![Fisherman Fought For 12 Hours Saved His Life In Sea - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/22/appa-rao.jpg.webp?itok=HYPb6vGZ)
పిఠాపురం: ప్రాణాల మీద ఆశ అతడిలో మనోధైర్యాన్ని తట్టి లేపింది. ఎలాగైనా బతకాలనే పట్టుదల నడి సంద్రాన్ని ఎదురీదేలా చేసింది. 12 గంటల పాటు సముద్రంలో ఆ మత్స్యకారుడు చేసిన సాహసమే అతడి ప్రాణాలను రక్షించింది. ఈ సంఘటన కాకినాడ సమీపంలో నడి సంద్రంలో జరిగింది.
దీనికి సంబంధించి తోటి మత్స్యకారులు తెలిపిన వివరాలివీ.. కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన పలువురు కాకినాడ శివారు రేపూరుకు చెందిన గేదెల అప్పారావుతో కలిసి బోటుపై మంగళవారం రాత్రి సముద్రంలో వేటకు వెళ్లారు. కాకినాడ తీరానికి సుదూర సముద్రంలో రాత్రి 8 గంటలకు చేపల కోసం సముద్రంలో వల వేసి బోటులో అందరూ పడుకున్నారు.
తెల్లవారుజామున 4 గంటలకు అందరూ లేచి చూసేసరికి అప్పారావు కనిపించలేదు. దీంతో ఈ విషయాన్ని ఉప్పాడ, అంతర్వేదిలో తోటి మత్స్యకారులకు చెప్పగా వారు మరో బోటుపై వెళ్లి అప్పారావు కోసం గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. ఇంతలో అంతర్వేది తీరం నుంచి చిన్న తెప్పపై చేపల వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులకు నడి సంద్రంలో ఓ వ్యక్తి తేలియాడుతూ కనిపించాడు. వెంటనే అక్కడికి వెళ్లి అతడిని తమ తెప్పలోకి ఎక్కించుకోగా కొన్ని క్షణాల్లోన్నే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
మత్స్యకారుల సపర్యలు..
దీంతో తోటి మత్స్యకారులు అతడి గుండెలపై బలంగా గుద్ది తాగిన నీటిని కక్కించి సపర్యలు చేయడంతో అతడిలో కదలికలు వచ్చాయి. వెంటనే అతడిని అంతర్వేది వద్ద ఒడ్డుకు చేర్చి 108లో రాజోలు ఆస్పత్రికి తరలించారు. అనంతరం అతడిని అప్పారావుగా గుర్తించారు. కాగా, చేపల కోసం వల వేసి అందరూ పడుకున్నాక తాను బహిర్భూమికి వెళ్లానని, ఇంతలో బోటు కదలడంతో ప్రమాదావశాత్తు సముద్రంలో పడిపోయానని అప్పారావు చెప్పాడు.
12 గంటల పోరాటం..
ఎంతసేపు ఈత కొట్టినా బోటు కనిపించకపోవడం..సముద్ర ఒడి ఎక్కువగా ఉండటంతో అలా ఈదుకుంటూ వచ్చానని తెలిపాడు. ఓపిక ఉన్నంత వరకు ఈదుకుంటూ తీరం వైపు వెళుతున్న తనకు ఎండ ఎక్కడంతో ఓపిక తగ్గిపోయిందని.. దీంతో మునిగిపోకుండా తానున్న స్థలంలోనే పైకి తేలి ఉండే విధంగా ప్రయత్నం చేశానని చెప్పాడు. 12 గంటల శ్రమ అనంతరం చివరకు తనకు దూరంగా ఒక తెప్ప కనిపించడంతో చేతులు పైకి ఊపుతూ రక్షించమని అడిగానని..ఆ తెప్పలో ఉన్నవారు తనని కాపాడారని అప్పారావు చెప్పాడు.
ఇది కూడా చదవండి: 'ఫ్యామిలీ డాక్టర్' పథకంతో మంచి ఫలితాలు.. ఆరేళ్లు దాటాక కూడా ప్రత్యేక శ్రద్ద
Comments
Please login to add a commentAdd a comment