార్య శ్యామల, కుమార్తె సాయి వీణ మరో ముగ్గురితో కలసి ఓ వివాహ కార్యక్రమానికి కారులో వెళ్లారు. తిరిగి రాత్రి 12 గంటల ప్రాంతంలో వెనుతిరిగారు. అప్పటికే కొండయ్య వాగు విపరీతంగా ప్రవహిస్తోంది.
అయినా వాగు దాటే ప్రయత్నం చేసి మధ్యలో చిక్కుకుపోయారు. మొదట సాయి వీణ వరద నీటిలోకి జారుకొంది. దీంతో ప్రతాప్ కుమార్తెను కాపాడే ప్రయత్నం చేస్తూ అతను గల్లంతు అయ్యాడు. కారులోని ప్రతాప్ భార్య శ్యామల, డ్రైవర్ తోపాటు మరొకరు బయటపడ్డారు. గల్లంతు అయిన వారికోసం ఉదయం నుంచి పెద్ద ఎత్తున గాలింపు జరుగుతోంది. చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు దగ్గరుండి గాలింపు చర్యలను పర్య వేక్షిస్తున్నారు. స్వయంగా బోటులో చేరువులోకి వెళ్లి పరిశీలించారు. కాగా ఇప్పుడే సాయి వీణ మృత దేహం లభించింది. ప్రతాప్ కోసం గాలింపు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment