Financial assurance to contract employees of Andhra Pradesh - Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఆర్థిక భరోసా

Published Mon, Oct 25 2021 1:51 AM | Last Updated on Mon, Oct 25 2021 5:24 PM

Financial assurance to contract employees Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: లక్ష్మి అనే మహిళ ఓ ప్రభుత్వ శాఖలో ఐదేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తోంది. తొలి మూడేళ్లలో నిత్యం భయం భయంగా పని చేయాల్సి వచ్చేది. అనారోగ్యంగా ఉన్నప్పటికీ సెలవులు ఇచ్చే వారు కాదు. టైమ్‌ స్కేల్‌ ఇవ్వాలని అడుగుతున్న వారిలో నీ పేరూ ఉందని, ఇలాగైతే ఉద్యోగం పోగొట్టుకుంటావని హెచ్చరించారు. సరిపోని జీతంతో, సమస్యల నడుమ ఉద్యోగ జీవితాన్ని నెట్టుకొచ్చింది. ఇక ఈ జీవితం ఇంతేనా అని ఓ దశలో నిరాశతో కుంగిపోయింది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిస్థితి మారుతుందని పలువురు అంటుంటే.. ఆ రోజు త్వరగా రావాలని తనూ కలలు కనింది. ఇప్పుడు ఆ కల నిజం అయిందని ఆనందంతో చెబుతోంది. జగన్‌ ప్రభుత్వ చర్యల వల్ల తనకు ఏకంగా రూ.13 వేల వరకు జీతం పెరిగిందని సంబరపడుతోంది. ఇలా లక్ష్మి ఒక్కరే కాదు.. వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వేతనాలు పెంచాలని, మినిమమ్‌ టైమ్‌ స్కేలు ఇవ్వాలని గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది.

ఆందోళన బాట పట్టిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 20 రోజుల ముందు 2019 జనవరి 28న జీఓ 12, ఫిబ్రవరి 18న జీఓ 24 ఇచ్చారు కానీ అమలు చేయకుండా మోసం చేశారు. కేవలం ఓట్లు దండుకోవాలనేదే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తుగడ. అప్పట్లో ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ తన సుదీర్ఘ పాదయాత్రలో కాంట్రాక్టు ఉద్యోగుల వెతలను కళ్లారా చూసి.. ఈ పరిస్థితి మారుస్తానని హామీ ఇచ్చారు.

ఆ మేరకు  వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు అన్ని విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు ఎంటీఎస్‌ (మినిమం టైమ్‌ స్కేలు) వర్తించేలా జీఓ 40ని అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ ఉద్యోగినులతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగినులకు కూడా మెటర్నిటీ లీవు, ఇతర సదుపాయాలు కల్పించారు. కాంట్రాక్టు ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షలు పరిహారం అందించేలా ఉత్తర్వులు జారీ చేశారు.

 
రూ.249.35 కోట్ల మేర వేతనాల పెంపు
► తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల కోసం ఏటా రూ.330.54 కోట్లు వెచ్చించేది. ఈ లెక్కన ఒక్కో కాంట్రాక్టు ఉద్యోగికి సగటు వేతనం రూ.15 వేలు మాత్రమే. 
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వేతనాల పెంపుతో కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల కోసం ఏడాదికి వెచ్చించే మొత్తం రూ.579.89 కోట్లకు చేరింది. అంటే గత ప్రభుత్వ హయాంలో వెచ్చించిన మొత్తం కన్నా దాదాపు రూ.249.35 కోట్లు అదనం.
► ఫలితంగా 18,060 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు లబ్ధి కలిగింది. సగటున ఒకొక్కరికి నెలకు సరాసరిన అందే వేతనం దాదాపు రూ.26,758. ఈ ప్రభుత్వ చర్యల వల్ల 18 శాతం నుంచి 82 శాతం వరకు వేతనాలు పెరిగాయి. 

  
విద్యా శాఖ ఉద్యోగులకు భారీగా లబ్ధి
► ఎంటీఎస్‌ అమలు అవుతున్న శాఖల్లో విద్యాశాఖకు సంబంధించిన వివిధ విభాగాల కాంట్రాక్టు టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది కూడా ఉన్నారు. ఉన్నత విద్యా శాఖ కాలేజీ ఎడ్యుకేషన్లోని జూనియర్‌ లెక్చరర్లు, లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫ్రొఫెసర్‌/ ఇతర ఫ్యాకల్టీకి సంబంధించి 691 మందికి మినిమమ్‌ టైమ్‌ స్కేలు అమలవుతోంది. 
► ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ లెక్చరర్లు, ల్యాబ్‌ అసిస్టెంటు, లెక్చరర్లు ఇతర ఫ్యాకల్టీలో 3,728 మందికి వేతనాల పెంపు ద్వారా లబ్ధి చేకూరింది. సాంకేతిక విద్యా శాఖలోని ఎలక్ట్రీషియన్లు, ల్యాబ్‌ అసిస్టెంట్లు, లెక్చరర్లు, ఫార్మాసిస్టులు, వర్కుషాప్‌ అటెండెంట్లు తదితరులు 432 మందికి మేలు చేకూరుతోంది. 
► సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థలు, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలు, ఏపీ గురుకుల విద్యా సంస్థలు, కస్తూరిబా బాలికా విద్యాలయాలు, బీసీ సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థలు, ఏపీ వైద్య విధాన పరిషత్, స్పోర్ట్సు అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ విభాగాల్లోని 6,026 మందికి వేతనాల పెంపును అమలు చేస్తున్నారు.
► యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్‌ అమల్లో గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఆటంకాలు ఎదురవుతున్నాయి. అధ్యాపకులకు యూజీసీ రివైజ్డ్‌ పేస్కేళ్లు వర్తించనుండగా జీఓల్లో 2015 స్టేట్‌ రివైజ్డ్‌ పే స్కేళ్లను అమలు చేయాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీఓల్లో కొన్ని అంశాలు గందరగోళంగా ఉండడం, కోర్టు కేసులు వీరికి ఎంటీఎస్‌ అమలుకు ఆటంకంగా మారాయి. మొత్తంగా ఏదోఒక రీతిలో వేతనాలను పెంచింది. యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు 4,077 మంది ఉండగా ఇప్పటికే జేఎన్‌టీయూ కాకినాడ, జేఎన్‌టీయూ అనంతపురం, ఆదికవి నన్నయ్య, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీల్లో వేతనాలను రూ.40 వేల వరకు పెంచి అందిస్తున్నారు. 

అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి తొలగిన కష్టాలు
► గత ప్రభుత్వ హయాంలో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది విషయంలో అనేక అక్రమాలు, భారీగా అవినీతి చోటుచేసుకుంది. ఈ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఎంపికను అప్పటి సీఎం చంద్రబాబు తనకు సన్నిహితులైన వారి ఏజెన్సీలకు కట్టబెట్టారు. 
► ఈ అవుట్‌సోర్సింగ్‌ పోస్టులను ఆ సంస్థలు లక్షలు వసూలు చేసి అమ్ముకున్నాయి. వారికి వేతనాలు కూడా సరిగా ఇవ్వలేదు. కమిషన్ల కింద భారీగా కోత పెట్టి అరకొరగా తమకు నచ్చినప్పు చెల్లించే వారు. ఈ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత అసలు ఉండేది కాదు. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సదుపాయాలు అమలు చేయలేదు.
► వీరి ఆవేదనను కళ్లారా చూసిన వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ఏజెన్సీలను రద్దు చేసి ప్రత్యేకంగా అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ (ఏపీసీఓఎస్‌ – ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌) ఏర్పాటు చేసి లక్షకు పైగా ఉద్యోగులను దాని పరిధిలోకి చేర్చారు. 
► తద్వారా వారికి ప్రతి నెల మొదటి తేదీన నయాపైసా కోత లేకుండా నేరుగా వారి అకౌంట్లలో వేతనం పడేలా చేశారు. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ వంటి సదుపాయాలు కల్పించడంతో పాటు కార్పొరేషన్‌ నియామకాలు కావడంతో వారికి ఉద్యోగ భద్రత కూడా ఏర్పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement