Kurnool Airport: కందనవోలు 'కళకళ'! | First Flight From Kurnool Airport Was Started | Sakshi
Sakshi News home page

Kurnool Airport: కందనవోలు 'కళకళ'!

Published Mon, Mar 29 2021 5:01 AM | Last Updated on Mon, Mar 29 2021 10:17 AM

First Flight From Kurnool Airport Was Started - Sakshi

జాతీయ జెండా ఊపి విమాన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు బుగ్గన, జయరాం తదితరులు

కర్నూలు (సెంట్రల్‌)/ఓర్వకల్లు: రాయలసీమ వాసుల కల సాకారమైంది. న్యాయ రాజధాని కర్నూలు (కందనవోలు) నుంచి లోహ విహంగాలు గాల్లో తేలిపోయాయి. ఈ చారిత్రక ఘట్టానికి కర్నూలు విమానాశ్రయం ఆదివారం వేదికైంది. విమానాల రాకపోకలతో పండుగ వాతావరణం నెలకొంది. బెంగళూరు నుంచి తొలి ఇండిగో విమానం (6ఈ 7911) కర్నూలు విమానాశ్రయానికి ఉదయం 10.10 గంటలకు చేరుకోగా ఆధునిక అగ్నిమాపక వాహనాలు వాటర్‌ క్యానన్‌ రాయల్‌ సెల్యూట్‌తో ఘన స్వాగతం పలికాయి.  

ప్రయాణికులకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వాగతం పలికారు. బెంగళూరు నగర బావి నివాసి రాంప్రసాద్‌ దంపతుల కుమార్తె సాయి ప్రతీక్షకు పుష్పగుచ్ఛాన్ని అందచేశారు. ఇదే ఫ్లైట్‌లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌తోపాటు మొత్తం 72 ప్రయాణికులు బెంగళూరు నుంచి వచ్చారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కలెక్టర్‌ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్‌ కె. ఫక్కీరప్ప, జేసీలు ఎస్‌.రామసుందర్‌రెడ్డి, సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్, డీఆర్వో బి.పుల్లయ్య, డీఆర్‌డీఏ పీడీ ఎంకేవీ శ్రీనివాసులు, ఎయిర్‌పోర్టు ఏపీడీ కైలాస్‌ మండల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
విశాఖకు తొలి విమానం.. 
కర్నూలు నుంచి తొలి విమానం విశాఖకు ఎగిరింది. ఇందులో వెళ్లిన 66 మంది ప్రయాణికులకు ఇండిగో యాజమాన్యం పుల్లారెడ్డి స్వీటు, పోస్టల్‌ స్టాంపు ప్రత్యేక కవర్లను అందజేసింది. 11.50 గంటలకు విశాఖ వెళ్లే విమానానికి మంత్రులు జాతీయ జెండాను ఊపడంతో టేకాఫ్‌ అయింది. మధ్యాహ్నం 1 గంటకు విశాఖలో 6ఈ 7913 విమానం బయలుదేరి కర్నూలుకు 2.55 గంటలకు చేరుకుంది. 6ఈ 7914 విమానం కర్నూలు నుంచి 3.15 గంటలకు బయలుదేరి 4.25 గంటలకు బెంగళూరులో ల్యాండింగ్‌ అయింది. చెన్నైలో 6ఈ7915 విమానం 2.50 గంటలకు బయలు దేరి కర్నూలుకు 4.10 గంటలకు చేరుకుంది. కర్నూలు నుంచి 6ఈ7916 విమానం 4.30 గంటలకు బయలుదేరి చెన్నైకు 5.50 గంటలకు చేరుకుంది.  

తొలి ఫ్లైట్‌ పైలట్‌ కర్నూలు వాసే.. 
బెంగళూరు నుంచి కర్నూలుకు వచ్చిన తొలి ఫ్లైట్‌ పైలట్‌ వీరా కర్నూలు వాసి కావడం గమనార్హం. సొంతూరుకు విమానం నడిపే భాగ్యం ఆయనకు లభించింది. తాను పుట్టి పెరిగింది కర్నూలులోనేనని వీరా తెలిపారు. కర్నూలు నుంచి ఆరు నెలల్లో తిరుపతి, విజయవాడకు విమానాలను నడుపుతామని ఎయిర్‌పోర్టు అథారిటీ ఎండీ భరత్‌రెడ్డి తెలిపారు.  

60 ఏళ్ల కల సాకారం.. 
‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే కర్నూలులో ఎయిర్‌ పోర్టు ఏర్పాటు చేయాలని భావించినా సాధ్యం కాలేదు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 60 ఏళ్ల కలను సాకారం చేశారు. భవిష్యత్‌లో కర్నూలు విమానాశ్రయాన్ని విస్తరించి అంతర్జాతీయ స్థాయికి పెంచుతాం’ 
– మంత్రులు బుగ్గన, గుమ్మనూరు

సౌకర్యవంతం.. 
‘మేం నంద్యాలలో నివాసం ఉంటాం. నా భార్య సంధ్య పుట్టిల్లు విశాఖ వెళ్లేందుకు విమాన ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంది. జగనన్నకు కృతజ్ఞతలు’ 
– రఫీక్‌బాషా, (విశాఖ విమాన ప్రయాణికుడు) 

ప్రతీ ఆదివారం కర్నూలు వస్తా.. 
‘అమ్మానాన్న కర్నూలులో ఉంటారు. నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా బెంగళూరులో పనిచేస్తున్నా. గతంలో ఎవరైనా తోడు ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఎవరూ అవసరంలేదు. ప్రతి ఆదివారం కర్నూలు వచ్చి అమ్మానాన్నను చూసి వెళ్తా. కర్నూలులో విమానాశ్రయం ఏర్పాటు చేయడం చాలా సౌకర్యంగా ఉంది’  
– సునీత, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు  

థ్యాంక్స్‌ టూ జగనన్న.. 
‘గతంలో చంద్రబాబు నాన్చుడు ధోరణితో ఎయిర్‌పోర్టు పూర్తి కాలేదు. థ్యాంక్స్‌ టూ జగనన్న. నేను గోవా నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి కర్నూలుకు విమానంలో వచ్చా’    
– ధర్మా, కర్నూలు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement