సొంతింటి కల సాకారమవుతోంది. పేదల్లో సంతోషం పరవళ్లు తొక్కుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలకు వేల ఇళ్లతో ఏకంగా ఊళ్లే ఊపిరి పోసుకుంటున్నాయి. మరోవైపు ఈ కార్యక్రమం ద్వారా నిర్మాణరంగం కళకళలాడుతోంది. వేలాది కార్మికులకు ఉపాధి లభిస్తోంది. స్టీల్, సిమెంట్, ఇటుకలు తదితర నిర్మాణ సామాగ్రి వ్యాపారాలు సైతం జోరుగా సాగుతూ మార్కెట్ టర్నోవర్ ను పెంచుతున్నాయి. జగనన్న కాలనీల పథకంతో ఇన్ని రకాలుగా మేలు జరుగుతున్నా.. విపక్షం కళ్లు లేని కబోదిలా వ్యవరిస్తోంది. ఇళ్ల నిర్మాణంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందని కుళ్లుకుంటోంది. పచ్చ మీడియా ద్వారా విషం చిమ్ముతోంది. తన పాలనలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని టీడీపీ శరవేగంగా జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలపై తప్పుడు ప్రచారానికి తెగబడుతూ పైశాచిక ఆనందం పొందుతోంది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో జగనన్న కాలనీల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గృహ ప్రవేశాలు కూడా మొదలైపోయాయి. కానీ వీటిని చూసి టీడీపీ ఓర్చుకోలేకపోతోంది. పచ్చ పత్రికలతో గోబెల్స్ ప్రచారానికి ఒడిగడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు న్యాయస్థానాల్లో పలు పిటీషన్లు వేసి అడ్డు తగిలినా చివరికి ధర్మమే గెలిచింది.
జిల్లాలో 1156 లేఅవుట్లు
జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసేకరణ చేసింది. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాల కోసం 1795.80 ఎకరాలు అవసరం కాగా 1227.17ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించింది. మిగతా 568. 63 ఎకరాల మేరకు ప్రైవేటు భూమి కొనుగోలు చేశారు. ఒక్క భూమి కొనుగోలు కోసమే రూ.178.31కోట్లు వెచ్చించారు.
అర్హులైన వారందరి కోసం జిల్లాలో 1156 లేఅవుట్లు వేశారు. లేఅవుట్ కోసం భూముల చదును చేయడం, జంగిల్ క్లియరెన్స్, అంతర్గత రోడ్లు, హద్దుల రాళ్లు, డ్రైనేజీ తదితర వాటి కోసం రూ. 30కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇవి కాకుండా లేఅవుట్లకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రూ.74కోట్లు ఖర్చు చేసింది. అలాగే లేఅవుట్లలో విద్యుత్ సౌకర్యం కోసమని రూ.10 కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది. వేసిన లేఅవుట్లలో పచ్చదనం కోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరుగుతోంది.
తొలి విడతలో 695 లేఅవుట్లు
జిల్లా వ్యాప్తంగా 1156 లేఅవుట్‌లు వేసినప్పటికీ తొలి విడతగా 695 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 40,630 స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో లబ్ధిదారులు ఉత్సాహంగా ఇళ్లు నిర్మాణాలు చేపడుతున్నారు. రెండేళ్ల కరోనాతో ఆర్థిక ఇబ్బందులు కారణంగా పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో కొంత జాప్యం జరుగుతున్నా... సొంతిళ్లు సాకారం చేసుకునేందుకు ప్రభుత్వమిచ్చిన ఆర్థిక సాయంతో నిర్మాణాలు వేగవంతం చేశారు. అధికారులు కూడా పర్యవేక్షణ చేసి ఎప్పటికప్పుడు వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు అవసరమైన సాయం అందిస్తున్నారు. మంజూరైన వాటిలో 38,174 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.
కొత్త కాలనీలు..
ప్రస్తుతం నిర్మాణాలు జోరుగా సాగుతుండటంతో కొత్తగా నిర్మిస్తున్న కాలనీలు కొత్త ఊళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఆ కాలనీల్లో నిర్మాణ సందడి కనిపిస్తోంది. అద్దెల భారం నుంచి బయటపడాలని లబ్ధిదారులు సైతం వ్యక్తిగత శ్రద్ధతో నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవన్నీ పూర్తయితే జిల్లాలో కొత్తగా 695 కాలనీలు అవతరించనున్నాయి.
సంపూర్ణ గృహ హక్కుతో..
1983 నుంచి 2011 వరకు ప్రభుత్వ గ్రాంట్‌తో, గృహ నిర్మాణ సంస్థ రుణంతో నిర్మించుకున్న ఇళ్లకు చాలా మంది పేరుకే యజమానులు తప్ప ఎలాంటి హక్కులు లేని పరిస్థితి ఉంది. మన పేరున హౌసింగ్ రుణం ఉండటంతో ఆ ఇళ్లను అమ్ముకోవడానికి, బదిలీకి, కనీసం లీజుకివ్వడానికి గానీ, అవసరం మేరకు బ్యాంకు రుణం తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎన్నాళ్లైనా ఆ ఇంటిలో ఉండటమే తప్ప అవసరాలకు దాన్ని వినియోగించుకోలేని దుస్థితి ఉండేది. సరికదా ఇళ్ల నిర్మాణం కోసమని తీసుకున్న రుణాన్ని వాయిదాల పద్ధతిలో వడ్డీతో కలిపి చెల్లించాల్సిన పరిస్థితి కొనసాగుతూనే ఉంది.
ఈ విధంగా తరాలు మారుతున్నా ప్రభుత్వ ఇళ్లకు సర్వహక్కులు పొందలేకపోయారు. ఇలాంటి వారి బాధలను దృష్టిలో పెట్టుకుని నామమాత్రం రుసుంతో ఇంటిపై సర్వహక్కులను కల్పించే సదుద్దేశంతో సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో జిల్లాలో లక్షా 93వేల 881మందికి ఉపశమనం కలిగింది. ఇప్పటికే 43వేల మంది రిజిస్ట్రేషన్లతో పక్కా పత్రాలు పొందారు.
ఇంటివారమయ్యాం..
నాకు వివాహమై 15 ఏళ్లవుతోంది. ఇన్నాళ్లకు మేం ఓ ఇంటి వారమయ్యాం. నా భర్త కూలి పని చేస్తుంటారు. సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేక ఇన్నాళ్లు అద్దె ఇంటిలోనే ఉన్నాం. జగనన్న వచ్చి విలువైన ఇంటి స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి డబ్బు మంజూరు చేశారు. చాలా ఆనందంగా ఉంది. తొందరగా పూర్తి చేసి గృహ ప్రవేశం చేద్దామనుకుంటున్నాం. ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోంది.
– నక్క ఆరుద్ర, గడ్డెయ్యపేట, జమ్ము, నరసన్నపేట
కల సాకరమైంది..
కుప్పిలికి చెందిన కుప్పిలి నారాయణమ్మది పేద కుంటుంబం. సొంతింటి కోసం ఎన్నో ఏళ్లుగా కలలు కన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నవరత్నాలు–వైఎస్సార్ ఇళ్లులో ఈమెకు సెంటున్నర స్థలం ఇంటి పట్టా ఇచ్చారు. రూ. 1.80 లక్షలు యూనిట్ మంజూరు చేశారు. ఇసుక కూపన్లు, నిబంధనల మేరకు ఐరన్, సిమ్మెంట్, పునాదులు తవ్వకానికి 90 రోజులు ఉపాధి హామీ పథకం మస్టర్ వేసి వేతనం ఇచ్చారు. ఇలా ఈమె సొంతింటి కల సాకారమైంది.
20 ఏళ్ల కల
టెక్కలికి చెందిన కరుకోల షణ్ముఖరావు, విజయలక్ష్మి దంపతుల 20 ఏళ్ల నిరీక్షణ వైఎస్సార్ జగనన్న కాలనీతో నెరవేరింది. షణ్ముఖరావు స్థానికంగా ఓ కిరాణా దుకాణంలో పనిచేస్తున్నారు. 20 ఏళ్లుగా పట్టణంలో అద్దె ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా టెక్కలి జగతిమెట్ట వద్ద ఆయనకు ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేసింది. దీంతో వారు ఎంతో సుందరంగా ఇంటిని కట్టుకున్నారు. 20 ఏళ్లుగా కలగానే ఉండిపోయిన సమస్యను వైఎస్ జగన్ తీర్చారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
(చదవండి: ఏ ఊళ్లోనూ 50% పైగా ఎస్సీలు లేరట!)
Comments
Please login to add a commentAdd a comment