ఎమ్మెల్యేలు, వలంటీర్లకు చేతులెత్తి మొక్కాల్సిందే! | Flood Victims Shared Their Opinions With Sakshi At Chittoor | Sakshi
Sakshi News home page

ప్రాణాలొడ్డి.. ఒడ్డుకు చేర్చారు!

Published Mon, Nov 30 2020 9:02 AM | Last Updated on Thu, Apr 14 2022 12:26 PM

Flood Victims Shared Their Opinions With Sakshi At Chittoor

బాధితుడిని ఒడ్డుకు చేర్చుతున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి(ఫైల్‌)

ఇంట్లో సేద తీరుతుంటే హఠాత్తుగా వరద వచ్చి పడితే ఏం చేయాలి..మోకాలి వరకు వచ్చిన నీళ్లు చూస్తుండగానే భుజాల పైకి వస్తుంటే, అంతకంతకూ ప్రవాహం పెరుగుతుంటే ఇంటిల్లిపాదీ బయటకు రాలేక, ఇంట్లో ఉండలేక బతుకుపై ఆశలు సన్నగిల్లుతుంటే.... రోజులాగానే రోడ్డుపై వెళుతుండగా నీటి ప్రవాహం అడ్డుకుంటే.... పొలం దగ్గరికి వెళ్లి వస్తుండగా వాగు లాక్కెళ్లిపోతే.. అలాంటి పరిస్థితుల్లో మేమున్నామంటూ వచ్చారు ఈ ప్రాణ ప్రదాతలు. మృత్యు ముంగిట ఉన్న వారిని ప్రాణాలొడ్డి ఒడ్డుకు చేర్చారు. నివర్‌ పంజా విసిరిన వేళ  మన అధికారులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, వలంటీర్లు స్పందించిన తీరుకు చేతులెత్తి మొక్కాల్సిందే.

గోడలు కూల్చి కాపాడాం
చిత్తూరు అర్బన్‌:  తుపాను ముందురోజే కమిషనర్‌ ఉద్యోగులు అందరినీ అప్రమత్తం చేశారు. వార్డు సచివాలయాల్లోని కార్యదర్శులు, వలంటీర్లు అప్రమత్తంగా ఉండాలని పదేపదే చెప్పారు. ఆ రోజు (27వ తేదీ) మధ్యాహ్నం సచివాలయ కార్యదర్శి నుంచి కమిషనర్‌కు మెసేజ్‌ రావడంతో వెంటనే నన్ను పురమాయించారు. మెసానిక్‌ మైదానం పక్కన 15 మంది వరకు చెరువునీటిలో చిక్కుకున్నారని తెలిసింది. పది నిమిషాల్లో నేను, మా సిబ్బంది వెళ్లి చూస్తే  పూరిళ్లు, షెడ్లు మోకాలు లోతు నీళ్లలో ఉన్నాయి. వెంటనే అడ్డుగా ఉన్న గోడల్ని కూల్చాం, షెడ్లపైన నిల్చుని పిల్లల్ని పైకి తీసుకున్నాం. అయితే పెద్దోళ్లు ముగ్గురు అక్కడే ఉండిపోయారు. సమాచారమందుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అక్కడికి వచ్చేశారు. పెద్ద రోప్‌లు వేసి మిగిలినవాళ్లను పైకి లాగాము. చూస్తుండగానే మరో అరగంటలో ఇళ్లు మునిగిపోయాయి. ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం, సిబ్బంది బాధ్యతగా పనిచేయడం వల్లే ప్రాణనష్టం లేకుండా అందరినీ కాపాడగలిగాం.  – నాగేంద్ర, పట్టణ ప్రణాళిక అధికారి, చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌

అందరం ఏడ్చేశాం
ఆరోజు మధ్యాహ్నం వరకు నీటి ప్రవాహం తక్కువే ఉంది. రాత్రి 7 గంటలప్పుడు ఇంటి కింది అంతస్తు మునిగిపోతే నేను నా భార్య, ముగ్గురు పిల్లలు మెట్లపైకి వెళ్లిపోయాం. కరెంటు పోయింది. నీటిలో పురుగులు, పాము లు వచ్చేశాయని పిల్లలు భయపడిపోయారు. మేము వాళ్లతో కలిసి ఏడ్చేశాం. ప్రెస్‌ వాళ్లకు చెప్పడంతో పోలీసుల్ని పంపారు. వాళ్లు మాకు మరోజన్మనిచ్చారు.   – యుగంధర్, చిత్తూరు

వరదనీటిలో చిక్కుకుని బయటపడిన చిత్తూరు మెసానిక్‌ మైదానం కాలనీ వాసులు 


దారులన్నీ మూసుకుపోయినా ..
వాట్సప్‌ గ్రూపులో మెసేజ్‌ రావడంతో చిత్తూరులోని బాలభవన్‌ స్కూలు పక్కనున్న కాలనీ నీటితో ముగినిపోయిందని, సాయం కోసం ఓ కుటుంబం ఎదురుచూస్తోందని తెలుసుకున్నాం. అందరూ బయటపడ్డా.. వర్షపునీళ్లు ఇంట్లోకి వచ్చేయడంతో ఒక్క కుటుంబం మాత్రం అక్కడే ఉండిపోయింది.  వెంటనే వాళ్లతో మాట్లాడి స్పాట్‌కు వెళ్లిచూశాం. ఓవర్‌బ్రిడ్జి మీద నుంచి చూస్తే మనిషి లోతు మొత్తం నీళ్లతో నిండిపోయింది. కరెంట్‌లేదు. దారులన్నీ మూసుకుపోయాయి. కొద్దిగా టెన్షన్‌.. అయినా ఏదో ఒకటి చేసి కాపాడాలన్న తపన ఉంది. నాతోపాటు వచ్చిన ఎస్టీఎఫ్‌ పార్టీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పిల్లల్ని అలెర్ట్‌ చేశాం. పెద్ద రోప్‌లు వేసుకుని, ఈదుతూ అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరుకున్నారు. పిల్లల్ని భుజాలపైకి ఎత్తుకుని ఈదుతూ వచ్చారు. ఇద్దరు పెద్దవాళ్లను రోప్‌ పట్టుకోమని గట్టుపైకి తీసుకొచ్చాం. – ఎన్‌.సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ, చిత్తూరు     చదవండి: (నివర్‌ తుఫాన్‌: వైఎస్సార్‌ సీపీ నేత మృతి)

పునర్జన్మనిచ్చిన వలంటీర్‌  
చంద్రగిరి: రాయలపురం పక్కన మొండికాలువ సమీపంలో దోసలంక ఏరు ప్రవహిస్తుండటంతో నేను స్నేహితులతో కలసి వెళ్లాను. ఏరు దాటే క్రమంలో కాలు జారిపడి కొట్టుకుపోయాను. అక్కడే విధులు నిర్వహిస్తున్న నాగాలచెరువు వలంటీర్‌ వెంకటేష్‌ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు. కాసేపు తర్వాత నాకు స్పృహ వచ్చింది. ఈ రోజు నేను కుటుంబ సభ్యులతో కలసి ఉండానంటే దానికి వెంకటేషే కారణం.  – అభినయ్, రాయలపురం 


మాకిది పునర్జన్మ లాంటిది 
పీలేరు:  పీలేరు శివారు ప్రాంతంలో కామాటంవారిపల్లె నుంచి ఆకులవారిపల్లెకు వెళ్లే మార్గమధ్యంలో ఉన్న చిన్న గుట్టపై సీతారామయ్య ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. అయితే భారీ వర్షాలకు పింఛానది ఉగ్రరూపం దాల్చడంతో గుడిసె ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో సీతారామయ్య కుటుంబం ఒక మిట్టప్రాంతంలోకి వెళ్లి, తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రాత్రంతా గడిపారు. సమాచారమందుకున్న పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎస్పీ సెంథిల్‌ కుమార్, మదనపల్లె సబ్‌కలెక్టర్‌ జాహ్నవిని సంప్రదించి, కర్నూల్‌కు చెందిన రెస్క్యూ టీమ్, అగ్నిమాపక సిబ్బందితోపాటు స్థానిక సీఐ సాధిక్‌ అలీ రంగంలోకి దిగారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యుల కు అల్పాహారం అందించారు. క్రేన్‌ సహకారంతో రోప్‌ కట్టి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.   చదవండి:  (తుపాన్‌ మృతులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా)

ప్రాణాలమీద ఆశ వదిలేశాం  
నీటి ఉధృతికి మా ఇల్లు కొట్టుకుపోయింది. అనుక్షణం బిక్కుబిక్కుమంటూ గడిపాం. నదీ ప్రవాహాన్ని చూస్తే మేము బతికి వస్తామని అనుకోలేదు. ఎమ్మెల్యే, అధికారులు మమ్మల్ని కాపాడారు. – గీత

ఒంటిమీద పాములు పాకాయి 
రేణిగుంట: ‘‘రాళ్లకాలువ వాగులోకి గురువారం ఉదయం మేము వెళ్లే సమయంలో మోకాళ్లలోతు నీళ్లున్నాయి. నిలుచుని మోటారు స్టార్టర్లు విప్పుకుని గట్టువైపు అడుగులు వేశాం... హఠాత్తుగా వరద ఉధృతి అమాంతం పెరిగిపోయింది. చూస్తుండగానే నీళ్లు భుజాల వరకు వచ్చేశాయి. ఏం చేయాలో దిక్కు తోచలేదు... పక్కనే ఉన్న చిన్న కానుగ చెట్టును పట్టుకున్నా... అక్కడి నుంచి మెల్లగా చీమచింత చెట్టు వద్దకు చేరి కొమ్మను పట్టుకున్నా... నీటి ప్రవాహంలో పాము నా వీపు మీదుగా వెళ్లి, కాసేపు నా చుట్టూ చక్కర్లు కొట్టింది. కొమ్మను వదిలేస్తానేమోనని వణికిపోయా... నాతో వచ్చిన ఓ వ్యక్తి కళ్ల ముందే మునిగిపోతుంటే.. మరికొంత దూరంలో గట్టుమీద అయిన వాళ్ల ఆర్తనాదాలతో నాలో భయం పెరిగిపోయింది. ఆరు గంటలకు పైగా అక్కడే ఉండి బతుకుపై ఆశలు వదులుకున్నా. తరువాత రెస్క్యూ టీం నన్ను బోటులో ఎక్కించుకుని ఒడ్డుకు చేర్చాక కాస్త కుదుటపడ్డాను.’’ – అంటూ రేణిగుంట మండలం కుమ్మరపల్లికి చెందిన సుందరమ్మ, చెంగల్రాయులు కుమారుడు ఎం.వెంకటేష్‌(21) వివరించాడు. డిగ్రీ పూర్తి చేసిన అతను గ్రామ వలంటీర్‌గా పని చేస్తున్నాడు. ప్రాణాలను కాపాడటానికి కృషి చేసిన అధికార యంత్రాంగానికి, ఎమ్మెల్యేలకు రుణపడి ఉంటానని చెప్పారు.  

ఇది పునర్జన్మే
‘‘నేను పట్టుకున్న చెట్టు పట్టుజారే పరిస్థితిని గ్రహించి కిందున్న వైర్ల ఆధారంగా వెంకటేష్‌ ఉంటున్న చెట్టు వద్దకు చేరడానికి నేను చేసిన సాహసం బతుకు తీపిని వదిలేసుకుని చేసిందే... ఆరు గంటల నిరీక్షణ తరువాత బోటు శబ్దం విన్నాక ప్రాణం లేచి వచ్చింది... ప్రాణాలతో ఒడ్డుకు చేరా....’’ అంటూ  మరో యువకుడు కుమ్మరపల్లి దళితవాడకు చెందిన లోకేష్‌(25) కన్నీటి పర్యంతమయ్యాడు.  

గుండెలు జారిపోయాయి 
ఏర్పేడు: మండలంలోని శివగిరి కాలనీకి సమీపంలో ఉన్న  మామిడి తోటలో కాపలా ఉంటూ వరద ఉధృతిలో చిక్కుకుని రెస్క్యూ టీం సహకారంతో బయట పడిన గిరిజనులు వారి మనోగతాన్ని సాక్షితో పంచుకున్నారు.  ‘‘మేము కోన సమీపంలోని మామిడితోటలో కాపలా ఉంటున్నాము.  శుక్రవారం మామిడితోట పక్కన ఉన్న కోనకాల్వ వాగు ప్రవాహం పెరిగిపోయి మేముంటున్న చోటుకి వచ్చింది. నీటిలోనే మాప్రాణాలు పోతాయని అనుకున్నాం. భయంతో తోటలో నుంచి కేకలు వేశాం. కాల్వకు అవతల వైపున్న వారిని గట్టిగా కేకలు వేసి మేమంతా ఆపదలో చిక్కుకున్నామని, కాపాడాలని కోరాం. గంట గంటకూ నీటి ప్రవాహం ఎక్కువకావడంతో మాతోపాటు మా ముగ్గురు పిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయోమని భయపడ్డాం.

చిన్న బిడ్డలను భుజాలకు ఎత్తుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపాం. గండం నుంచి బయటపడి సురక్షితంగా బయట పడాలని కొలవని దేవుడు లేదు... కొన్ని గంటల సమయానికి  ఓ యంత్రం ద్వారా, ఆహారం, బిస్కెట్లు, వాటర్‌ బాటిళ్లు మావద్దకు పంపించారు. మాలో ఆశలు చిగురించాయి. సాయంత్రం చీకటి పడే సమయానికి మా వద్దకు ముగ్గురు వచ్చారు.  మాకు ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి పంపారని వారు మాతో చెప్పారు. వారితో రాత్రంతా చిన్నపిల్లలతో కలిసి బిక్కుబిక్కు మంటూ నిద్రలేకుండా గడిపాం. శనివారం ఉద యం నీటి ప్రవాహం తగ్గిపోయింది. కాల్వ అవతల వైపు నుంచి రోప్‌లు మావద్దకు వచ్చాయి. రోప్‌ల ద్వారా మేం, మా పిల్లలు కాల్వ గట్టుకు సురక్షితంగా చేరుకున్నాం. మా ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.’’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement