land Allocations
-
ఆంధ్రప్రదేశ్ టూరిజం.. ‘స్టార్’డమ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటక రంగం ‘స్టార్’ స్టేటస్ సంతరించుకుంటోంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో సుమారు రూ.2,600 కోట్లతో పది ప్రపంచ స్థాయి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ఆతిథ్య రంగంలో దిగ్గజ సంస్థలైన ఒబెరాయ్, హయత్, తాజ్ గ్రూప్ ఇందులో పాలు పంచుకుంటున్నాయి. తద్వారా దాదాపు 48 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో మెగా టూరిజం ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ హోటళ్లు అందుబాటులోకి రానున్నాయి. నూతన టూరిజం పాలసీ 2020–2025 ప్రకారం పెట్టుబడిదారులకు ప్రభుత్వం పలు రాయితీలను కల్పిస్తోంది. సంబంధిత ప్రాజెక్టులకు భూ కేటాయింపులు చేసి సిద్ధంగా ఉన్నవి వెంటనే నిర్మాణ సంస్థలకు అప్పగించేలా ప్రభుత్వం ఇటీవల వేర్వేరు ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఒబెరాయ్.. ఐదు ప్రదేశాల్లో ఒబెరాయ్ హోటళ్ల గ్రూప్ రాష్ట్రంలోని ఐదు ప్రదేశాల్లో రూ.1,350 కోట్లతో 7–స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మించనుంది. అన్నవరం, పిచ్చుకలంక, పేరూరు, గండికోట, హార్సిలీహిల్స్ ప్రాంతాల్లో రిసార్ట్స్ (ఇండిపెండెంట్ విల్లా), కన్వెన్షన్ సెంటర్లను అభివృద్ధి చేయనుంది. హార్సిలీ హిల్స్‌లో సింగిల్ ఫేజ్‌లో నిర్మాణం పూర్తి కానుంది. లగ్జరీ సూట్లు, ఓపెన్ లాన్లు, పార్టీ ఏరియా, ఫైన్–డైనింగ్ రెస్టారెంట్లు, 24 గంటలు అందుబాటులో అంతర్జాతీయ రుచులతో కాఫీ షాప్‌లు, కాన్ఫరెన్స్, బాంకెట్ హాల్, బార్, ఈత కొలను, ఫిట్నెస్ సెంటర్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పా ఇతర సౌకర్యాలు వీటిలో అందుబాటులో ఉంటాయి. పెనుకొండలో ఆధ్యాత్మిక కేంద్రం ఇస్కాన్ చారిటీస్ (బెంగళూరు) ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుకొండ జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద రూ.వంద కోట్లతో 69.75 ఎకరాల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 288 గదులతో యాత్రి నివాస్ (అతిథి గదులు), 2 వేల సీట్ల సామర్థ్యంతో యాంపీ థియేటర్, కృష్ణలీలల థీమ్ పార్క్, 1,000 సీట్ల సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్, 108 పడకలతో ధర్మశాల డార్మిటరీలు అందుబాటులోకి రానున్నాయి. మ్యూజియం, ఆయుర్వేద వెల్నెస్ సెంటర్, సంస్కృతి భవన్, హెరిటేజ్ క్రాఫ్ట్ సెంటర్, ఐకానిక్ టవర్, చిన్నారులకు వినోద కేంద్రం, 600 కార్లకు పార్కింగ్ సదుపాయం, ప్రసాదం, ఫుడ్ కోర్టులు నిర్మించనున్నారు. దీని ద్వారా సుమారు పది వేల మందికి ఉపాధి లభించనుంది. పెనుకొండలో మూడేళ్ల భవన నిర్మాణ వ్యవధితో పాటు 33 ఏళ్ల లీజుకు అనుమతించారు. నాలుగు చోట్ల ఫైవ్ స్టార్ హోటళ్లు హయత్, తాజ్ గ్రూప్‌ల భాగస్వామ్యంతో నాలుగు ప్రాంతాల్లో ఐదు నక్షత్రాల హోటళ్లను నిర్మించనున్నారు. హయత్ సంస్థ విశాఖపట్నం శిల్పారామం పరిసరాల్లో రూ.200 కోట్లతో మూడు ఎకరాల్లో 200 గదులు, 1,500 సిట్టింగ్ సామర్థ్యంతో ఐదు నక్షత్రాల హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంతో 5 వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. తిరుపతిలోని శిల్పారామం ప్రాంతంలో రూ.204 కోట్లతో 2.66 ఎకరాల్లో 225 గదులు, 1,500 సిట్టింగ్ సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేయనుంది. ఇక్కడ 5,100 మందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయి. విజయవాడలో రూ.92.61 కోట్లతో 81 గదులు, రెండు బాంకెట్ హాల్స్‌తో నాలుగు నక్షత్రాల హోటల్ రానుంది. ఇక తాజ్ వరుణ్ గ్రూప్ విశాఖపట్నంలో రూ.722 కోట్లతో 260 గదుల ఐదు నక్షత్రాల హోటల్, 90 సర్వీస్ అపార్ట్మెంట్స్, 12,750 చదరపు అడుగుల్లో కన్వెన్షన్ సెంటర్, 2,500 సీటింగ్ సామర్థ్యంతో టెక్నాలజీ స్పేస్‌ను నిర్మిస్తుంది. ఇందులో ఐదు రెస్టారెంట్లు, షాపులు, గేమింగ్ జోన్, రూఫ్ టాప్ హెలిప్యాడ్, ఒలింపిక్ లెంగ్త్ స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్ అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ 15 వేల ఉద్యోగవకాశాలు దక్కనున్నాయి. రాయితీలు ఇలా.. పీపీపీ కింద అభివృద్ధి చేసే స్థలాల లీజు అద్దెను మార్కెట్ విలువలో ఒక శాతంగా నిర్ణయించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఐదు శాతం అద్దె పెంచనున్నారు. భూ బదలాయింపు చార్జీలను మినహాయించారు. స్టాంపు డ్యూటీ మొత్తాన్ని, ఐదేళ్ల పాటు వంద శాతం ఎస్జీఎస్టీని పూర్తిగా రీయింబర్స్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒబెరాయ్ సంస్థ ప్రాజెక్టులకు నాలుగేళ్ల నిర్మాణ కాలంతో పాటు 90 ఏళ్ల లీజును నిర్ణయించారు. ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఏడు నక్షత్రాల హోటళ్లు, లగ్జరీ విల్లాల విద్యుత్ వినియోగంలో యూనిట్‌కు రూ.2 చొప్పున, ఐదు నక్షత్రాల హోటళ్లు, సర్వీసు ఆపార్ట్‌మెంట్స్, కన్వెన్షన్ సెంటర్ల ప్రాజెక్టులకు యూనిట్‌కు రూపాయి చొప్పున ఐదేళ్ల పాటు రీయింబర్స్మెంట్ కల్పిస్తారు. ఆయా ప్రాజెక్టుల విలువను బట్టి ఏటా గరిష్ట వినియోగంపై పరిమితి విధించారు. పెట్టుబడిదారులకు సులభంగా.. సీఎం వైఎస్ జగన్ దూరదృష్టితో రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. పాత పాలసీ కంటే మెరుగ్గా పెట్టుబడిదారులకు రాయితీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇండస్ట్రీ స్టేటస్ కల్పించాం. అందుకే అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. మెగా టూరిజం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు చేపడతాం. పెట్టుబడిదారులకు ఎక్కడా సమస్య లేకుండా నిర్మాణాలకు అవసరమైన స్థలాలను కేటాయిస్తున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి -
ఖాళీగా ఉంచుతామంటే కుదరదు... టీఎస్ఐఐసీ షాకింగ్ నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించిన భూముల్లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను టీఎస్ఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) ముమ్మరం చేసింది. పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉన్న ప్లాట్లను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని గత ఏడాది ఆగస్టులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కోట్ల రూపాయల విలువ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఇప్పటివరకు 65 సంస్థల నుంచి సుమారు 1,960 ఎకరాల భూమిని టీఎస్ఐఐసీ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని అధికారులు అంటున్నారు. నిరుపయోగంగా ఉన్న భూముల్లో ఎక్కువ శాతం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోనే ఉన్నాయి. ఆదిభట్ల సెజ్, మడికొండ ఐటీ పార్క్, ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్క్, ఐడీఏ నాచారం, పాశమైలారం, పటాన్చెరు, కరకపట్ల బయోటెక్ పార్క్‌తోపాటు పలు చోట్ల ఖాళీ ప్లాట్లు ఉన్నట్లు తేలింది. కార్యకలాపాలు ప్రారంభించని కొందరు పారిశ్రామికవేత్తలు మరికొంత సమయం కావాలని టీఎస్ఐఐసీని కోరుతుండగా, మరికొందరు కోర్టును ఆశ్రయించారు. స్వాధీనం చేసుకున్న భూములను పెట్టుబడులతో వచ్చే వారిలో అర్హులైన వారికి తిరిగి కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐదు దశాబ్దాలుగా వేల ఎకరాలు కేటాయింపు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించానే లక్ష్యంతో ప్రభుత్వాలు పరిశ్రమల ఏర్పాటు కోసం దశాబ్దాల తరబడి భూములు కేటాయిస్తున్నాయి. ఐదు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో పారిశ్రామిక మౌలిక సదుపాయల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఏర్పడింది మొదలు 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు సుమారు 27వేల ఎకరాలు పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎస్ఐఐసీగా రూపాంతరం చెందిన తర్వాత నూతన పారిశ్రామిక చట్టం (టీఎస్ఐపాస్)లో భాగంగా సుమారు ఐదు వేల ఎకరాలకుపైగా పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించినట్లు అంచనా. రాష్ట్రంలోకి పెట్టుబడులు వేగంగా వస్తుండటంతో 35 వేల ఎకరాలను పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా టీఎస్ఐఐసీ మౌలిక సదుపాయల కల్పన పనులు చేపట్టింది. టీఎస్ఐపాస్ ద్వారా 2015 నుంచి ఇప్పటి వరకు 15,852 పరిశ్రమలు రూ.2.14 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి రాగా, 15.60 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. వీటిలో రూ.98 వేల కోట్ల పెట్టుబడులతో కార్యకలాపాలు ప్రారంభించిన 12 వేలకు పైగా యూనిట్లు 7.71 లక్షల మందికి ఉపాధి ఇస్తున్నాయి. 1,343 ఎకరాల మేర ఖాళీ ఓ వైపు పారిశ్రామిక వాడల్లో భూములు పొందినా కార్యకలాపాలు ప్రారంభించక పోవడంతో నిరుపయోగంగా మారగా, మరోవైపు వివిధ పారిశ్రామిక జోన్లలో 1,343 ఎకరాల విస్తీర్ణం మేర 1,205 ప్లాట్లు విక్రయానికి నోచుకోలేదు. పెరుగుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా ఈ ఖాళీ ప్లాట్ల ధరలను కూడా ప్రభుత్వం సవరిస్తూ పెట్టుబడులతో వచ్చే వారికి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటనలు ఇస్తోంది. కేటాయింపులు జరగని ప్లాట్లతోపాటు తిరిగి స్వాధీనం చేసుకునే ప్లాట్లను కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించేందుకు టీఎస్ఐఐసీ సన్నాహాలు చేస్తోంది. పారిశ్రామిక జోన్ల వారీగా ఖాళీగా ఉన్న ప్లాట్లు పారిశ్రామిక జోన్ ఖాళీ ప్లాట్లు సైబరాబాద్ 128 కరీంనగర్ 7 ఖమ్మం 31 మేడ్చల్–సిద్దిపేట 133 నిజామాబాద్ 3 పటాన్చెరు 130 శంషాబాద్ 347 వరంగల్ 418 యాదాద్రి 8 ............................................... మొత్తం 1,205 చదవండి : రికార్డు స్థాయిలో పెరిగిన దేశ జీడీపీ -
విమానాశ్రయాల అభివృద్ధికి చొరవ తీసుకోండి
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: విమానయాన మౌలిక సదుపాయాల బలోపేతం కోసం భూ కేటాయింపు, నిధుల డిపాజిట్ వంటి విషయాలను వేగవంతం చేసే అంశంలో వ్యక్తిగతంగా దృష్టి సారించాలని ఐదు రాష్ట్రాల సీఎంలను కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్ సీఎంలకు లేఖ రాశారు. దేశంలో పెరుగుతున్న విమానప్రయాణ డిమాండ్‌కు అనుగుణంగా వచ్చే నాలుగైదేళ్లలో రూ.20 వేల కోట్లతో ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధికి అవసరైన భూమిని ఇప్పటికే కేటాయించిందని పేర్కొన్నారు. అయితే తిరుపతి రన్‌వే విస్తరణ కోసం 14.31 ఎకరాలు, రాజమండ్రి సమీపంలో రెసిడెన్షియల్ కాలనీ నిర్మాణానికి 10.25 ఎకరాలు, కడపలో రన్‌వే విస్తరణ, అప్రోచ్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటుకు అవసరమైన 50 ఎకరాల భూమిని కూడా త్వరగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించాలని కోరారు. ఏలూరు కెనాల్‌ను దారిమళ్లించే పనులను వేగంగా పూర్తిచేస్తే విజయవాడ (గన్నవరం) విమానాశ్రయంలో 4 వేల మీటర్ల మేర రన్‌వే విస్తరణ, అప్రోచ్ లైటింగ్ సిస్టమ్ పనులను చేపడతామని తెలిపారు. రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ ఫండ్ ట్రస్ట్ ద్వారా ఉడాన్ ప్రాజెక్ట్‌లను రాష్ట్రం నుంచి నిర్వహించేందుకు (విశాఖపట్నం–దుబాయ్) రాష్ట్ర ప్రభుత్వం వందశాతం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) సమకూర్చాలని సూచించారు. దీన్ని త్వరగా పూర్తిచేస్తే బిడ్డింగ్‌కు మార్గం సుగమమై అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. -
అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటి కల సాకారం
సాక్షి, మచిలీపట్నం: నిరు పేదల సొంతింటి కల సాకారం కానుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సంకల్పించింది. ఆ దిశగా జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది.గడిచిన ఐదేళ్లలో ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల మంజూరు పేరిట రూ.వేల కోట్లు పక్కదారి పట్టాయి. కానీ అర్హులైన వారికి మాత్రం సెంటు జాగా కూడా దక్కలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇళ్లు, గృహరుణాలన్నీ తమ అనుయాయులకే ధారాదత్తం చేశారు. ఈ పరిస్థితి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి కల సాకారం చేయాలన్న తపనతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తొలి కేబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అసెంబ్లీలో కూడా అధికారిక ప్రకటన చేశారు. దీంతో ప్రభుత్వాదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సైతం చర్యలు చేపట్టింది. జిల్లాలో అర్హుల జాబితాలను సిద్ధం చేస్తోంది. గడిచిన ఐదేళ్లుగా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఇటీవల కొత్తగా ప్రారంభించిన స్పందన కార్యక్రమంలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇళ్ల స్థలాల కోసం జిల్లాలో 1,73,209 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా విజయనగరం అర్బన్ పరిధిలో 61,720 మంది దరఖాస్తు చేసుకోగా అత్యల్పంగా నూజివీడు అర్బన్‌లో 9,807 దరఖాస్తులున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో ఏకంగా 1,07,246 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా మచిలీపట్నం డివిజన్లో 19,638 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు స్పందన కార్యక్రమంలో ఇళ్ల స్థలాల కోసం అందుతున్న దరఖాస్తులన్నింటిని మాస్టర్ రిజిస్టర్లో నమోదు చేసి అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇంకా దరఖాస్తు చేసుకోలేని వారిలో అర్హులెవరైనా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారో గుర్తించాలని సూచించారు. అందిన దరఖాస్తుదారుల్లో అర్హులెంతమంది ఉన్నారో గుర్తించేందుకు త్వరలో అందుబాటులోకి రానున్న గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేయాలని నిర్ణయించారు. మరొక వైపు అర్హులైన వారి కోసం అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో అనువైన స్థలాల గుర్తించాలని ఆదేశించారు. అర్బన్‌లో ఎకరాకు 100 మంది, రూరల్‌లో ఎకరాకు 40 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కోసం ఎక్కువగా డిమాండ్ ఉంది? ఆయా ప్రాంతాల్లో ఏ మేరకు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎంత భూమి అవసరం ఉంటుంది. సేకరించేందుకు ఎక్కడైనా అనువైన భూములున్నాయా వంటి వాటిపై కార్యాచరణ రూపొందించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో క్షేత్ర స్థాయి పరిశీలనపై జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. పదిరోజుల్లో మండలాల వారీగా నివేదికలు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతు న్నారు. -
కేంద్రానికి ఏపీ సర్కార్ నోటీసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- కేంద్ర సర్కార్ల మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. రాజధాని ప్రాంతంలో కేంద్ర సంస్థల ఏర్పాటులో ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ, సంబంధిత భూములను తిరిగిచ్చేయాలంటూ సీఆర్డీఏ కేంద్రానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అమరావతిలో కేంద్రీయ విద్యాలయం, ఎస్బీఐ, ఎల్ఐసీ, ఎఫ్‌సీఐ, పోస్టల్, పబ్లిక్ వర్క్స్ తదితర సంస్థలు ఏర్పాటుచేస్తామంటూ కేంద్రం భూములు తీసుకుంది. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు మాత్రం చేపట్టలేదు. దీంతో తీసుకున్న భూముల్ని తిరిగిచ్చేయాలంటూ సీఆర్డీఏ అధికారులు కేంద్రంలోని ఆయా శాఖలకు నోటీసులు పంపారు. ‘‘భూములు తీసుకున్న మూడు నెలల్లోగా నిర్మాణాలు ప్రారంభించాలి. కానీ ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించలేదు. అందుకే నోటీసులు ఇచ్చాం’’ అని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మీడియాతో చెప్పారు. తాజా నోటీసులపై కేంద్రం స్పందించాల్సిఉంది. కాగా, కేంద్ర సంస్థల ఏర్పాటుపై నాలుగేళ్లు మిన్నకుండిన చంద్రబాబు.. ఇప్పుడే మేల్కొన్నట్లు హడావిడి చేయడం నాటకంలో భాగమేనని భూములిచ్చిన రైతులు అంటున్నారు. (తప్పక చదవండి: అమరావతిపై కేంద్ర సంస్థల అనాసక్తి) -
శరవేగంగా ‘పోలీస్’ నిర్మాణాలు
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజనతో ఏర్పడ్డ నూతన జిల్లాల్లో పోలీస్ కార్యాలయాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక్కొక్కదాన్ని 50 వేల ఎస్ఎఫ్టీతో నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం 11 జిల్లాల్లో మాత్రమే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్; కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాలో నిర్మాణాలు జరుగుతున్నాయి. మిగతా జిల్లాల్లో భూ కేటాయింపులపై సందిగ్ధత నెలకొంది. మొదటి దఫాలో డీపీఓలు... జిల్లా పోలీస్‌కు కీలకమైన డీపీఓ (డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్)ను మొదటి దఫాలో భాగంగా నిర్మిస్తున్నారు. డీపీఓల నిర్మాణానికి ఒక్కో జిల్లాకు దాదాపు రూ.25 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నట్టు పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ తెలిపింది. అదే విధంగా రెండో దఫాలో ఎస్పీ క్యాంపు ఆఫీస్‌తో పాటు పరేడ్ గ్రౌండ్, ఆర్మ్డ్ రిజర్వ్ భవనం, సిబ్బంది బ్యారక్‌లు నిర్మించాలని నిర్ణయించారు. వరంగల్ కమిషనరేట్ భవన నిర్మాణం సైతం శరవేగంగా కొనసాగుతుండగా, రామగుండం కమిషనరేట్ నిర్మాణానికి సంబంధించి భూ కేటాయింపులు ఇంకా పూర్తికాలేదు. మొత్తంగా మొదటి దఫాలో నిర్మితమవుతున్న డీపీఓల నిర్మాణాలకు రూ. 250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు తెలిసింది. ఫిబ్రవరి కల్లా పూర్తి: ఐజీ మల్లారెడ్డి ప్రస్తుతం 11 జిల్లాల్లో డీపీఓల నిర్మాణం జరుగుతోంది. ఇంకో మూడు జిల్లాల్లో భూ కేటాయింపులు తేలాల్చి ఉంది. అది కూడా త్వరలోనే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న డీపీఓల నిర్మాణం వచ్చే జనవరి చివరికల్లా పూర్తి చేసి, ఫిబ్రవరిలో ప్రారంభానికి సిద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నాం. -
భూంఫట్‌పై సభాసంఘాలు
హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు, వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై విచారణ: స్పీకర్ జూబ్లీహిల్స్ సొసైటీ పేరుతో భారీగా ‘రియల్’ వ్యాపారం: సీఎం సత్వరం నివేదిక తెప్పిస్తాం.. వక్ఫ్ భూముల్ని పరిరక్షిస్తాం సభలో కేసీఆర్ సవివర ప్రకటన విచారణ పరిధిలోకి టీఎన్జీవో సొసైటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా సహకార గృహ నిర్మాణ సంఘాలకు (కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ) భూ కేటాయింపులు, వక్ఫ్‌భూముల అన్యాక్రాంతంపై విచారణకు రెండు సభాసంఘాలు ఏర్పాటయ్యాయి. స్పీకర్ మధుసూదనాచారి గురువారం అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఫిలింనగర్ గృహ నిర్మాణ సొసైటీలతో పాటు అందుల్లో ప్రమేయం ఉన్న వక్ఫ్ భూముల్లో అక్రమాలకు సంబంధించి అసెంబ్లీ నిబంధనావళిలోని 74వ నియమం కింద ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, మరో నలుగురు సభ్యులు ఇచ్చిన నోటీసుకు సంబంధించి సభలో చర్చ జరిగింది. ఈ విషయమై విపక్ష సభ్యులు వెలిబుచ్చిన ఆందోళనతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఏకీభవించారు. సభాసంఘాలు వేసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని ప్రకటించారు. వీలైనంత తొందరగా విచారణ జరిపించి నివేదికలు తెప్పించుకోవాల్సిన అవసరముందన్నారు. ‘జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్లలోని వక్ఫ్‌భూములను పరరక్షిస్తాం. వాటిని కేటాయించిన అవసరాల నిమిత్తమేవినియోగించేలా చూస్తాం’ అని ప్రకటించారు. జూబ్లీహిల్స్ సహకార గృహనిర్మాణ సొసైటీకి భూ కేటాయింపు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని ఈ సందర్భంగా సీఎం సోదాహరణంగా వివరించారు. ‘‘జూబ్లీహిల్స్ సొసైటీకి 1964 జనవరి 31న ఎకరాకు రూ.200 చొప్పున మార్కెట్ విలువ చెల్లింపుపై షేక్‌పేట, హకీంపేట గ్రామాల్లో 1,398 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. స్థలాల కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగినపట్టు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సహకార శాఖ విచారణల్లో తేలింది. సభ్యుల ఎంపిక తదితరాల్లో సొసైటీ సరిగా వ్యవహరించలేదు .గతంలో మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న టీఎల్ ప్రసాద్, ఎన్ఎం చౌదరి, జి.నరసింహారావు, వెంకటేశ్వరరావు, సి.కృష్ణమూర్తి, పి.సుబ్బారావు తమ బంధువులు, బినామీ పేర్లపై ఎన్నో ప్లాట్లు కేటాయించారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, విదేశాల్లో నివసిస్తున్నవారిని కూడా అర్హులు కాకున్నా సభ్యులుగా చేర్చుకున్నారు. సొంతిళ్లున్న సీనియర్ ప్రభుత్వోద్యోగులను కూడా చేర్చుకోవడం, ఇతరులకు (థర్డ్ పార్టీకి) అక్రమంగా ప్లాట్లను బదిలీ చేయడం తదితరాల వల్ల వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వాస్తవ సభ్యులకు ప్లాట్ల కేటాయింపు జరగలేదు. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా 2002 మేనేజింగ్ కమిటీని రద్దు చేసి విచారణ ప్రారంభించారు. ఇప్పుడిది సీఐడీ విచారణలో ఉంది. ఫిలింనగర్ సొసైటీలోనూ సినీ పరిశ్రమకు చెందనివారికి ప్లాట్ల కేటాయింపు, బయటి వ్యక్తులకు ప్లాట్ల బదిలీల్లో సొసైటీలలో ఆర్థిక, పరిపాలక అక్రమాల వంటివి జరిగినట్టు విచారణాధికారి తేల్చారు. ఇందులో సినీయేతరసభ్యులు 10 శాతంగా ఉండాల్సింది 17.53 శాతమున్నారు. ప్రస్తుత కార్యదర్శికి ద్వంద్వ సభ్యత్వం, సభ్యుల ద్వారా ప్లాట్ల పునర్విభజన, బయటి వ్యక్తులకు విక్రయాలు, ఒకే కుటుంబంలో దగ్గరి బంధువులకు సభ్యత్వాలు, అర్హులకు ప్లాట్లివ్వకపోవడం, నివాస ప్లాట్లలో వాణిజ్య భవనాల నిర్మాణం వంటి అక్రమాలను గుర్తించాం’’ అని సీఎం వివరించారు. విచారణకు అక్బర్ డిమాండ్ వక్ఫ్‌భూముల అన్యాక్రాంతంపై సభాసంఘం, లేదా రిటైర్ట్ జడ్జితో నిర్ణీత కాలవ్యవధిలో న్యాయ విచారణ జరిపించాలని అంతకుముందు చర్చను ప్రారంభించిన అక్బర్ డిమాండ్ చేశారు. ‘‘జూబ్లీహిల్స్, ఫిలింనగర్, నందగిరి, జర్నలిస్టుల సహకార గృహ నిర్మాణ సొసైటీల్లో భూముల కేటాయింపుల్లో కనీసం రూ.500 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయి. హకీంపేట వద్ద 218.32 ఎకరాల హజరత్ హకీంషా సాహెబ్ బాబా దర్గా భూమి 400 ఏళ్లకు పైగా పురాతనమైనది. ఇది కచ్చితంగా వక్ఫ్దేనని నిరూపించగలను’’ అని చెప్పారు. వక్ఫ్‌భూముల ఆక్రమణలు నిజమేనని కేసీఆర్ బదులిచ్చారు. ఈ సొసైటీల వ్యవహారంలో దోషులను కాపాడేందుకు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయత్నించాయని అక్బర్ ఆరోపించారు. వీటిపై గతంలో జిల్లా అధికారి కిరణ్మయి ఇచ్చిన విచారణ నివేదికను ఎందుకు దాచారని, అందులో ఏముందని ప్రశ్నించారు. దాన్ని సభ ముందుంచాలని డిమాండ్ చేశారు. ఫిలింనగర్ సొసైటీలో సినిమా పరిశ్రమకు చెందని టి.చిన్నప్పరెడ్డికి 7 ప్లాట్లు కేటాయించారని సభ దృష్టికి తెచ్చారు. జూబ్లీహిల్స్ సొసైటీలో చివరికి పార్కు, బస్సు డిపో తదితరాలను కూడా వాణిజ్య అవసరాలకు మార్చేశారంటూ ధ్వజమెత్తారు. మాకెలాంటి శషభిషలూ లేవు: కేసీఆర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ గృహ నిర్మాణ సంఘానికి కేటాయించిన భూముల్లో కూడా అనర్హులకు కేటాయింపులతో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రస్తావించారు. దీన్ని కూడా సభాసంఘం విచారణ పరిధిలో చేర్చాలని కోరారు. అందులో అక్రమాలు నిజమేనని అక్బర్ కూడా అన్నారు. అలా చేర్చేందుకు తమకెలాంటి శషభిషలూ లేవని కేసీఆర్ బదులిచ్చారు. తెలంగాణలోని పది జిల్లాల్లోని అన్ని సహకార హౌసింగ్ సొసైటీల భూముల్లో జరిగిన అక్రమ కేటాయింపులపైనా సభా సంఘంతో విచారణ చేయిద్దామన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు తమకు అవకాశమివ్వాలని టీడీపీ సభ్యులు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్‌రెడ్డి కోరారు. రేవంత్ మాట్లాడేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్ చేశారు. టీడీపీ వారికి ఒక నిమిషం అవకాశం ఇవ్వాలని సీఎల్పీ నేత కె.జానారెడ్డి కోరగా అధికార పక్షం అంగీకరించింది.