కోనసీమ నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఏ పూటా ఎలాంటి లోటు రానివ్వలేదు. ముంపులో ఉన్నా అన్నీ అందించారు. మీరందించిన ఈ సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రీ ఇలా మా లంకల్లోకి రాలేదు. 2006లో వైఎస్సార్ మా బాధలు తెలుసుకుని ఇళ్లు ఇస్తే ఆయన బిడ్డగా ఇవాళ కష్టంలో మీరు ఆదుకుంటున్నారు’ అంటూ కోనసీమ లంక గ్రామాల్లో వరద బాధితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వరద ప్రభావిత లంక గ్రామాల్లో సీఎం జగన్ మంగళవారం విస్తృతంగా పర్యటించి బాధితుల్లో మనో ధైర్యాన్ని నింపారు.
ఊడుమూడిలంకలో...
‘ఈ గ్రామంలో దాదాపు 1,000 మంది నివాసం ఉంటున్నారు. మీ అందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతా. మీకు అందితే అందాయని, లేకపోతే లేదని చెప్పండి. మీరు చెప్పే దాన్నిబట్టి కలెక్టర్‌కు మార్కులు వేస్తా. ప్రతి ఇంటికీ 25 కేజీల బియ్యం, కిలో పప్పు, లీటర్ పామాయిల్, లీటర్ పాలు, కేజీ టమోటా, కేజీ ఉల్లిపాయలు, కేజీ ఆలుగడ్డలు అందాయా? లేదా?’ అని ప్రశ్నించగా తమకు అన్నీ అందాయని ముక్తకంఠంతో చెప్పారు. ‘మరి కలెక్టర్‌కు మంచి మార్కులు వేయవచ్చా?’ అని సీఎం ప్రశ్నించగా వందకు వంద ఇవ్వాలని ప్రజలు కోరడంతో కలెక్టర్ శుక్లా పనితీరును సీఎం మెచ్చుకున్నారు.
అరిగెలవారిపేటలో...
తనను కలిసేందుకు స్థానికులంతా ఒకేసారి ముందుకు రావడంతో అభ్యంతరం చెప్పిన భద్రతా సిబ్బందిని సీఎం వారించారు. స్థానికులను పిలిచి వారితో ఆప్యాయంగా సమస్యలను తెలుసుకున్నారు. తమ గ్రామానికి సీఎం రావడం ఇదే తొలిసారి అని, గతంలో ఎవరూ ఇంత దగ్గరగా తమ కష్టాలు తెలుసుకోలేదని బాధితులు పేర్కొన్నారు. వశిష్ట గోదావరి పాయకు వంతెన నిర్మించాలని జి.పెదపూడి లంక వాసులు సీఎం జగన్‌ను కోరారు. గత పాలకులు ఆరుసార్లు టెంకాయ కొట్టినా ఫలితం లేదని నివేదించారు. వంతెన నిర్మాణ బాధ్యత తనదని సీఎం ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
బురదలో వెళ్లి గుడిసెలు పరిశీలిస్తూ..
పడిపోయిన తమ గుడిసెలను చూడాలని అరిగెలవారిపేట బాధితులు కోరడంతో సీఎం జగన్ బురద మట్టిలో నడిచి వెళ్లి పరిశీలించారు. వరద సమయంలో ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వివరిస్తూ అరిగెల మనోరంజని అనే మహిళ ముఖ్యమంత్రి ఎదుట కన్నీటి పర్యంతమైంది. అక్కడే ఉన్న గ్రామ వలంటీర్‌ను అమ్మా కళ్యాణి.. అంటూ దగ్గరకు పిలిచి కొత్త పించన్లు వస్తున్నాయా? అని సీఎం ఆరా తీశారు.
దాణా అందిందా?
అక్కడి నుంచి ఊడిమూడిలంక చేరుకున్న సీఎం జగన్‌కు చిన్నారులు గులాబీలతో స్వాగతం పలికారు. మీరంతా బాగా చదువుకోవాలమ్మా అంటూ సీఎం వారిని ఆశీర్వదించారు. పాడిరైతులు కుసుమ జేమ్స్, మాతా ఆనందరావు, కుసుమ ధనరాజు, పరమట నాగరాజును సీఎం ఆప్యాయంగా పలకరించి పశువుల దాణా అందిందా? అధికారులు ఎలా చూసుకుంటున్నారు? అని ఆరా తీశారు. వరద సహాయక పశువైద్య శిబిరాన్ని సీఎం సందర్శించి వెటర్నరీ జేడీతో మాట్లాడారు.
చిన్నారికి నామకరణం చేసిన సీఎం
తమ ఏడు నెలల కుమార్తెకు నామకరణం చేయాలని కుసుమ సంజీవరావు, అనిత దంపతులు కోరడంతో సీఎం జగన్ ఆ చిన్నారిని ఆప్యాయంగా ముద్దాడి తన మాతృమూర్తి విజయమ్మ పేరును పెట్టారు. తన రెండేళ్ల కుమారుడు తరపట్ల గౌతమ్ కుడి చేతికి మూడు వేళ్లతో జన్మించాడని చిన్నారి తండ్రి వెంకట్రావు చెప్పడంతో శస్త్ర చికిత్స చేయిస్తామని సీఎం చెప్పారు. మూడు లంక గ్రామాల్లో బాధితులను పరామర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో బూరుగులంక నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి తమ గ్రామానికి రావాలని కోరడంతో సీఎం అంగీకరించారు. షెడ్యూల్‌లో లేకున్నా మహిళలతో కలిసి కొబ్బరి తోటల్లోంచి బురద మట్టిలో నడుచుకుంటూ వెళ్లి బాధితులతో మాట్లాడారు.
ఆపదలో ఆదుకున్నారు
Published Wed, Jul 27 2022 4:43 AM | Last Updated on Wed, Jul 27 2022 4:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment