
సాక్షి, కడప: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డా. ఎస్‌ఏ ఖలీల్‌బాషా మరి లేరనే నిజాన్ని ఆయన అభిమానులు..పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. గుండెపోటుతో ఆయన మంగళవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ప్రజల నాడి పసిగట్టిన నేతగా గుర్తింపు పొందిన ఖలీల్ బాషా 1974 నుంచి రెండు రూపాయల ఫీజుతో వైద్యం చేస్తూ విస్తృత ప్రాచుర్యం పొందారు. పట్టణ ప్రజలకేగాక, గ్రామీణ ప్రజలకు బాగా చేరువయ్యారు. ఎన్‌టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రవేశించి 1994, 1999లలో కడప నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్‌టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత ప్రముఖ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో చేరినా ఎంతోకాలం ఇమడలేకపోయారు.
2019 ఎన్నికలకు ముందు తన ముగ్గరు కుమారులతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేశారు. వయసు మీద పడినా ఆయన వైద్య సేవలను మాత్రం వీడలేదు. కరోనా బారిన పడిన వారికి సేవలందించారు. ఈ క్రమంలోనే గతనెల 30న వైరస్ బారిన పడ్డారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. తర్వాత నెగెటివ్ వచ్చింది. మూడు రోజుల క్రితం గుండెనొప్పి రావడంతో పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు కడపలోని ఆయన స్వగృహం వద్ద కోవిడ్ – 19 నిబంధనలను అనుసరించి జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
పలువురి సంతాపం
మాజీ మంత్రి ఖలీల్‌బాషా పట్ల డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పారీ్టకి తీరని లోటని చెప్పారు. ఖలీల్ బాషా మృతిపట్ల టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment