గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో స్థానికులతో మాట్లాడుతున్న మంత్రి రజని
సాక్షి, అమరావతి, నెట్‌వర్క్: ప్రతి ఇంటా ఘన స్వాగతం.. ఆత్మీయ ఆదరణ.. ఆప్యాయతతో కూడిన పలకరింపులతో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం రెండో రోజైన గురువారం వేడుకగా కొనసాగింది. స్థానిక ప్రజా ప్రతినిధుల రాకతో ఊరూరా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. సంక్షేమ, అభివృద్ధి పథకాలను పారదర్శకంగా సంతృప్త స్థాయిలో తమ గడప వద్దకే చేరవేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజానీకం నిండు మనసుతో ఆశీర్వదిస్తోంది. పింఛన్ల నుంచి ఫీజుల దాకా.. ఇళ్ల పట్టాల నుంచి అమ్మ ఒడి వరకు మూడేళ్లలోనే 95% హామీలను నెరవేర్చి ప్రజల చెంతకు చేరుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
లబ్ధిదారులకు సీఎం రాసిన లేఖలను ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి అందిస్తున్నారు. సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తుండటంతో మంచి స్పందన లభిస్తోంది. సచివాలయాల సిబ్బందితో కలసి వలంటీర్లు పర్యటనల్లో పాల్గొంటున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వైఎస్సార్ కడప జిల్లాలో రెండో రోజు కూడా కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కష్టాలు తీరిన ఆనందం ప్రజల్లో కనిపిస్తోందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గురువారం సచివాలయం వద్ద మీడియాతో పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తమ వద్దకు వస్తున్న నాయకులకు ప్రజలు నీరాజనం పడుతున్నారని చెప్పారు.
తప్పనిసరిగా బుక్‌లెట్స్‌తో వెళ్లాలి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ఇంటింటా విశేష ఆదరణ లభిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి సమాచారంతో తప్పనిసరిగా బుక్‌లెట్స్‌తో శాసనసభ్యులు, సమన్వయకర్తలు ఇంటింటికీ వెళ్లాలని సూచించింది. తగినంత సమయాన్ని కేటాయించి ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరంగా తెలియచేసి ఆయా కుటుంబాలకు అందుతున్న లబ్ధిని మరోసారి వివరించాలని తెలిపింది. వారితో మిస్డ్ కాల్ చేయించాలని, ఇంకా ఏమైనా సమస్యలుంటే నోట్ చేయాలని సూచించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment