తిరుపతి సిటీ/తిరుమల: ప్రపంచంలో భారత్ మహా శక్తివంతమైన దేశంగా నిలవనుందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలు అవగాహనతో వినియోగించుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య, ఆర్థిక సేవలు, పేదలకు పక్కా గృహాలు, ఆహార భద్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించడానికి ప్రధాని మోదీ సర్కార్ చర్యలు చేపట్టిందన్నారు.
కేంద్ర సంక్షేమ పథకాలతో పౌరులకు లభించే ప్రయోజనాలు, వివిధ సౌకర్యాలను మారుమూల గ్రామీణ లబ్ధిదారులకు చేరవేసేందుకు వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఉచిత ఆరోగ్య సంరక్షణ కోసం ఏడాదికి రూ.5 లక్షలు అందించేందుకు ఆయుష్మాన్ భారత్ యోజన, పేదల పక్కా గృహాల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మంచినీటి కోసం జల్ జీవన్ మిషన్, రైతుల కోసం పీఎం కిసాన్, పీఎం కిసాన్ సమ్మాన్, పిల్లల పౌష్టికాహారం కోసం పోషణ్ అభియాన్, పేదరిక నిర్మూలన కోసం దీన్‌దయాల్ అంత్యోదయ యోజన, ఉజ్వల యోజన, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పీఎం జన్‌ధన్, పీఎం జన్‌ఔషధి యోజన, పీఎం స్వామిత్ర, పెన్షన్ యోజన, ముద్ర యోజన, డిజిటల్ ఇండియా, పీఎం ఫజల్ యోజన, విశ్వకర్మ యోజన, ఉపాధి కల్పన కోసం స్టార్టప్ ఇండియా, అంకుర భారత్, స్వదేశీ దర్శన్, ఉడాన్ పథకం వంటి పథకాలను అందిస్తోందన్నారు.
ప్రతి పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశ పౌరుల ప్రయోజనమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్ర«థమ ఉద్ధేశమన్నారు. అనంతరం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, నగరపాలక సంస్థ మేయర్ శిరీష, కమిషనర్ హరిత పాల్గొన్నారు.
తిరుమల చేరుకున్న గవర్నర్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సోమవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని రచన అతిథి గృహం వద్ద గవర్నర్‌కు టీటీడీ చైర్మన్ భూమున కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. గవర్నర్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment