కర్నూలు(రాజ్‌విహార్): వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జలకళ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంతో మెట్ట భూముల్లో ఉచితంగా బోర్లు వేస్తున్నారు. అంతేకాకుండా ఉచితంగా విద్యుత్ కనెక్షన్, మోటార్ కూడా ఇస్తున్నారు. దీంతో చిన్న, సన్నకారు రైతులకు జలకళ పథకం వరంగా మారింది. ఒకప్పుడు వర్షాధారంపై కనాకష్టంగా సంవత్సరానికి ఒక పంట పండించేవారు. నేడు సమృద్ధిగా నీరు ఉండడంతో మూడు పంటలు పండిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు.
766 బోర్లలో సమృద్ధిగా నీరు
జలకళ పథకం కింద రెండున్నర ఎకరాల్లోపు భూమి ఉన్న సన్నకారు రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి డ్వామా (జిల్లా నీటి యాజమాన్యపు సంస్థ) అధికారులు అర్హుల జాబితాను సిద్ధం చేశారు. సీనియారిటీ ప్రకారం జిల్లాలో 1100కు పైగా బోర్లు చేశారు. వాటిలో 766 బోర్లలో నీరు పడ్డాయి. దీంతో రెవెన్యూ డివిజన్ల వారీగా జాబితాను విద్యుత్ శాఖ కర్నూలు ఆపరేషన్స్ అధికారులకు అందజేశారు. దీని కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఆయా బోర్లకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంతోపాటు సరఫరా ఇవ్వాలని డ్వామా అధికారులు కోరారు.
సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళిక
వైఎస్సార్ జలకళ పథకం కింద వేసిన 766 బోర్లకు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సన్నకారు రైతులకు చేదోడుగా నిలవడంతోపాటు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. జలకళ పథకం కింద వివిధ పనుల కోసం రూ.26,60,27,751 నిధులు కావాలని అంచనాలు తయారు చేసి పంపించారు.
కర్నూలు టౌన్, కర్నూలు రూరల్, నంద్యాల, ఆదోని, డోన్ డివిజన్ల వారీగా కావాల్సిన ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, లెన్త్ ఆఫ్ లైన్, ఏబీ స్విచ్‌లు, ఇతర సామగ్రి కావాలని అడిగారు. మొత్తం 620కి పైగా ట్రాన్స్‌ఫార్మర్లకు రూ.3.80కోట్లు, 8,837 విద్యుత్ స్తంభాలకు రూ.1.59కోట్లు, 767 కిలో మీటర్ల విద్యుత్ వైరుకు రూ.2.26కోట్లు, 72.540 కిలో మీటర్ల విద్యుత్ వైరుకు రూ.39.70లక్షలు, ఇతర సామగ్రి, సివిల్ పనులు, లేబర్ చార్జీల కోసం రూ.9.25కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆమోదం లభించడంతో డ్వామా అధికారులు నిధులు విడుదల చేశారు.
నాణ్యతతో పనులు
ఉమ్మడి జిల్లాల్లో జలకళ కింద వేసి బోర్లకు కనెక్షన్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ముఖ్యంగా మొదటి వేసిన బోర్లకు సీనియారిటీ ఆధారంగా విద్యుత్ సరఫరా అందిస్తూ వస్తున్నారు. మొదటి విడతలో రూ.2లక్షల లోపు నిధుల అంచనాలో ఉండే 71 బోర్లకు కనెక్షన్లు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కర్నూలు ఆపరేషన్స్ ఎస్‌ఈ నేతృత్వంలో పనుల నాణ్యతతో చేశారు.
విడతల వారీగా పనులు
వైఎస్సార్ జలకళ పథకం కింద 766 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని డ్వామా అధికారులు విన్నవించారు. రూ.26.60 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపగా ఆమోదం లభించింది. డ్వామా అధికారులు నిధులు చెల్లిస్తున్న మేరకు విడతల వారీగా పనులు పూర్తి చేసి, కనెక్షన్లు మంజూరు చేస్తున్నాం. – కె. శివప్రసాద్ రెడ్డి, ఎస్‌ఈ, కర్నూలు ఆపరేషన్స్, విద్యుత్ శాఖ
నాడు వర్షాధారం.. నేడు సమృద్ధిగా జలం
నడిపి వెంకయ్య స్వామి. ఓర్వకల్లు మండలం ఎన్. కొంతలపాడు గ్రామ వాసి. తనకున్న మూడెకరాల పొలంలో వర్షాధారంపై వివిధ పంటలు సాగు చేసేవాడు. ప్రకృతి సహకరిస్తేనే దిగుబడులు వచ్చేవి. లేదంటే అప్పుల కుప్ప మిగిలేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతు దశ తిరిగింది. వైఎస్సార్ జలకళ పథకంతో పొలంలో ఉచితంగా 600 అడుగుల లోతు బోరు వేశారు. రెండు ఇంచుల నీరు పడడంతో విద్యుత్ అధికారులు రూ.2,61,229 వెచ్చించి ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాలు, విద్యుత్ వైర్లు అమర్చి కనెక్షన్ ఇచ్చారు. సర్వీసు నంబర్ 8322317000412ను విడుదల చేశారు. సమృద్ధిగా నీరు ఉండడంతో ఈయన కూరగాయల పంటలు పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment