ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: విమానయాన మౌలిక సదుపాయాల బలోపేతం కోసం భూ కేటాయింపు, నిధుల డిపాజిట్ వంటి విషయాలను వేగవంతం చేసే అంశంలో వ్యక్తిగతంగా దృష్టి సారించాలని ఐదు రాష్ట్రాల సీఎంలను కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్ సీఎంలకు లేఖ రాశారు. దేశంలో పెరుగుతున్న విమానప్రయాణ డిమాండ్‌కు అనుగుణంగా వచ్చే నాలుగైదేళ్లలో రూ.20 వేల కోట్లతో ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధికి అవసరైన భూమిని ఇప్పటికే కేటాయించిందని పేర్కొన్నారు.
అయితే తిరుపతి రన్‌వే విస్తరణ కోసం 14.31 ఎకరాలు, రాజమండ్రి సమీపంలో రెసిడెన్షియల్ కాలనీ నిర్మాణానికి 10.25 ఎకరాలు, కడపలో రన్‌వే విస్తరణ, అప్రోచ్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటుకు అవసరమైన 50 ఎకరాల భూమిని కూడా త్వరగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించాలని కోరారు. ఏలూరు కెనాల్‌ను దారిమళ్లించే పనులను వేగంగా పూర్తిచేస్తే విజయవాడ (గన్నవరం) విమానాశ్రయంలో 4 వేల మీటర్ల మేర రన్‌వే విస్తరణ, అప్రోచ్ లైటింగ్ సిస్టమ్ పనులను చేపడతామని తెలిపారు.
రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ ఫండ్ ట్రస్ట్ ద్వారా ఉడాన్ ప్రాజెక్ట్‌లను రాష్ట్రం నుంచి నిర్వహించేందుకు (విశాఖపట్నం–దుబాయ్) రాష్ట్ర ప్రభుత్వం వందశాతం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) సమకూర్చాలని సూచించారు. దీన్ని త్వరగా పూర్తిచేస్తే బిడ్డింగ్‌కు మార్గం సుగమమై అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment