
సాక్షి,ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో జనసేనకు చెందిన కార్పొరేటర్, ఇతర నాయకులు సోమవారం తీవ్రంగా రెచ్చిపోయారు. నగరంలో వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను చించివేస్తూ గందరగోళం సృష్టించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతూ ఫ్లైఓవర్ బ్రిడ్జి, చర్చి సెంటర్, ఇతర ప్రధాన కూడళ్లలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని చూసి రెచ్చిపోయిన జనసేన నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా పలుచోట్ల వివాదానికి దిగారు.
వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను తొలగించాలంటూ పోలీసులతో అడ్డగోలుగా వాదించారు. చర్చి సెంటరుకు చేరుకున్న జనసేన కార్యకర్తలు గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించారు. జనసేనకు చెందిన 38వ డివిజన్ కార్పొరేటర్ మునగాల రమేష్ కర్నూలు రోడ్డులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. అక్కడ ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న పోలీసులు వారిస్తున్నా వినలేదు. దాంతో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని, ఆ తర్వాత వదిలేశారు. వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను చించివేసిన రమేష్ పై వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
Comments
Please login to add a commentAdd a comment