
సాక్షి, అమరావతి: ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు చెందిన నిపుణులు విజయవాడ విద్యాధరపురంలోని ఏపీఎస్‌ఆర్టీసీ సెంట్రల్ హాస్పిటల్‌లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చారని ఏపీఎస్‌ఆర్టీసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డీవీఎస్ అప్పారావు తెలిపారు. ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వైద్య సేవల సమయాలను ఆయన శనివారం మీడియాకు విడుదల చేశారు. క్యాపిటల్ హాస్పిటల్స్, అమెరికన్ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్, శ్రీగాయత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వంశీ హార్ట్ కేర్ సెంటర్ యాజమాన్యాలు ఆర్టీసీ ఉద్యోగులకు ఉచిత కన్సల్టేషన్ సూపర్ స్పెషాలిటీ సేవలను అందించనున్నాయన్నారు.
► యూరాలజీ: ప్రతి నెల 1వ, 3వ మంగళవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు క్యాపిటల్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది చూస్తారు.
► అంకాలజీ: 1వ, 3వ బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు శ్రీగాయత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారు.
► అంకాలజీ: 2వ, 4వ బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వారు చూస్తారు.
► కార్డియాలజీ: 1వ, 3వ గురువారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు క్యాపిటల్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందిస్తారు.
► కార్డియాలజీ: 2వ, 4వ గురువారం మధ్యాహ్నం 12–2 గంటల వరకు వంశీ హార్ట్ కేర్ సెంటర్ వైద్య సేవలు అందిస్తారు.
► దీంతోపాటు ప్రతి గురువారం ఒక రేడియాలజిస్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అల్ట్రా సౌండ్ స్కాన్ నిర్వహించేందుకు అందుబాటులో ఉంటారు.