సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని ఫైబర్ నెట్ కుంభకోణంలో అరెస్టు చేసి విచారించేందుకు అనుమతించాలని సీఐడీ మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ దాఖలు చేసింది.
ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ పేరుతో చేసిన భూ దోపిడీ కేసులో ఏ1 చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు పీటీ వారెంట్‌ను సీఐడీ ఇటీవల దాఖలు చేసింది. తాజాగా ఫైబర్ నెట్ కుంభకోణంలోనూ చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభించడంతో న్యాయస్థానంలో పీటీ వారెంట్ దాఖలు చేసింది. అందుకు న్యాయస్థానం అనుమతిస్తే ఈ కేసులో కూడా చంద్రబాబును అరెస్ట్ చేసి విచారించి న్యాయస్థానంలో హాజరుపరచనుంది.
బినామీ కంపెనీకి అడ్డగోలుగా ప్రాజెక్టు
టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌లకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన ‘టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. అందుకోసం టీడీపీ ప్రభుత్వం పక్కా పన్నాగంతో కథ నడిపించింది.
చంద్రబాబు విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. వాస్తవానికి ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి. కానీ ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయించారు.
పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా
ఫైబర్ నెట్ టెండర్లను తన బినామీ కంపెనీ అయిన టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా టెరా సాఫ్ట్‌కు చెందిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ముందుగానే రెండు కీలక పదవుల్లో నియమించారు. తొలుత ఆయన్ని ఏపీ ఈ– గవర్నింగ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ని అంతటి కీలక స్థానంలో నియమించడంపై అనేక అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదు. ఫైబర్ నెట్ టెండర్ల మదింపు కమిటీలోనూ సభ్యుడిగా నియమించారు.
ఓ ప్రాజెక్టు టెండర్ల మదింపు కమిటీలో ఆ ప్రాజెక్టు కోసం పోటీ పడే సంస్థకు చెందిన వారు ఉండకూడదన్న నిబంధననూ ఉల్లంఘించారు. టెరా సాఫ్ట్ సంస్థ అప్పటికే బ్లాక్ లిస్టులో కూడా ఉంది. అంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. కానీ చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చి బ్లాక్ లిస్ట్ జాబితా నుంచి టెరా సాఫ్ట్ కంపెనీ పేరును తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టి మరీ టెరా సాఫ్ట్ కంపెనీకి ప్రాజెక్టును కట్టబెట్టారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేయడం గమనార్హం.
ఆధారాలతో సహా బట్టబయలు
ఫైబర్ నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ముందుగా ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో మొత్తం అవినీతి బట్టబయలైంది. టెరా సాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. అనంతరం ఐపీసీ సెక్షన్లు 24, 166, 167, 418, 465, 468, 471, 409, 506, అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్ 13(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది.
కుంభకోణంలో కీలక పాత్రధారులైన టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్‌క్యాప్ వీసీ కె.సాంబశివరావు, ఫాస్ట్‌లేన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ డైరెక్టర్ విప్లవ కుమార్, జెమిని కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రామ్మూర్తి, నిధుల తరలింపులో కీలకంగా వ్యవహరించిన కనుమూరి కోటేశ్వరరావులను సీఐడీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఏ11 తుమ్మల గోపీచంద్, ఏ22 రామ్‌కుమార్ రామ్మూర్తి ముందస్తు బెయిల్ పొందారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుకు అనుమతి కోరుతూ సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేయడంతో ఈ కేసులో తదుపరి పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
షెల్ కంపెనీల ద్వారా..
చంద్రబాబు బినామీ కంపెనీ కావడంతో ఫైబర్ నెట్ ప్రాజెక్టును టెరా సాఫ్ట్ కంపెనీ అత్యంత నాసిరకంగా చేసి నిధులు కొల్లగొట్టింది. టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నాణ్యతా ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగమయ్యాయి. మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథ నడిపించారు.
వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌పీ అనే మేన్‌పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు.
ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరా సాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు గత సర్కారు ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్‌లతో కొల్లగొట్టిన ఆ నిధులను కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ప్రభుత్వంలో ‘ముఖ్య’ నేతకు చేరినట్టు సీఐడీ గుర్తించింది. ఇక నాసిరకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని నిగ్గు తేల్చింది.
చదవండి: ‘నేరం కనిపిస్తున్నప్పుడు గవర్నర్ అనుమతి అక్కర్లేదు’
Comments
Please login to add a commentAdd a comment