
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై కడప రిమ్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలుపుదల చేసింది. రామ్‌సింగ్‌పై యురేనియం కార్పొరేషన్ ఉద్యోగి ఉదయ్‌రెడ్డి దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని మేజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. కడప రిమ్స్ పోలీస్ ఇన్‌స్పెక్టర్, ఫిర్యాదుదారు ఉదయ్‌రెడ్డిలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ రామ్‌సింగ్ వేధిస్తున్నారంటూ ఉదయ్‌రెడ్డి కడప కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేయగా.. దానిని పరిశీలించిన మేజిస్ట్రేట్ నిబంధనల ప్రకారం దాన్ని పోలీసులకు పంపి విచారణ జరిపి కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు కడప రిమ్స్ పోలీసులు సీబీఐ అదనపు ఎస్‌పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రామ్‌సింగ్ హైకోర్టులో బుధవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రమేశ్ విచారణ జరిపారు. రామ్‌సింగ్ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపించారు.
వివేకా హత్య కేసులో దర్యాప్తును అడ్డుకునేందుకే ఉదయ్‌రెడ్డి తప్పుడు ఆరోపణలతో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారని హరినాథ్ తెలిపారు. ఉదయ్‌రెడ్డి ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పోలీసులు నిబంధనల ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాల మేరకే రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేశారని వివరించారు. కోర్టు ఆదేశాలిచ్చినప్పుడు వాటిని అమలు చేయడం మినహా పోలీసులకు మరో మార్గం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment