సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటక రంగం ‘స్టార్’ స్టేటస్ సంతరించుకుంటోంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో సుమారు రూ.2,600 కోట్లతో పది ప్రపంచ స్థాయి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ఆతిథ్య రంగంలో దిగ్గజ సంస్థలైన ఒబెరాయ్, హయత్, తాజ్ గ్రూప్ ఇందులో పాలు పంచుకుంటున్నాయి. తద్వారా దాదాపు 48 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో మెగా టూరిజం ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ హోటళ్లు అందుబాటులోకి రానున్నాయి. నూతన టూరిజం పాలసీ 2020–2025 ప్రకారం పెట్టుబడిదారులకు ప్రభుత్వం పలు రాయితీలను కల్పిస్తోంది. సంబంధిత ప్రాజెక్టులకు భూ కేటాయింపులు చేసి సిద్ధంగా ఉన్నవి వెంటనే నిర్మాణ సంస్థలకు అప్పగించేలా ప్రభుత్వం ఇటీవల వేర్వేరు ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.
ఒబెరాయ్.. ఐదు ప్రదేశాల్లో
ఒబెరాయ్ హోటళ్ల గ్రూప్ రాష్ట్రంలోని ఐదు ప్రదేశాల్లో రూ.1,350 కోట్లతో 7–స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మించనుంది. అన్నవరం, పిచ్చుకలంక, పేరూరు, గండికోట, హార్సిలీహిల్స్ ప్రాంతాల్లో రిసార్ట్స్ (ఇండిపెండెంట్ విల్లా), కన్వెన్షన్ సెంటర్లను అభివృద్ధి చేయనుంది. హార్సిలీ హిల్స్‌లో సింగిల్ ఫేజ్‌లో నిర్మాణం పూర్తి కానుంది. లగ్జరీ సూట్‌లు, ఓపెన్ లాన్‌లు, పార్టీ ఏరియా, ఫైన్–డైనింగ్ రెస్టారెంట్‌లు, 24 గంటలు అందుబాటులో అంతర్జాతీయ రుచులతో కాఫీ షాప్‌లు, కాన్ఫరెన్స్, బాంకెట్ హాల్, బార్, ఈత కొలను, ఫిట్‌నెస్ సెంటర్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పా ఇతర సౌకర్యాలు వీటిలో అందుబాటులో ఉంటాయి.
పెనుకొండలో ఆధ్యాత్మిక కేంద్రం
ఇస్కాన్ చారిటీస్ (బెంగళూరు) ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుకొండ జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద రూ.వంద కోట్లతో 69.75 ఎకరాల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 288 గదులతో యాత్రి నివాస్ (అతిథి గదులు), 2 వేల సీట్ల సామర్థ్యంతో యాంపీ థియేటర్, కృష్ణలీలల థీమ్ పార్క్, 1,000 సీట్ల సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్, 108 పడకలతో ధర్మశాల డార్మిటరీలు అందుబాటులోకి రానున్నాయి. మ్యూజియం, ఆయుర్వేద వెల్‌నెస్ సెంటర్, సంస్కృతి భవన్, హెరిటేజ్ క్రాఫ్ట్ సెంటర్, ఐకానిక్ టవర్, చిన్నారులకు వినోద కేంద్రం, 600 కార్లకు పార్కింగ్ సదుపాయం, ప్రసాదం, ఫుడ్ కోర్టులు నిర్మించనున్నారు. దీని ద్వారా సుమారు పది వేల మందికి ఉపాధి లభించనుంది. పెనుకొండలో మూడేళ్ల భవన నిర్మాణ వ్యవధితో పాటు 33 ఏళ్ల లీజుకు అనుమతించారు.
నాలుగు చోట్ల ఫైవ్ స్టార్ హోటళ్లు
హయత్, తాజ్ గ్రూప్‌ల భాగస్వామ్యంతో నాలుగు ప్రాంతాల్లో ఐదు నక్షత్రాల హోటళ్లను నిర్మించనున్నారు. హయత్ సంస్థ విశాఖపట్నం శిల్పారామం పరిసరాల్లో రూ.200 కోట్లతో మూడు ఎకరాల్లో 200 గదులు, 1,500 సిట్టింగ్ సామర్థ్యంతో ఐదు నక్షత్రాల హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంతో 5 వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. తిరుపతిలోని శిల్పారామం ప్రాంతంలో రూ.204 కోట్లతో 2.66 ఎకరాల్లో 225 గదులు, 1,500 సిట్టింగ్ సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేయనుంది. ఇక్కడ 5,100 మందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయి.
విజయవాడలో రూ.92.61 కోట్లతో 81 గదులు, రెండు బాంకెట్ హాల్స్‌తో నాలుగు నక్షత్రాల హోటల్ రానుంది. ఇక తాజ్ వరుణ్ గ్రూప్ విశాఖపట్నంలో రూ.722 కోట్లతో 260 గదుల ఐదు నక్షత్రాల హోటల్, 90 సర్వీస్ అపార్ట్‌మెంట్స్, 12,750 చదరపు అడుగుల్లో కన్వెన్షన్ సెంటర్, 2,500 సీటింగ్ సామర్థ్యంతో టెక్నాలజీ స్పేస్‌ను నిర్మిస్తుంది. ఇందులో ఐదు రెస్టారెంట్లు, షాపులు, గేమింగ్ జోన్, రూఫ్ టాప్ హెలిప్యాడ్, ఒలింపిక్ లెంగ్త్ స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్ అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ 15 వేల ఉద్యోగవకాశాలు దక్కనున్నాయి.
రాయితీలు ఇలా..
పీపీపీ కింద అభివృద్ధి చేసే స్థలాల లీజు అద్దెను మార్కెట్ విలువలో ఒక శాతంగా నిర్ణయించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఐదు శాతం అద్దె పెంచనున్నారు. భూ బదలాయింపు చార్జీలను మినహాయించారు. స్టాంపు డ్యూటీ మొత్తాన్ని, ఐదేళ్ల పాటు వంద శాతం ఎస్‌జీఎస్టీని పూర్తిగా రీయింబర్స్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒబెరాయ్ సంస్థ ప్రాజెక్టులకు నాలుగేళ్ల నిర్మాణ కాలంతో పాటు 90 ఏళ్ల లీజును నిర్ణయించారు. ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఏడు నక్షత్రాల హోటళ్లు, లగ్జరీ విల్లాల విద్యుత్ వినియోగంలో యూనిట్‌కు రూ.2 చొప్పున, ఐదు నక్షత్రాల హోటళ్లు, సర్వీసు ఆపార్ట్‌మెంట్స్, కన్వెన్షన్ సెంటర్ల ప్రాజెక్టులకు యూనిట్‌కు రూపాయి చొప్పున ఐదేళ్ల పాటు రీయింబర్స్‌మెంట్ కల్పిస్తారు. ఆయా ప్రాజెక్టుల విలువను బట్టి ఏటా గరిష్ట వినియోగంపై పరిమితి విధించారు.
పెట్టుబడిదారులకు సులభంగా..
సీఎం వైఎస్ జగన్ దూరదృష్టితో రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. పాత పాలసీ కంటే మెరుగ్గా పెట్టుబడిదారులకు రాయితీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇండస్ట్రీ స్టేటస్ కల్పించాం. అందుకే అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. మెగా టూరిజం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు చేపడతాం. పెట్టుబడిదారులకు ఎక్కడా సమస్య లేకుండా నిర్మాణాలకు అవసరమైన స్థలాలను కేటాయిస్తున్నాం.
– ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment