మంత్రులు అనిత, సంధ్యారాణిపై
వరద బాధితుల ఫైర్
(విజయవాడ వరద ప్రాంతం నుంచి ‘సాక్షి’ బృందం) ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా కండ్రిక, రాజీవ్‌నగర్ కాలనీలను పరిశీలించేందుకు వచ్చిన మంత్రులు సంధ్యారాణి, వంగలపూడి అనితలకు స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. వారిని చూడగానే ముంపు బాధితులు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. మూడ్రోజులుగా వరద నీటిలో అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, కనీసం తాగునీరు, భోజన వసతులు కల్పించడంలో పూర్తి విఫలమయ్యారని మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్నవారిని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి నానా అగచాట్లు పడుతున్నామని విరుచుకుపడ్డారు. రాజీవ్ నగర్, కండ్రిక, గుణదల వంద అడుగుల రోడ్డు, గుణదల ఫ్లిప్‌కార్ట్ గోదాము, బ్రిటానియా గోదాములతో పాటు గుణదల రోడ్డు వంటి ప్రాంతాల్లో సహాయక చర్యలులేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.
తీరికలేనప్పుడు రావడమెందుకు?
మంత్రి సంధ్యారాణితో వచ్చిన ఆహార పొట్లాల వాహనాన్ని ఆమె చేతుల మీదుగా ఇప్పించేందుకు టీడీపీ శ్రేణులు యతి్నంచారు. అయితే, బాధితులు అప్పటికి భోజనంలేక మూడ్రోజులుగా ఇబ్బందులు పడుతుండటంతో ఆహార పొట్లాల వాహనం వద్దకు గుంపులుగా చేరుకున్నారు. దీంతో టీడీపీ వారు ఆహార పొట్లాలను గాలిలోకి ఎగరేయడంతో తీవ్ర విమర్శలపాలయ్యారు. ఇలా మంత్రులు కొద్దిదూరం ట్రాక్టర్‌పై వెళ్లి ఆ తర్వాత వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment