
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనులు పరిశీలించనున్నట్టు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సోమవారం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఒడిశా ఎంపీ ప్రసన్న ఆచార్య అడిగిన ప్రశ్నలకూ ఆయన సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైన దళితులు, ఆదివాసీలకు పునరావాసం, పునర్నిర్మాణం ప్యాకేజీలో ప్రత్యేకంగా కేటాయిస్తున్న అదనపు ప్యాకేజీ ఏదైనా ఉందా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా అధికారి పునరావాస ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారా? అంటూ కనకమేడల ప్రశ్నించారు. దీనికి షెకావత్ సమాధానమిస్తూ.. అర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోందని.. దళితులు, ఆదివాసీలకు అదనపు ప్యాకేజీ అందిస్తోందని వివరించారు.
అదనంగా రూ.50 వేల చొప్పున గ్రాంటు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.10 లక్షల సాయం అన్ని నిర్వాసిత కుటుంబాలకు ఇస్తున్నట్లు తెలిపారు. పునరావాస ప్రక్రియ పరిశీలనకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైందన్నారు. పునరావాస ప్రక్రియలో దళితులకు, ఆదివాసీలకు తగినంత ఉపశమనం ఇవ్వలేదని కనకమేడల అనుబంధ ప్రశ్న వేస్తూ ఈ ప్రక్రియ కోసం కేంద్రం ఎంత సాయం చేసిందని ప్రశ్నించారు. మంత్రి సమాధానమిస్తూ.. పునరావాస ప్రక్రియలో సమకూర్చే వసతుల విషయంలో పెద్ద జాబితా ఉందని, వాటన్నింటినీ ప్రస్తావించారు.
ఈ సమయంలో.. ఒడిశా నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారా? అని ఒడిశా ఎంపీ ప్రసన్న ఆచార్య ప్రశ్నించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. సుప్రీంలో ఈ అంశం విచారణలో ఉన్నందున దీనిపై ప్రకటన చేయడం సముచితం కాదన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ ఇదే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కొన్ని నివేదనలు ఉన్నాయి.. కేంద్రమంత్రి పోలవరం ప్రాజెక్టును సందర్శించాలి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలి. దీనివల్ల నిర్వాసితులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని సంప్రదించేందుకు వీలవుతుంది..’ అని ప్రస్తావించారు. మంత్రి బదులిస్తూ.. ‘కార్యాలయ తరలింపు పరిశీలనలో ఉంది. పార్లమెంటు సమావేశాలు పూర్తయిన వెంటనే పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనులను పరిశీలిస్తాం..’ అని సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment