రన్‌వే మీదుగా వెళ్తున్న విమానాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని జాతీయ రహదారిపై గురువారం చేపట్టిన విమానాల తొలి ట్రయల్ రన్ వియవంతమైంది. పిచ్చకలగుడిపాడు–రేణింగవరం గ్రామాల వద్ద 16వ నంబర్ హైవేపై 4.1 కిలోమీటర్ల పొడవు, 33 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన రన్‌వే మీదుగా విమానాలు గాల్లోకి దూసుకువెళ్లాయి.
నాలుగు ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఒక కార్గో విమానం ఐదు అడుగుల ఎత్తులో తిరుగుతుండగా.. రాడార్ సిగ్నల్స్‌తో పాటు రన్‌వే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనువుగా ఉందా.. లేదా.. అనే విషయాన్ని వైమానిక దళ అధికారులు పరిశీలించారు. సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి ఎప్పటికప్పుడు సూచనలందుకుంటూ ఈ ట్రయల్ రన్‌ను నిర్వహించారు.
ఈ దృశ్యాలను తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో రన్‌వే వద్దకు చేరుకున్నారు. విమానాల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. ఉదయం 10.51 గంటలకు ప్రారంభమైన ట్రయల్ రన్ ప్రక్రియ 45 నిమిషాలపాటు జరిగింది.
బాపట్ల జిల్లా పిచ్చకలగుడిపాడు–రేణంగివరం మధ్య హైవేపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్
దేశంలోనే మూడవది..
వైమానిక దళ అధికారి ఆర్‌ఎస్ చౌదరి మాట్లాడుతూ.. ట్రయల్ రన్‌లో ఎలాంటి సమస్య ఎదురుకాలేదని చెప్పారు. రన్‌వేకు ఇరువైపులా ఫెన్సింగ్, గేట్లు పెట్టిన తర్వాత విమానాల ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై బాపట్ల–నెల్లూరు జిల్లాల మధ్యలో రెండు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలు సిద్ధం చేస్తున్నామన్నారు.
కొరిశపాడు మండలంలోని ఈ రన్‌వే.. దక్షిణ భారతదేశంలోనే మొదటిదని.. దేశంలోనే మూడవదని చెప్పారు. వచ్చే ఏడాది దీనిని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లో ఇప్పటికే రెండు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
ఏపీ, యూపీ, రాజస్తాన్‌తో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, జమ్మూ కశ్మీర్‌లలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ.. ట్రయల్ రన్‌లో ఎలాంటి లోపాలు కనిపించలేదని తెలిపారు.
కార్యక్రమంలో వాయుసేన అధికారి వి.ఎం.రెడ్డి, ప్రకాశం జిల్లా కలెక్టర్ కె.ఎస్.దినేశ్‌కుమార్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, వాయుసేన అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment