
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మహిళా వలంటీర్.. విజయవాడ సివిల్ కోర్టులో పవన్‌పై డిఫమేషన్ కేసు వేశారు. కాగా, వలంటీర్ ఇచ్చిన కేసును న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు.
ఈ సందర్బంగా తమపై పవన్ అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురైనట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలని మహిళా వలంటీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఈ కేసుపై మహిళా వలంటీర్ తరఫున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు. సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం కేసు దాఖలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ట్రాఫికింగ్ ఆధారాలు కోర్టుకు ఇవ్వాలి..
అనంతరం.. న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ.. ‘బాధితురాలు పవన్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురైంది. కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుంది. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్‌కు కోర్టు నోటీసులు ఇస్తుంది. పవన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు కోర్టు తీసుకుంటుంది. పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయి. వలంటీర్లలో అధిక శాతం మహిళలు ఉన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్‌కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్‌కు చెప్పి ఉంటే ఆ ఆధారాలు కోర్టుకు వెల్లడించాలి. ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్న వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదు. పవన్ వ్యాఖ్యల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉంది. పవన్ వెనుక ఎవరున్నారో స్పష్టం చేయాలి. అబద్ధపు వదంతులు, వ్యాఖ్యలు చేసి ప్రజలను రెచ్చగొట్టి వలంటీర్లపై తిరగబడేలా వ్యాఖ్యలు చేసిన పవన్‌పై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని కోరాం’ అని తెలిపారు.
పవన్ వ్యాఖ్యలు బాధించాయి..
ఈ సందర్బంగా మహిళా వలంటీర్ మాట్లాడుతూ.. పవన్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాం. పవన్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. ఆయన తప్పుడు ఆరోపణలు చేశారు. ఉమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలు అవాస్తవం. నేను భర్త చనిపోయి పిల్లలతో జీవిస్తున్నాను. పవన్ వ్యాఖ్యల తర్వాత నన్ను చుట్టుపక్కల వారు ప్రశ్నించారు. ట్రాఫికింగ్ అంశాలపై కొందరు నన్ను ప్రశ్నించారు. నిస్వార్ధంగా సేవ చేస్తున్న మాపై నిందలు వేసి పవన్ తప్పు చేశారు. పవన్‌ను చట్టపరంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: ‘పేదల ఇళ్లకు చంద్రబాబు, దత్తపుత్రుడు అడుగడుగునా అడ్డుపడ్డారు’
Comments
Please login to add a commentAdd a comment