ఎల్బ్రస్ శిఖరంపై గంధం భువన్ , ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడితో ఆయన కుమారుడు గంధం భువన్
సాక్షి, అమరావతి: ఎనిమిదేళ్ల బాలుడు ఎత్తైన పర్వతాన్ని అధిరోహించాడు. యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన ప్రముఖ శిఖరం ఎల్బ్రస్‌ను అతి పిన్న వయసులోనే అధిరోహించిన తొలి భారతీయ బాలుడిగా రికార్డు సృష్టించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడి కుమారుడైన గంధం భువన్ రష్యాలోని ఎల్బ్రస్ పర్వతం (5,642 మీటర్లు)ను ఈ నెల 18వ తేదీన అధిరోహించి చరిత్ర సృష్టించాడు.
అనంతపురానికి చెందిన కోచ్ శంకరయ్య, విశాఖపట్నానికి చెందిన పర్వాతారోహకుడు, అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ చాంపియన్ భూపతిరాజు వర్మ, కర్ణాటక నుంచి నవీన్ మల్లేష్ బృందంతో కలిసి భువన్ సెప్టెంబర్ 11న రష్యాకు బయలుదేరాడు. ఈ నెల 12న టెర్స్‌కోల్‌లోని మౌంట్ ఎల్బ్రస్ బేస్‌కు వెళ్లిన ఆ బృందం 13 వ తేదీన 3,500 మీటర్లు అధిరోహించి తిరిగి బేస్ క్యాంప్‌కు చేరుకుంది. అక్కడ కొంత శిక్షణ అనంతరం 18వ తేదీన 5,642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వత శిఖరాన్ని చేరుకుని ఉదయం 8:00 గంటలకు (మాస్కో సమయం) మన జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. ఈ బృందం ప్రస్తుతం పర్వతాన్ని దిగి బేస్ క్యాంప్‌నకు చేరుకుని ఈ నెల 23న భారత్‌కు తిరిగి రానుంది.
తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కోచ్ శిక్షణతోనే
ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న భువన్ తల్లిదండ్రుల ప్రోత్సాహం, శిక్షకులు అందించిన మెళకువల వల్లే తాను ఈ ఘనతను సాధించినట్టు వీడియో సందేశంలో పేర్కొన్నాడు. దేశంలో చాలామంది ప్రతిభావంతులైన పిల్లలున్నారని, వారికి తగిన ప్రోత్సాహం, అవకాశం కల్పిస్తే అద్భుతమైన రికార్డులు సృష్టిస్తారని స్పష్టం చేశాడు. అతి శీతల వాతావరణం సవాల్‌గా మారినప్పటికీ, పలు ఇబ్బందులు చవిచూస్తూ తాను అనుకున్న విధంగా సాహసోపేతమైన యాత్రను ముగించినట్టు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment