
సాక్షి, ఒంగోలు : విద్యుత్ సంస్కరణల విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని ,లేనిపోని అపోహలు సృష్టించవద్దని ఆ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ఉచిత విద్యుత్‌కి ఎటువంటి విఘాతం కలగదని అన్నారు. ఎట్టి పరిస్థితిలో రైతులు డబ్బు కట్టే పరిస్థితి రాదని బాలినేని స్పష్టం చేశారు. రైతులు ఒక్క రూపాయి కట్టే పరిస్థితి వస్తే తన మంత్రి పదవి వదులుకుంటానని తెలిపారు. (రైతుల ఖాతాలోకే విద్యుత్ సబ్సిడీ)
మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పధకం ఎట్టి పరిస్థితిలో ఆపే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఆనాడు ఉచిత విద్యుత్ గురించి వైఎస్సార్ మాట్లాడితే ..తీగల మీద బట్టలు ఆరవేసుకోవాల్సిందే అని చంద్రబాబు ఎద్దేవా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాలినేని గుర్తుచేశారు. విద్యుత్ గురించి మాట్లాడితే బషీర్ బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలో భాగంగా రైతులకు ,ఉచిత విద్యుత్‌కు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బాలినేని తెలిపారు. రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే డబ్బులు జమచేసి ఆ బిల్లు డబ్బును డిస్కం ఖాతాలో జమచేయడం ద్వారా రైతులకు ఎటువంటి నష్టం లేదని మంత్రి బాలినేని పేర్కొన్నారు.
కాగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతన్నల అజమాయిషీ పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసింది. ఈ పథకం ద్వారా ఇంతకాలం విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు)కు చెల్లిస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఇక నేరుగా రైతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ తరువాతే ఆ డబ్బు డిస్కమ్‌లకు చేరుతుంది. ఉచిత విద్యుత్తు ద్వారా వ్యవసాయదారులు ఎంత కరెంట్ వాడుకున్నా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment