లాభాల వలవేసి.. డబ్బు లాగేసి.. | Fraud in the name of Canadian Solar | Sakshi
Sakshi News home page

లాభాల వలవేసి.. డబ్బు లాగేసి..

Published Fri, Jul 21 2023 4:16 AM | Last Updated on Fri, Jul 21 2023 10:41 AM

Fraud in the name of 'Canadian Solar' - Sakshi

కర్నూలు: ముచ్చటైన ఆఫర్లు.. కళ్లెదుటే లాభాలు.. చుట్టుపక్కల వాళ్లను జతచేస్తే బోనస్‌లు, ఇన్సెంటివ్‌లు. అకౌంట్‌లోకి తేరగా వచ్చి పడుతున్న డబ్బును చూసి అందరికీ ఆశ కలిగింది. ఒకరిని చూసి మరొకరుగా చేరుతుండటంతో కొత్త స్కీమ్‌లు తెరపైకి వచ్చాయి. రూ.100 కడితే రూ.2 వేల ఆదాయం వస్తుండటంతో కంపెనీకి విస్తృత ప్రచారం లభించింది. కొత్త అకౌంట్ల సంఖ్య పెరగడంతోపాటు వ్యాపారం రూ.కోట్లకు చేరింది. అంతా సజావుగా సాగుతున్నట్టు అనిపించినా ఒకానొక రాత్రి ఆ కంపెనీ చీకట్లో కలిసిపోయింది. లబోదిబోమంటున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 

ప్లేస్టోర్‌లో పుట్టుకొచ్చి .. 
ప్లేస్టోర్‌ వేదికగా పుట్టుకొచ్చిన కెనడియన్‌ సోలార్‌ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఆన్‌లైన్‌ కార్యకలాపాలను ప్రారంభించింది. ఐదు నెలల కాలంలో అందమైన ఆఫర్లతో వేలా­ది మందిని బుట్టలో వేసుకుంది. కాఫీ తాగుతు­న్న విదేశీ యువతి ఫొటోను డీపీగా పెట్టుకుని 97904 01505, 44 7467 135 221 నంబర్లతో వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా ఖాతాదారులకు కంపెనీ దగ్గరైంది. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లతో ఒకరి తర్వా­త ఒకరు లాభాలకు ఆకర్షితులయ్యారు. మొదట్లో డబ్బు చెల్లించడమే తరువాయి.. వెంట­వెంటనే డబ్బు వస్తుం­డటంతో నమ్మకంతోపాటు ఖాతాదారుల సంఖ్య కూడా పెరిగిపోయింది. 

కొత్త స్కీమ్‌లతో విస్తరణ 
మొదట 45 రోజుల స్కీమ్‌తో ఈ కంపెనీ ప్రా­రంభమైంది. ఆ తర్వాత నెల రోజులు.. 15 రో­జు­లు.. 10 రోజులు.. 3 రోజులు.. చివరగా ఒక్క రోజు కాల వ్యవధితోనూ స్కీమ్‌లు నడిపింది. 45 రోజుల స్కీమ్‌లో డబ్బు డిపాజిట్‌ చేసిన వాళ్ల­కు వెనువెంటనే ఖాతాల్లోకి డబ్బు చేరుతుం­డటం.. ఆ వివరాలను చూసి మరికొందరు ఆ స్కీమ్‌లలో చేరడం జరిగిపోయింది. పది రోజు­ల స్కీమ్‌లో ఒకసారి రూ.47 వేలు కడితే.. 10 రోజు­ల వరకు రోజూ రూ.21,374 చొప్పున అకౌంట్ల­లో జమ చేస్తారు. ఒక్క రోజు స్కీమ్‌ (ఎనర్జీ స్టో­రే­జ్‌ సిస్టమ్‌)లో రూ.13,500 చెల్లిస్తే అదే రోజు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత రూ.29,700 చెల్లిస్తామని కంపెనీ నమ్మబలికింది.  

రెఫర్‌ చేస్తే బోనస్‌ 
ఖాతాదారులను ఆకట్టుకునేందుకు చైన్‌ లింకును తెరపైకి తెచ్చింది. ఒకరికి లింకు పంపిస్తే బోనస్‌ను నిర్ణయించింది. ఆ లింకు డౌన్‌లోడ్‌ చేసుకున్న వ్యక్తి రూ.13,500 చెల్లిస్తే.. చేర్పించిన వ్యక్తికి రూ.1,800 బోనస్, 700 పాయింట్లు, అదనంగా రూ.600 సబ్సిడీ బోనస్‌ కలిపి రూ.3,500 చెల్లిస్తుంది. ఇలా జాయిన్‌ చేసిన వారి వివరాలను వాట్సాప్‌ చాట్‌లో నమోదు చేస్తే ఒక ప్రోమో కోడ్‌ వస్తుంది. ఆ కోడ్‌ను తమ వద్దనున్న యాప్‌లో రివార్డు కాలమ్‌లో ఎంటర్‌ చేయగానే బోనస్‌ మొత్తం అకౌంట్‌లో జమ అవుతుంది. 

చీకట్లో కలిసిపోయింది.
నమ్మకమే పెట్టుబడిగా ఏర్పాటైన ఈ కంపెనీ చీకట్లో కలిసిపోయింది. ఎంతగా అంటే.. ప్లే స్టోర్‌లో కూడా సమాచారం లేకుండాపోయింది. చివరకు సెల్‌ఫోన్ల నుంచి కూడా యాప్‌ దానంతటదే డిలీట్‌ అయ్యిందంటే కంపెనీ నిర్వాహకుల తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది.

స్పందన’లో ఫిర్యాదు  
కెనడియన్‌ సోలార్‌ యాప్‌లో డబ్బులు డిపాజిట్‌ చేస్తే రెట్టింపు మొత్తం తిరిగి ఇస్తామని చెప్పి మోసం చేశారని కర్నూలు నగరం బుధవారపుపేటకు చెందిన అర్ఫత్‌ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌కు ఈ నెల 17న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. రూ.2.85 లక్షలు ఆన్‌లైన్‌లో డిపాజిట్‌ చేస్తే రూ.13 లక్షలు చెల్లిస్తామని నమ్మించి మోసం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement