
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనునిత్యం రాష్ట్ర ప్రతిష్ట మంటగలిపేలా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు కొద్ది రోజులుగా గంజాయి సాగు, రవాణాపై అసత్యాలు ప్రచారం చేస్తున్న తరుణంలో నాలుగేళ్ల క్రితం అప్పటి టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడిన మాటలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గంజాయి సాగు, రవాణాకు సంబంధించి 2017లో విలేకరుల సమావేశంలో గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘గంజాయి సాగు వైజాగ్‌కు ఒక మచ్చలా మారింది.
ఈ విషయం అందరినీ కలచి వేస్తోంది. విదేశాల్లో కావచ్చు.. ఇతర రాష్ట్రాల్లో కావచ్చు.. ఇతర ప్రాంతాల్లో కావచ్చు.. గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు వైజాగ్‌లో ఉండటం చాలా బాధాకరం. దీనిని చివరకు ఏ స్టేజీకి తెచ్చారంటే.. స్కూల్ బస్సుల్లో కూడా రవాణా చేస్తుండటం దారుణం. చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లే బస్సుల్లో గంజాయి రవాణా అవుతుందంటే ఇవాళ పరిస్థితి ఎక్కడకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
కొన్ని యూనివర్సిటీలు గంజాయికి అడ్డాగా ఉన్నాయి’ అని అప్పట్లో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతుండటంతో టీడీపీ నేతల అసలు రంగు ప్రజలకు అర్థమవుతోంది. ‘ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో గంజాయి సాగు 1970కి ముందు నుంచే ఉందనే విషయం ఎవరికి తెలియదు? ఇకనైనా తమ పార్టీ పెద్దలు ఆ విషయం జోలికి వెళ్లక పోవడం ఉత్తమం’ అని స్థానిక టీడీపీ నేతలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment