![Father Brutally Killed His Daughter Boyfriend At West Godavari - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/18/lovers.jpg.webp?itok=-BBXLFZA)
ద్వారకాతిరుమల: తన కుమార్తె మృతికి ప్రియుడే కారణమని భావించిన ఆమె తండ్రి ఆ యువకుడిని పథకం ప్రకారం హతమార్చాడు. తన కుమార్తె సమాధికి కూతవేటు దూరంలో ఆ యువకుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఈ దారుణ ఘటన ద్వారకాతిరుమల మండలం, గొడుగుపేట శివార్లలో సోమవారం వెలుగు చూసింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఐఎస్ రాఘవాపురం పంచాయతీ తూర్ల లక్ష్మీపురానికి చెందిన తానిగడప పవన్‌కల్యాణ్ (24), రామసింగవరం పంచాయతీ గొడుగుపేటకు చెందిన మరీదు శ్యామల (18) జంగారెడ్డిగూడెంలో చదువుకునే సమయంలో ప్రేమించుకున్నారు. వారు తమ ప్రేమ విషయాన్ని కొద్ది నెలల క్రితం ఇంట్లో చెప్పగా, కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించ లేదు. దాంతో మనస్థాపానికి గురైన శ్యామల ఈ ఏడాది జూన్ 5న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
కుమార్తె మృతితో కలత చెందిన ఆమె తండ్రి నాగేశ్వరరావు.. పవన్ కల్యాణ్‌ను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 15న జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెంలోని ఓ కాలువ గట్టుపై తన స్నేహితుడు నాగరాజుతో కలిసి పవన్ కల్యాణ్ పార్టీ చేసుకున్నాడు. అప్పటి నుంచీ అతడు కనిపించడం లేదు. విచారణ చేపట్టిన పోలీసులు అదే రోజు రోజు రాత్రి పవన్ కల్యాణ్‌ను శ్యామల తండ్రి నాగేశ్వరరావు తీసుకెళ్లినట్టు గుర్తించారు.
దీంతో, పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్టు నాగేశ్వరరావు అంగీకరించాడు. మృతదేహాన్ని శ్యామల సమాధికి సమీపంలో పూడ్చిపెట్టినట్టు తెలిపాడు. జంగారెడ్డిగూడెం సీఐ బాలసురేష్‌బాబు, లక్కవరం ఎస్సై దుర్గామహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు పవన్ కల్యాణ్ కుటుంబాన్ని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సోమవారం పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment