భూంఫట్‌పై సభాసంఘాలు
హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు, వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై విచారణ: స్పీకర్
జూబ్లీహిల్స్ సొసైటీ పేరుతో భారీగా ‘రియల్’ వ్యాపారం: సీఎం
సత్వరం నివేదిక తెప్పిస్తాం.. వక్ఫ్ భూముల్ని పరిరక్షిస్తాం
సభలో కేసీఆర్ సవివర ప్రకటన
విచారణ పరిధిలోకి టీఎన్జీవో సొసైటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా సహకార గృహ నిర్మాణ సంఘాలకు (కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ) భూ కేటాయింపులు, వక్ఫ్‌భూముల అన్యాక్రాంతంపై విచారణకు రెండు సభాసంఘాలు ఏర్పాటయ్యాయి. స్పీకర్ మధుసూదనాచారి గురువారం అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఫిలింనగర్ గృహ నిర్మాణ సొసైటీలతో పాటు అందుల్లో ప్రమేయం ఉన్న వక్ఫ్ భూముల్లో అక్రమాలకు సంబంధించి అసెంబ్లీ నిబంధనావళిలోని 74వ నియమం కింద ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, మరో నలుగురు సభ్యులు ఇచ్చిన నోటీసుకు సంబంధించి సభలో చర్చ జరిగింది.
ఈ విషయమై విపక్ష సభ్యులు వెలిబుచ్చిన ఆందోళనతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఏకీభవించారు. సభాసంఘాలు వేసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని ప్రకటించారు. వీలైనంత తొందరగా విచారణ జరిపించి నివేదికలు తెప్పించుకోవాల్సిన అవసరముందన్నారు. ‘జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్‌లలోని వక్ఫ్‌భూములను పరరక్షిస్తాం. వాటిని కేటాయించిన అవసరాల నిమిత్తమేవినియోగించేలా చూస్తాం’ అని ప్రకటించారు. జూబ్లీహిల్స్ సహకార గృహనిర్మాణ సొసైటీకి భూ కేటాయింపు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని ఈ సందర్భంగా సీఎం సోదాహరణంగా వివరించారు. ‘‘జూబ్లీహిల్స్ సొసైటీకి 1964 జనవరి 31న ఎకరాకు రూ.200 చొప్పున మార్కెట్ విలువ చెల్లింపుపై షేక్‌పేట, హకీంపేట గ్రామాల్లో 1,398 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. స్థలాల కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగినపట్టు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సహకార శాఖ విచారణల్లో తేలింది. సభ్యుల ఎంపిక తదితరాల్లో సొసైటీ సరిగా వ్యవహరించలేదు .గతంలో మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న టీఎల్ ప్రసాద్, ఎన్‌ఎం చౌదరి, జి.నరసింహారావు, వెంకటేశ్వరరావు, సి.కృష్ణమూర్తి, పి.సుబ్బారావు తమ బంధువులు, బినామీ పేర్లపై ఎన్నో ప్లాట్లు కేటాయించారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, విదేశాల్లో నివసిస్తున్నవారిని కూడా అర్హులు కాకున్నా సభ్యులుగా చేర్చుకున్నారు. సొంతిళ్లున్న సీనియర్ ప్రభుత్వోద్యోగులను కూడా చేర్చుకోవడం, ఇతరులకు (థర్డ్ పార్టీకి) అక్రమంగా ప్లాట్లను బదిలీ చేయడం తదితరాల వల్ల వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వాస్తవ సభ్యులకు ప్లాట్ల కేటాయింపు జరగలేదు.
విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా 2002 మేనేజింగ్ కమిటీని రద్దు చేసి విచారణ ప్రారంభించారు. ఇప్పుడిది సీఐడీ విచారణలో ఉంది. ఫిలింనగర్ సొసైటీలోనూ సినీ పరిశ్రమకు చెందనివారికి ప్లాట్ల కేటాయింపు, బయటి వ్యక్తులకు ప్లాట్ల బదిలీల్లో సొసైటీలలో ఆర్థిక, పరిపాలక అక్రమాల వంటివి జరిగినట్టు విచారణాధికారి తేల్చారు. ఇందులో సినీయేతరసభ్యులు 10 శాతంగా ఉండాల్సింది 17.53 శాతమున్నారు. ప్రస్తుత కార్యదర్శికి ద్వంద్వ సభ్యత్వం, సభ్యుల ద్వారా ప్లాట్ల పునర్విభజన, బయటి వ్యక్తులకు విక్రయాలు, ఒకే కుటుంబంలో దగ్గరి బంధువులకు సభ్యత్వాలు, అర్హులకు ప్లాట్లివ్వకపోవడం, నివాస ప్లాట్లలో వాణిజ్య భవనాల నిర్మాణం వంటి అక్రమాలను గుర్తించాం’’ అని సీఎం వివరించారు.
విచారణకు అక్బర్ డిమాండ్
వక్ఫ్‌భూముల అన్యాక్రాంతంపై సభాసంఘం, లేదా రిటైర్ట్ జడ్జితో నిర్ణీత కాలవ్యవధిలో న్యాయ విచారణ జరిపించాలని అంతకుముందు చర్చను ప్రారంభించిన అక్బర్ డిమాండ్ చేశారు. ‘‘జూబ్లీహిల్స్, ఫిలింనగర్, నందగిరి, జర్నలిస్టుల సహకార గృహ నిర్మాణ సొసైటీల్లో భూముల కేటాయింపుల్లో కనీసం రూ.500 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయి. హకీంపేట వద్ద 218.32 ఎకరాల హజరత్ హకీంషా సాహెబ్ బాబా దర్గా భూమి 400 ఏళ్లకు పైగా పురాతనమైనది. ఇది కచ్చితంగా వక్ఫ్‌దేనని నిరూపించగలను’’ అని చెప్పారు. వక్ఫ్‌భూముల ఆక్రమణలు నిజమేనని కేసీఆర్ బదులిచ్చారు. ఈ సొసైటీల వ్యవహారంలో దోషులను కాపాడేందుకు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయత్నించాయని అక్బర్ ఆరోపించారు. వీటిపై గతంలో జిల్లా అధికారి కిరణ్మయి ఇచ్చిన విచారణ నివేదికను ఎందుకు దాచారని, అందులో ఏముందని ప్రశ్నించారు. దాన్ని సభ ముందుంచాలని డిమాండ్ చేశారు. ఫిలింనగర్ సొసైటీలో సినిమా పరిశ్రమకు చెందని టి.చిన్నప్పరెడ్డికి 7 ప్లాట్లు కేటాయించారని సభ దృష్టికి తెచ్చారు. జూబ్లీహిల్స్ సొసైటీలో చివరికి పార్కు, బస్సు డిపో తదితరాలను కూడా వాణిజ్య అవసరాలకు మార్చేశారంటూ ధ్వజమెత్తారు.
మాకెలాంటి శషభిషలూ లేవు: కేసీఆర్
తెలంగాణ నాన్ గెజిటెడ్ గృహ నిర్మాణ సంఘానికి కేటాయించిన భూముల్లో కూడా అనర్హులకు కేటాయింపులతో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రస్తావించారు. దీన్ని కూడా సభాసంఘం విచారణ పరిధిలో చేర్చాలని కోరారు. అందులో అక్రమాలు నిజమేనని అక్బర్ కూడా అన్నారు. అలా చేర్చేందుకు తమకెలాంటి శషభిషలూ లేవని కేసీఆర్ బదులిచ్చారు. తెలంగాణలోని పది జిల్లాల్లోని అన్ని సహకార హౌసింగ్ సొసైటీల భూముల్లో జరిగిన అక్రమ కేటాయింపులపైనా సభా సంఘంతో విచారణ చేయిద్దామన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు తమకు అవకాశమివ్వాలని టీడీపీ సభ్యులు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్‌రెడ్డి కోరారు. రేవంత్ మాట్లాడేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్ చేశారు. టీడీపీ వారికి ఒక నిమిషం అవకాశం ఇవ్వాలని సీఎల్పీ నేత కె.జానారెడ్డి కోరగా అధికార పక్షం అంగీకరించింది.