దస్తగిరి, రామలక్షుమ్మ(ఫైల్)
సాక్షి, ప్రొద్దుటూరు క్రైం : గొర్రెలను మేపుకునేందుకు వెళ్లిన బడుగు జీవులను విద్యుత్ కంచె కాటేసింది.. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రొద్దుటూరు మండల పరిధిలోని నంగనూరుపల్లె గ్రామానికి చెందిన బైరగాని దస్తగిరి (42), బత్తల రామలక్షుమ్మ (33) విద్యుదా ఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. రూరల్ పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లె గ్రామానికి చెందిన దస్తగిరి, రామలక్షుమ్మతో పాటు మరి కొందరికి గొర్రెల పోషణే జీవనాధారం. వీరు రోజు తమ జీవాలను గ్రామ శివారులో ఉన్న పొలాల గట్టుకు తీసుకెళ్లి మేపుకొని వస్తుంటారు.
ఈ క్రమంలో శనివారం ఉదయం రేగుళ్లపల్లె శివారు ప్రాంతాలకు జీవాలను తీసుకెళ్లారు. అక్కడ గొర్రెలు మేస్తుండగా బైరగాని దస్తగిరి, రామలక్షుమ్మలు సమీపంలోని వేరు శనగ సాగు చేసిన పొలం వద్దకు వెళ్లారు. అక్కడ పొలం చుట్టూ పందుల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగులుకొని అక్కడికక్కడే కుప్ప కూలి పోయారు. మేత మేస్తున్న ఏడు గొర్రెలతో పాటు కాపలాగా ఉన్న కుక్క కూడా మృత్యువాత పడింది. ఇంటి ఉంచి ఉదయం 10.30 గంటలకు వీరు వెళ్లారని, అయితే ప్రమాదం జరిగినట్లు సుమారు 2.30 గంటలకు తమకు తెలిసిందని గ్రామస్తులు చెబుతున్నారు.
మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు
కంచె ఏర్పాటు నేరం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంట పొలాలకు విద్యుత్ కంచెను ఏర్పాటు చేయడం నేరం. కంచె ఏర్పాటు చేసుకున్న రైతులు వేకువ జామునే వెళ్లి విద్యుత్ సరఫరాను తొలగిస్తారని, అయితే తెల్లారినా విద్యుత్ సరఫరా తీసేయకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలియడంతో రూరల్ ఎస్‌ఐ అరుణ్‌కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
గ్రామంలో విషాదం..
ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో నంగనూరుపల్లెలో విషాదం నెలకొంది. దస్తగిరి చాలా ఏళ్ల నుంచి గొర్రెలను కాసేవాడు. అతనికి పొలాలు లేవు, గొర్రెలను కాసుకోవడమే జీవనాధారం. భార్య మల్లేశ్వరి, సునీల్, అనిల్ అనే కుమారులతో పాటు కావ్య అనే కుమార్తె ఉంది.కుమారులిద్దరు డిగ్రీ, ఇంటర్ చదువుతుండగా, కుమార్తె ఐటీఐ చదువుతోంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న దస్తగిరి మృత్యువాత పడటంతో భార్యా, పిల్లలు రోదిస్తున్నారు. రామలక్షుమ్మకు భర్త నాగయ్యతో పాటు నాగేంద్ర, ప్రసన్న అనే కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరూ పోట్లదుర్తి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. తల్లి మృతి చెందిన విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
చదవండి: Afghanistan: పైసల్లేవ్! బన్ను కూడా దొరకని పరిస్థితి తప్పదా? తాలిబన్ల ముందు మార్గాలేంటంటే..
Comments
Please login to add a commentAdd a comment