చేప పిల్లల ఉత్పత్తికి సిద్ధం చేసిన టబ్బులు, చేప పిల్లల ఉత్పత్తికి సిద్ధం చేసిన చిన్నపాటి చెరువులు
సాక్షి ప్రతినిధి, కడప: జలవనరులు పుష్కలంగా ఉన్న జిల్లాను చేపల ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఒకప్పుడు కరువు జిల్లాగా ఉన్న వైఎస్సార్ జిల్లాలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక పాత సాగునీటి వనరుల పెండింగ్ పనులు పూర్తి చేయడమే కాకుండా కొత్త సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జీఎన్‌ఎస్‌ఎస్, తెలుగుగంగ ప్రాజెక్టుల పరిధిలోని సాగునీటి వనరులలో 80 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ పెట్టింది.
వేసవిలోనూ ప్రాజెక్టులు జలాలతో నిండుకుండల్లా ఉన్నాయి. భవిష్యత్తులో మిగిలిన కొత్త ప్రాజెక్టుల పనులను పూర్తి చేసి పెద్ద ఎత్తున నీటిని నిల్వ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టులతోపాటు జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు సైతం నీటితో నిండడంతో జిల్లాలో చేపల పెంపకానికి అనువుగా ఉంటుందని భావించిన ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లను చేస్తోంది.
రూ. 2.70 కోట్లతో ఫిష్ బ్రీడింగ్ సెంటర్
రూ. 2.70 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో బ్రహ్మంసాగర్ జలాశయం వద్ద ప్రభుత్వం షిఫ్ బ్రీడింగ్ సెంటర్ నిర్మాణం చేపట్టింది. 14 చిన్నపాటి చెరువులు, 20 టబ్బులను నిర్మిస్తున్నారు. సాగునీటి వనరుల శాఖ వీటి నిర్మాణాలను చేపట్టింది. మరో నెల రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. అనంతరం చెరువులు, టబ్బులలో జిల్లా మత్స్యశాఖ చేపల సీడ్ ఉత్పత్తి చేపట్టనుంది. కట్లకట్ల (బొచ్చ), రోహిత (సీలావతి), ఎర్రమోసు (మిగాల), బంగారు తీగలు తదితర రకాల చేప పిల్లలను ఇక్కడే ఉత్పత్తి చేస్తారు.
వాటిని గుడ్లు పెట్టించి పిల్లలను ఇక్కడ తయారు చేయనున్నారు. అనంతరం ఆ చేప పిల్లలను మత్స్యకారులు, ఇతర చేపల పెంపకం ఆసక్తి గల వారికి సరఫరా చేస్తారు. ప్రస్తుతానికి జిల్లాలో వివిధ నీటి వనరుల ద్వారా 70 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. షిఫ్ బ్రీడింగ్ సెంటర్ పనులు పూర్తి కాగానే రూ. 2 కోట్లకు పైగా చేప పిల్లలను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. వీటిని జిల్లాలోని వివిధ జలాశయాలలో పెంచుతారు. రాయలసీమ వ్యాప్తంగా ఇక్కడి నుంచే చేప పిల్లలను సరఫరా చేసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మత్స్యకారులు, రైతులకు నాణ్యమైన చేప పిల్లలను సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
చేపల సీడ్ ఉత్పత్తి కేంద్రంగా జిల్లా
వైఎస్సార్ జిల్లాలోని జల వనరులను దృష్టిలో పెట్టుకుని చేపల పెంపకానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రధానంగా బ్రహ్మంసాగర్ జలాశయం వద్ద రూ. 2.70 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున చేప పిల్లలను ఉత్పత్తి చేసి జిల్లాలోని మత్స్యకారులు, రైతులకే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ఆసక్తి గల వారికి చేప పిల్లలను సరఫరా చేయనున్నాము.
– నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్, మత్స్యశాఖ, కడప
Comments
Please login to add a commentAdd a comment