సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: భూ సమస్యలకు సంబంధించి ఎలాంటి అవకతవకలు, జాప్యానికి తావు లేకుండా.. పారదర్శకంగా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే అధికారుల అండతో దీనికీ తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు.. వివాదాల్లో ఉన్న వక్ఫ్ భూముల్ని మింగేస్తున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం ముక్తిపాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకున్న భూ బాగోతం ఇందుకు ఓ ఉదాహరణగా నిలుస్తోంది.
కోర్టులో కేసులుండి వివాదాస్పదంగా మారిన వక్ఫ్ బోర్డుకు చెందిన ఇనాం (కిద్మత్) భూములపై ఎప్పటినుంచో నజర్ వేసిన కొందరు ‘పెద్దలు’చాకచక్యంగా వాటిని కొట్టేశారు. టెనెంట్‌దారులు (సాగుదారులు), ఇనాందారుల మధ్య రాజీ కుదర్చడంతో పాటు నకిలీ దస్తావేజులు సృష్టించి, రిజి్రస్టేషన్ చేయించి కోట్లాది రూపాయలు దండుకున్నారు. నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డు పరిధిలో కిద్మత్ ఇనాం కింద ఇచి్చన భూముల క్రయవిక్రయాలకు హక్కులు ఉండవు. ఎవరైతే ఇనాం పొందుతారో వారితో పాటు తర్వాతి తరాలు సాగు చేసుకునేందుకు మాత్రమే హక్కులు ఉంటాయి. కానీ.. కొంతకాలం క్రితం బదిలీపై వెళ్లిన ఓ జిల్లా స్థాయి అధికారి, ఓ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి కుమ్మక్కై చక్రం తిప్పారనే ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం రూ.5 కోట్లతో ఒప్పందం చేసుకున్నారని, తహసీల్దార్‌కు సమాచారం లేకుండానే రిజి్రస్టేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది.
వారసులతో ఒప్పందం కుదుర్చుకుని..
ముక్తిపాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో 19, 20, 50, 51 సర్వే నంబర్లలో 48 ఎకరాల భూమి ఉంది. దీన్ని మూడు తరాలుగా చెన్నారం గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాల వారు సాగు చేసుకుంటూ టెనెంట్‌దారులుగా ఉన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఇది కిద్మత్ కింద ఇనాం భూమిగా.. హుస్సేని ఆలం ఇనాందారుగా ఉన్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచి్చన తర్వాత ఆలం ఆ భూముల పట్టాదారుగా ఆన్‌లై¯న్‌లో నమోదైంది. విషయం తెలిసిన టెనెంట్ దారులు తాము అనేక ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని, తమ పేరు మీద పట్టాదారు పాసు బుక్కులు ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
ఆ తర్వాత సదరు ఇనాందారుకు చెందిన వారసులు (మూడో తరం) కూడా తమకే హక్కు కలి్పంచాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. ఇలా ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతుండగా ఈ భూములపై కన్నేసిన పెద్దలు.. ఇనాందారుడి వారసులతో ముందస్తు ఒప్పందం చేసుకున్నారు. మీ పేరిట పట్టాదారు పాసుబుక్కులు తెచ్చే బాధ్యత తమదని..ఆ తర్వాత ఆ భూమిని తమకే అమ్మాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఇనాందారుడి వారసులను కుటుంబసభ్యులుగా చేర్చి ఫ్యామిలీ సరి్టఫికెట్‌తో సంబంధిత 48 ఎకరాల కిద్మత్ ఇనాం భూమిని అధికారుల అండదండలతోవారి పేరిట మార్చి పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు.
ఇలా వెలుగులోకి..
ఇనాందారుల పేరిట మొత్తం 48 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరైన విషయం తెలుసుకున్న టెనెంట్ దారులు మూకుమ్మడిగా కోస్గిలోని తహసీల్‌దారు కార్యాలయానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచి్చంది. అయితే తన ప్రమేయం లేకుండానే పాసు బుక్కులు వచ్చాయని.. తనకు కనీస సమాచారం లేదని తహసీల్దార్ లిఖిత పూర్వకంగా ధ్రువీకరణ ఇచ్చారు. అసలు విషయం బట్టబయలు కావడంతో పాసు బుక్కులు రద్దు చేస్తున్నామని జిల్లా అధికారులు ప్రకటించి తాత్కాలికంగా గొడవను సద్దుమణిగించారు. కానీ అక్రమార్కులు ఇంతటితో ఆగలేదు. భూముల్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని పథకం వేశారు.
ఓ అధికారి కీలకపాత్ర!
నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఓ అధికారి ఈ భూ బాగోతంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయి అధికారితో పాటు ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి సమాచారం చేరవేసి తతంగం నడిపించినట్లు సమాచారం. కోర్టు కేసులకు సంబంధించి ఇరువర్గాల అడ్వకేట్లు సహా ఇటు టెనెంట్‌దారులు, అటు వారసుల మధ్య రాజీ కుదిర్చాడు. ఇరువర్గాలు 48 ఎకరాల భూములను సమానంగా పంచుకుని.. హైదారాబాద్ చెందిన ఓ రియల్టర్ల గ్రూప్‌నకు అమ్మేలా ఒప్పందం చేయించాడు. ఉన్నతాధికారి సహకారంతో ఇరువర్గాలకు (టెనెంట్, ఇనాందారులకు) సమానంగా 24 ఎకరాల చొప్పున రిజి్రస్టేషన్ చేయించాడు. గుట్టుచప్పుడు కాకుండా సాగిన రిజి్రస్టేష¯న్ వెనుక రూ.5 కోట్ల డీల్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ రియల్టర్లు ప్రజాప్రతినిధి బినామీలేనట..
ఒప్పందం ప్రకారం ఇనాందారులకు సంబంధించిన 24 ఎకరాల భూములను హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే వీరందరూ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి చెందిన బినామీలేనని తెలిసింది. కాగా సదరు ప్రజాప్రతినిధి ముందస్తు ఒప్పందం ప్రకారం వారసులకు తూతూ మంత్రంగా ముట్టజెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత ఇటీవలే 11 ఎకరాలను కోస్గి పట్టణానికి చెందిన ఇద్దరు బడావ్యాపార వేత్తలకు ఏకంగా రూ.6.5 కోట్లకు విక్రయించి తిరిగి వారి పేరిట రిజి్రస్టేషన్ చేయించారు. ఈ భూభాగోతంపై వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ రియాజ్‌ను సంప్రదించగా.. ‘నేను ఇటీవలే బదిలీపై వచ్చా. పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి వక్ఫ్ బోర్డు సీఈఓకు నివేదిక అందజేస్తా’అని సమాధానమిచ్చారు.
ఇది కూడా చదవండి: మూడు రాష్ట్రాల సరిహద్దులో ‘మావో’ల భేటీ?
Comments
Please login to add a commentAdd a comment